Chicago Visit - DAY ONE
2018 ఏప్రిల్ 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు రిచ్మండ్ విమానాశ్రయంలో బయలుదేరి 8 గంటలకు చికాగో ఓహెర్ (O'HARE) విమానాశ్రయంలో దిగాము. ఇక్కడో విషయం చెప్పాలి. ప్రయాణ సమయం రెండు గంటలైనా - రిచ్మండ్ కీ, చికాగో కీ మధ్య Time Difference గంట ఉండటంతో మాకు ఒక గంట సమయం బోనస్ గా మిగిలింది. అక్కడనుండి కార్లు అద్దెకి తీసుకునే రెండు, మూడు కంపెనీలు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశాయి. మేము AVIS సంస్థకు చెందిన బస్సు ఎక్కి అక్కడ కారు అద్దెకి తీసుకుని తిన్నగా డౌన్ టౌన్ కు వెళ్ళాము. ఇక్కడ రిచ్మండ్ కంటే చలి కాస్త తక్కువగానే ఉంది.
1. మిలీనియం పార్కు దగ్గర దిగి చుట్టూ ఉన్న ఆకాశ హర్మ్యాలను చూస్తూ ఉంటే, అలా చూస్తూనే ఉండాలని అనిపించింది. అక్కడ Cloud Gate Plaza, Silver Bean చూశాము. చిక్కుడు గింజ ఆకారంలో ఒక పెద్ద గాజు గోళం మెరిసిపోతూ ఉంది. దాని మీద చుట్టూ ఉన్న భవనాలతో పాటు మన ప్రతిబింబాలు కూడా చిత్ర విచిత్రంగా కనబడ్డాయి. దాని చుట్టూ తిరిగి రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకున్నాము.
2. దానికి ఎదురుగా JAY PRITZKER PAVILION ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. ప్రేక్షకులు కూర్చోడానికి GREAT LAWN పేరుతో ఒక పెద్ద పచ్చిక మైదానం కూడా ఉంది.
3. ఆ పక్కనే Crown Fountain ఉంది. అక్కడ దీర్ఘచతురస్రాకారంలో రెండు పెద్ద పెద్ద డిజిటల్ గోడలపైన రెండు రూపాలు (ఒకటి ఆడ, రెండోది మగ) కేవలం ముఖాలు మాత్రమే భిన్న హావభావాలను ప్రదర్శిస్తూ కనబడ్డాయి. వాటి మీద నీటి జల్లులు కూడా పడతాయట. అయితే ఆసమయంలో సాంకేతిక లోపం వల్ల పడలేదు. అందువల్ల ఆ ప్రత్యేకతను మేము చూడలేదు.
4. దానికి ఎదురుగా ఉన్న Wringley Square లో ఉన్న Founders of Millennium Park - Monument దగ్గర కూడా ఫోటోలు తీసుకున్నాము. ఆ పార్కు వ్యవస్థాపకులు పేర్లు చాలా అక్కడ లిఖించారు.
5. అలా ముందుకు వెళ్తే రహదారి పక్కనే The Art Institute of Chicago అని ఒక బోర్డు, పెద్ద భవనం కనబడ్డాయి. అయితే మేము ఆ లోపలి వెళ్ళలేదు.
6. ఇంకా నడుచుకుంటూ డౌన్ టౌన్ లో భవనాలు, దుకాణాలు, కార్యాలయాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. అక్కడక్కడా రోడ్డుకు ఇటువైపు భవనం నుండి అటువైపు భవనానికి Foot Over బ్రిడ్జ్ లు కట్టారు. రోడ్డు పక్కన నడుస్తుంటే, అడుగడుగునా Beggars కనబడ్డారు. ఆర్ధిక సహాయం చేయమని కోరుతూ - అట్టలమీద రకరకాల స్లోగన్లు రాసుకుని, వాటిని చేతిలో పట్టుకుని ఉన్నారు. కొంతమంది సంగీత వాయిద్యాలు Play చేస్తూ, పాటలు పాడుతూ ఉంటే - వారి ముందు ఉన్న Cloth మీద, చాలా మంది, కరెన్సీ నోట్లు, నాణేలు వేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఎంతో హడావిడిగా అటు, ఇటూ తిరుగుతూనే ఉన్నారు. కొంతమంది సిగరెట్లు, చుట్టలు కాల్చి, రోడ్ల పక్కన, ఎక్కడ పడితే అక్కడ పడవేయడం గమనించాను.
7. దాదాపు కిలోమీటరు పైన నడిచి, Wills Tower దగ్గరకు వెళ్ళాము. దీన్నే ఇదివరకు SEARS TOWER గా వ్యవహరించేవారట. లోపలి వెళ్ళాక Booking Counter కోసం గ్రౌండ్ లెవెల్ నుండి రెండు అంతస్తులు కిందకు వెళ్ళాము. Wills Tower గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికి వారు చూసి తీరవలసిందే కానీ, వర్ణించడం చాలా కష్టం. ఇది 103 అంతస్తుల భవనం. రోజూ కొన్ని వేల మంది దీన్ని దర్శించడానికి వస్తారు. రెండు పెద్ద పెద్ద లిఫ్టులు ఉన్నాయి. వీటిలో కేవలం 60 సెకన్లలో పైకి వెళ్ళాము. 103వ అంతస్థులో చుట్టూ ఉన్న అద్దాల గోడల లోంచి కిందకు చూస్తే, మనుషులు, కదులుతున్న వాహనాలు చిన్న చిన్న నలకల్లా కనబడ్డాయి. బహుళ అంతస్థుల భవనాలు కూడా అగ్గిపెట్టెల్లా కనబడ్డాయి. ఈ దృశ్యాలను మరింత వివరంగా చూసేందుకు రెండు SKY DECK లు అంటే అద్దాలతో భవనం బయటికి బాక్సుల్లాగా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అందరికీ ఫోటోలు తీస్తారు. మనం కూడా ఫోటోలు తీసుకోవచ్చు. 103వ అంతస్తులో రెండు సార్లు అటు, ఇటు తిరిగి మళ్ళీ లిఫ్ట్ లో కిందకు వచ్చేశాము. మొత్తానికి ఇదొక గొప్ప అద్భుతమైన అనుభవం.
8. అక్కడ నగరం మధ్యలో చికాగో రివర్ ఉంది. అది ఒక పెద్ద కాలువ లా ఉంది. దాని మీద అటునించి ఇటు, ఇటునుంచి అటు వాహనాలు, మనుషులు తిరగడానికి వీలుగా అడుగడుగునా చాలా వంతెనలు నిర్మించారు. ఆ నదిలో WATER TAXI అంటే స్టీమర్లు కూడా తిరుగుతున్నాయి. అది ఎక్కుదామని MADISON STREET వరకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడ నుంచి MICHIGAN AVENUE వరకు CHICAGO WATER TAXI లో వెళ్ళాము. లాంచి లోపల కూర్చోకుండా, పైన Open Top మీద కుర్చీల్లో కూర్చుని - అటు, ఇటూ భవనాలు చూస్తూ నదిలో ప్రయాణం మాకు ఎంతగానో నచ్చింది. నదిలో నీళ్లకు ఆనుకునే పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. ఒక పెద్ద భవనంలో మొదటి 12 అంతస్తులు కేవలం కార్ల పార్కింగు కోసం కేటాయించడం గమనించాము. అక్కడ TRUMP HOTEL బిల్డింగు కూడా (చాలా పెద్దది) కనబడింది.
9. నగరంలో రోడ్లపైనుంచి మెట్రో రైలు మార్గం నిర్మించారు. రోడ్డు మధ్యలో సిమ్మెంటు స్తంభాలు వేయకుండా, రోడ్డుకు రెండువైపులా ఇనుప స్థంభాలపైన బ్రిడ్జి లా కట్టారు. రోడ్లపైన ఎదో పండగలు, ఉత్సవాలకు పందిళ్లు వేసినట్లు అనిపించింది. దీంతో ఆ మార్గాల్లో రోడ్లు కాస్త ఇరుకుగానే అనిపించాయి.
10. రహదారులకు ఆనుకునే పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు వరుసగా ఒకదాని పక్కన ఒకటిగా నిర్మించారు. అలా సాయంత్రం ఆరున్నరదాకా తిరిగి, అలసిపోయి, కారు పార్క్ చేసిన ప్రదేశం దాకా వెళ్లి, కారులో మా అమ్మాయి స్నేహితురాలు ఇంటికి ఇల్లినాయ్ లోని బఫెలో గ్రోవ్ కి వెళ్ళాము. దాదాపు 33 మైళ్ళు ఒక గంటలో చేరుకున్నాము. రాత్రి దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో సూర్యాస్తమయం అయ్యింది. మొత్తానికి ఈ రోజు చాలా బాగా గడిచింది. మా అమ్మాయి ప్రతీ విషయం వివరంగా తెలియజేస్తూ, ప్రతీ చోటా గుర్తుగా మాకు ఫోటోలు తీస్తూ, అన్నీ ఎంతో ఉత్సాహంగా చూపించింది. కాస్త కాలినడక తిరుగుడు ఎక్కువైనా - అన్నీ తృప్తిగా చూశాము.
🌸🌷🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి