”వినరో భాగ్యము విష్ణు కథలు” (74) : - ఎం బిందుమాధవి

 “సద్గతి:సత్కృతి:సత్తా సద్భూతి: సత్పరాయణ:
శూర సేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామున:”



“నిన్నటి వరకు నేర్చుకున్న శ్లోకాలు ఒక్కొక్కరూ కొన్ని కొన్ని చొప్పున చెబుతూ ఉండండి. వస్తున్నాను” అని బామ్మ వంట గదిలోనించి కేక వేసి చెప్పింది.


ఆ రోజు శ్లోకాలు ప్రారంభిస్తూ..‘సద్గతి:’ అంటే..మనకి తెలిసిన భౌతిక వస్తు విషయాలకంటే భిన్నమైనది, ఉన్నతమైనది ఒకటి ఉన్నది అనే స్పృహ కలిగి ఉండటం గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాము. అది ఏమిటో ఎవరైనా చెప్పగలరా” అన్నది బామ్మ.


“ఆ శ్రీమన్నారాయణుడు తన శక్తి చైతన్యంతో అన్ని చోట్లా వ్యాపించి ఉండి..మనలోకూడా..మన ఉనికికి, కదలికలకి, ఎదుగుదలకి కారణమవుతున్నాడు..అంతే కదు బామ్మా” అన్నాడు శ్రవణ్. “అవును మనలో కూడా ఆయన ఆత్మగా ఉన్నాడు అనే జ్ఞానం కలిగి ఉండటమే సద్గతి అంటే! అలా విశ్వం అంతటా నిండి ఉండి అత్యంత సమర్ధవంతంగా ఆయన చేసే నిర్వహణ, పోషణ, రక్షణ కార్యక్రమాలని ‘సత్కృతి:’ అంటారు.”


“ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెబుతాను. విన్న తరువాత..ఇంత ముఖ్యమైన విషయం చిన్నదే అయినా మనం ఇన్ని రోజులు ఎలా ఆలోచించలేదు అనే ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటి అంటే..ఆవులు, గేదెలు, మేకలు, గుర్రాలు, ఏనుగులు..ఇవన్నీ ఒకే జాతి పశువులు. కానీ రెండు గుర్రాల మధ్య, రెండు ఆవుల మధ్య కూడా భేదం ఉంటుంది. అంటే అది స్వజాతిలో భేదం అన్నమాట. ఉదాహరణకి..కొన్ని గుర్రాలు బలంగా, బరువుగా ఉంటాయి. వీటిని వ్యవసాయపు పనులకి ఉపయోగిస్తారు. మరి కొన్ని సన్నగా ఎత్తుగా ఉండి, వేగంగా పరుగెత్తుతాయి. వీటిని పందేలకి, దూరప్రయాణాలకి ఉపయోగిస్తారు. కొన్ని పొట్టిగా చిన్నగా ఉంటాయి. అవి కొండలు ఎక్కుతాయి.”


“ఇలాంటి భేదాలు ఆవులలో కూడా ఉంటాయి. ఉదాహరణకి మన దేశపు ఆవులకు వీపు మీద వెనుక ఎత్తుగా ఉంటుంది. దాన్ని సూర్యనాడి అంటారు. ఆ నాడి ద్వారా మన ఆవులు సూర్య రశ్మి నించి విటమిన్ ‘డి’ గ్రహిస్తాయి. అందుకే మన ఆవులు ఇచ్చే పాలల్లో పోషకాలు, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. వైద్యానికి కూడా ఉపయోగిస్తారు. కానీ అవి పాలు తక్కువ ఇస్తాయి. మన ఆవులకు పెద్ద పెద్ద చెవులు, పొడవాటి తోక ఉంటాయి. విదేశాల్లో ఆవులు బలంగా, లావుగా ఉంటాయి. వాటికి సూర్యనాడి ఉండదు. పొడవాటి తోక కూడా ఉండదు. ఎక్కువ పాలు ఇస్తాయి. కానీ ఆ పాలల్లో మన ఆవు పాల లాగా పోషకాలు, రోగ నిరోధక శక్తి ఉండదు.” ఇలా ఉండటాన్ని స్వజాతి భేదాలు అంటారు. 


“ఇంకా విజాతి భేదాలు అని ఒక రకం ఉంటాయి. అవి గుర్రాలు..ఆవుల మధ్యన, ఆవులు..గేదెలు మధ్యన, మేకలు..ఆవుల మధ్యన, ఉండే భేదాలని  విజాతి భేదాలు అంటారు.వాటి శరీర నిర్మాణం, రూపు రేఖలు, వాటి స్వభావం, అవి చేసే పనులు..ఇలా అన్నమాట. అలా కాక ప్రాణం ఉండి, ఎదుగుదల ఉండీ కూడా.. అంశ, అవయవ భేదాలు ఉంటే స్వగత భేదం అంటారు. ఉదాహరణకి మనుషులు..వృక్షాల మధ్యన ఉండేవి రెండింటిలో జీవం ఉంటుంది, రెండూ ఎదుగుతాయి. కానీ ..మనిషికి కాళ్ళు చేతులు ఉంటాయి. చెట్లకి కొమ్మలు, ఆకులు ఉంటాయి. ఇలా స్వజాతి, విజాతి, స్వగత భేదాలు ఇవేవి లేని విశ్వ చైతన్యంతో విరాడ్రూపంగా ఉండే శ్రీమన్నారాయణుని ‘సత్తా’ అని పిలుస్తారు. కొలుస్తారు. 


“ఉనికిలో ఉండి కూడా..దేశ, కాల, వస్తు పరిధులలో చెప్పలేనిది..ఇది లేదు అని నిరూపించలేనిది..ఇది కాకుండా మరేదో ఉంది అని నిరూపించలేని బ్రహ్మ పదార్థం..స్వజాతి, విజాతి, స్వగత భేదాలు లేనిది అయిన విష్ణుతత్వాన్ని ‘సద్భూతి’ అని చెబుతారు.”


“అన్ని అవసరాలు, కోరికలు తీరాక..ఆత్మ జ్ఞానం కలిగి..ఎవరైనా తమ ఉపాసనతో, ధ్యానంతో చివరికి కోరుకునే గమ్యం ఆ పరమాత్మనే! అలాంటి వారిని అక్కున చేర్చుకునే ఆ దేవ దేవుడిని ‘సత్పరాయణ:’ అంటారు.”


‘శూరసేనో’..ఎందరో వీరులు, హనుమంతుడి లాంటి శూరులు తన సైన్యంలో కలిగిన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడుని ఈ నామంతో పిలుస్తారు. అంతేకాదు..కంసాది రాక్షసులను వధించిన తరువాత..శూరసేనుడిని రాజుగా ప్రతిష్టించి రాజ్య పాలన చేసిన శ్రీకృష్ణుడిని కూడా ఈ నామంతో పిలుస్తారు. ఈ శ్రీకృష్ణుడు యదు వంశంలో జన్మించిన శ్రేష్ఠమైన వ్యక్తి. అందుకే ఆయనని ‘శూర సేనో యదుశ్రేష్ఠ’ అనే నామంతో పిలుస్తారు.”


“విష్ణు తత్వం తెలిసి, జ్ఞానవంతులైన యోగుల హృదయాలలో నివాసం ఉండే ఆ శ్రీమన్నారాయణుడిని ‘సంనివాస’ అనే నామంతో పిలుస్తారు. శ్రీకృష్ణుడిగా యమునా తీర నివాసులైన నంద గోపులు, దేవకీ వసుదేవులు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతలందరూ అంశలుగా జన్మించిన గోపబాలురు, ఋషులే అంశలుగా జన్మించిన గోపికలు..వీరందరితో కలిసి జీవనం సాగించినందువల్ల ఆ దేవదేవుడిని ‘సుయామున:’ అంటారు. 


“ఈ రోజు శ్లోకాలు, పాఠం మీకు నచ్చాయా” అని అడిగింది బామ్మ. 
“చాలా బాగుంది బామ్మా. మేము వెళ్లి ఆడుకోమా” అని అడిగి పిల్లలు ఒక్క ఉదుటన ఆటలకి పరుగులు తీశారు. 



కామెంట్‌లు