“వినరో భాగ్యము విష్ణు కథలు” (76) : - ఎం బిందుమాధవి

 “విశ్వమూర్తిర్మహాముర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ 
అనేకమూర్తిరవ్యక్త: శ్శతమూర్తిశ్శతాననః
ఏకో నైక సవ: క: కిమ్ యత్తత్పద మనుత్తమం 
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్త వత్సల:”



“మమ్మల్ని ఈ రోజు ఒక పెద్ద వనానికి పిక్నిక్ కి తీసుకెళ్లారు బామ్మా. అక్కడ బోలెడు పువ్వుల చెట్లు, పండ్ల చెట్లు, అవికాక ఇంకా పెద్ద పెద్ద ఆకాశాన్నంటే వేరే చెట్లు, సెలయేళ్ళు, ఆవులు, నెమళ్లు, కుందేళ్లు, బోలెడు పక్షులు ఉన్నాయి. ఎంత బాగుందో! మేము కుందేళ్లతో ఆడుకున్నాం. సెలయేరులో ఈత కొట్టాం. ఈత పండ్లు, జామ పండ్లు తిన్నాము. ముంజలు కూడా తిన్నాము”అని హరి, విష్ణు ఉత్సాహంగా చెప్పారు. 


“మరి మనం ఇవాళ్ల చెప్పుకుంటున్న శ్లోకం అదే కదా! ‘విశ్వమూర్తి’ అంటే..విశ్వం అంతా తన చైతన్యంతో అనేక రూపాలుగా విస్తరించుకున్నది ఆ శ్రీమన్నారాయణుడే కదా! అలా విశ్వం అంతా నిండిన ఆయన రూపం మహా శక్తివంతమైనది, బరువైనది అయి ఉన్నా కూడా..ఆయనని మహా బలవంతుడు, మరియు బలిష్టుడు అయిన ఆది శేషుడు తన వీపు మీద మోస్తూ ఉంటాడు” అనగానే..”బలవంతుడైన ఆ ఆదిశేషుడు కూడా ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపమే అని చెప్పావు కదా బామ్మా. అందుకే ఆయనని మొయ్యగలుగుతున్నాడు కదా!” అన్నాడు శ్రవణ్.


“అందుకే ఆయనని ‘మహామూర్తి’ అంటారు. అంతేకాదు ఆయన అత్యంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. జడత్వంతో ఉన్న సృష్టిని చైతన్యవంతంగా చేసేది ఆ శ్రీమన్నారాయణుడి సూర్యకిరణాల తేజస్సే కదా! అందుకే ఆయనని ‘దీప్తమూర్తి’ అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే..విశ్వం అంతటా నిండి, మహా బలవంతుడు, తేజోవంతుడు అయిన ఆ శ్రీమహావిష్ణువుకి ఒక నిర్దేశిత రూపము, ఆకారము అనేవి లేవు. అయినప్పటికీ.. జన్మ తీసుకోవలసిన కర్మ ఫలం అనేది ఆయనకి లేకపోయినప్పటికీ, అవసరాన్నిబట్టి అవతార స్వీకారం చేసి జన్మిస్తాడు” అని బామ్మ చెప్పగానే..


”ఆ:(..శ్రీరామ చంద్రుడు, శ్రీకృష్ణుడు, కపిలుడు, వామనుడు అలా జన్మించినవారే కదా బామ్మా” అన్నది శ్రావణి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అయితే కొంతకాలం పాటు ఈ భూమి మీద తిరిగి, రాజ్యపాలన చేసి అనేక మంది రాక్షసులని సంహరించి ప్రజలని, తన భక్తులని కాపాడారు” అన్నది.
"అవును. అసలు జన్మించవలసిన అవసరం లేని ఆ దేవ దేవుడు, అలా బహు మూర్తులుగా, బహు విధాలుగా తనని తాను వ్యక్తపరుచుకుని దుష్టులని శిక్షించి..తనని మనసులో నిలుపుకుని పూజించే వారికి ఆనందం కలిగిస్తాడు. అలా ‘ఏక’ రూపమైన ఒక్కడే, తన మాయ ద్వారా అనేక రూపాలుగా వ్యక్తమై మనకి అనుభవంలోకి వస్తున్నాడు.”
“సవ: క: కిమ్ యత్తత్పద మనుత్తమం’ అంటే ఆనందాన్ని తను పొందుతూ ఇతరులకి ఆనందాన్ని కలిగించే రూపం..అది స్వతస్సిద్ధమైనది. కృత్రిమంగా సృష్టించబడనది ఏదైతే ఉందో అది ఆయనే! అలాగే లోక కళ్యాణము మరియు పోషణ కొరకు చేసే యజ్ఞంలో సోమరసంగా ఆయనే భాసిస్తాడు. అందుకే ఆయనని ‘సవ:’ అంటారు. ప్రజా సృష్టి చేసి, ఆ సృష్టిని మరలా మరలా కొనసాగేటట్లు చేసి, రక్షించి, పోషించే ఆయన స్వతస్సిద్ధ తత్త్వం, మనకి ఉపాసన ద్వారా మాత్రమే దొరికే ఉత్తమ మోక్ష సాధనం.”
“లోకబంధుర్లోకనాథో”..లోకము అంటే జ్ఞానము, ప్రజలు అని కూడా అర్థం. ఆయన సృష్టించిన లోకము..సృష్టికి ముందు ఆయనయందే బంధించబడి ఉన్నది. లోకాన్ని పోషించటం ద్వారా ఆయన అన్ని జీవులకు బంధువు వంటి వాడు. అంతేకాదు..ఆయన ధర్మ పాలన అనే  బాధ్యత ద్వారా లోకాలని నిర్వహించి పాలిస్తాడు కాబట్టి ఆయనని లోకనాథుడు అంటారు.”
“మాధవో భక్తవత్సల:”  ‘మాధవ’ అనే నామం గురించి మనం ఇంతకు ముందు వివరంగా చెప్పుకున్నాము. అంతేకాదు.. భూభారాన్ని మోస్తాడు కాబట్టి మాధవుడు అని పిలుస్తారు. అలాంటి ప్రియమైన, మధురమైన కర్తవ్య నిర్వహణ చేస్తూ..భక్తులకి మంచి స్నేహితుడిగా ఉంటాడు. భక్తులు ఎప్పుడు ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఆ విషయం మనం గోకులంలో ఆయన శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు, అందరూ ఆయనతో ఎంత ప్రేమగా, స్నేహంగా ఉండి..ఆయనతో ఆడి పాడేవాళ్ళో కూడా తెలుసుకున్నాం కదా” అని బామ్మ పాఠం ముగించింది. 
కామెంట్‌లు