“వినరో భాగ్యము విష్ణు కథలు” (77) : - ఎం బిందుమాధవి

 “సువర్ణ వర్ణో హేమాఙ్గో వరాఙ్గ శ్చందనాఙ్గదీ 
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచలశ్చల:”


“శీను ఆలస్యంగా వచ్చావెందుకు. ఇంట్లో అందరూ క్షేమమేనా” అని అడిగింది బామ్మ. 
“అమ్మ నాన్న..బాబాయికి పిన్నిని చూడటానికి వెళ్లారు బామ్మా. అందుకే ఆలస్యమైంది” అన్నాడు శీను.
“ఆ మధ్యన ఎప్పుడో కూడా వెళ్లినట్టున్నారు. ఇంకా పిన్ని దొరకలేదా” అన్నది బామ్మ నవ్వుతూ. “బాబాయ్ అందంగా ఉంటాడు కదా! మా అమ్మలాగా అందంగా ఉండే అమ్మాయి కావాలట. అందుకే ఎవరు నచ్చట్లేదు” అన్నాడు..అందం గురించి నొక్కి చెబుతూ! 
“ఈ రోజు మన శ్లోకం ఆ శ్రీమహావిష్ణువు శరీర వర్ణం, ఆయన అంగ సౌష్టవం, ఆయన ధరించే ఆభరణాల గురించే”అన్నది బామ్మ. 
“శారీరకమైన అందం గురించి..శాస్త్ర ప్రకారం అవయవాల కొలతలు ఎలా ఉండాలి అనే విషయాలని మన వేదాలలో అశ్విని దేవతల స్తోత్రాలలో తెలియజేశారు. అన్ని అంగాలు సవ్యంగా ఉండి, అవి నిర్దేశించిన ప్రదేశంలో..నిర్దేశించిన కొలతలతో ఉండి, ముఖంలో చిరుమందహాసంతో కూడిన వర్చస్సు కలిగి ఉంటే వారు అందంగా ఉన్నారు అని చెబుతాము. అలా ఆ శ్రీమహావిష్ణువు.. ‘సువర్ణ వర్ణో’ అంటే బంగారు వర్ణం కలిగివుంటాడు” అని బామ్మ చెప్పగానే..”మరి ఆయన మేఘవర్ణుడు అని ఇంతకు ముందు చెప్పావు కదా” అన్నాడు హరి సందేహంగా! 


“మేఘవర్ణుడు అని చెప్పటంలో ఉద్దేశ్యం..ఆయన భక్తుల కోరికలు తీర్చటంలో.. వర్షించే మేఘం వంటివాడు కాబట్టి మేఘవర్ణుడు అంటారు. శుద్ధ స్వచ్ఛత కలిగిన వాడు కాబట్టి శ్వేత వర్ణుడు అని కూడా చెప్పొచ్చు. ఏ దోషాలు, కల్మషాలు లేకుండా ఉండే స్వచ్ఛతని తెలుపు రంగుతో పోలుస్తారు. అలాంటి స్వామిని ‘అనఘుడు’ అంటారు. ఇక సువర్ణ వర్ణుడు అనటంలో ఆంతర్యం ఏమిటంటే..బంగారం అనేది ప్రకాశించే లోహం. సాన పెట్టినకొద్దీ ప్రకాశిస్తుంది. దానికి ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. సూర్య కిరణాలు బంగారు రంగులో ప్రకాశిస్తాయి. అగ్ని యొక్క కాంతి బంగారు రంగులో ఉంటుంది. ఆ స్వామియొక్క  చైతన్య ప్రకాశంతో ఈ లోకాలు పోషింపబడుతున్నాయి కాబట్టి ఆయనని సువర్ణ వర్ణుడు అని పిలుస్తారు.”


“అలాగే అత్యంత ప్రసిద్ధమైన బంగారు ఆభరణాలు ధరించి శోభస్కరంగా వెలిగిపోతూ ఉంటాడు. ఆయన శరీర అవయవాలన్నిటికీ గంధం అలదుకుని ఉంటాడు. చందనపు పూత ..అంటే గంధం అలదు కోవటం అనేది రెండు విషయాలని తెలియజేస్తుంది. మంచి సువాసనను కలిగి ఉండి చల్లదనం కలిగించేది గంధం. పంచభూతాలలో ‘పృథ్వి’ కి ఉండే తన్మాత్ర స్పర్శ. నాసికకి ఉండే తన్మాత్ర వాసన. ఆ స్పర్శని, వాసనని కూడా  గంధంతో అన్వయించి చెబుతారు. ఎందుకంటే గంధపు స్పర్శ చల్లదనాన్ని కలిగిస్తుంది అని చెప్పాను కదా! చల్లదనం, వేడి అనేవి తెలిసేది స్పర్శతోనే కదా! అలా అన్నమాట. అలా హిరణ్య గర్భుడైన ఆ శ్రీమన్నారాయణుడు..బంగారు వర్ణ దేహ ఛాయతో, బంగారు ఆభరణాలు ధరించి, శరీరం అంతా గంధం అలదుకుని సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు.”


“ఆయన ధరించే ఆభరణాలు..చక్రం, గద, ధనుస్సుల గురించి ఇంతకు ముందు వివరంగా చెప్పుకున్నాం కదా!”


“మన జీవితాలలో అందానికి అత్యంత ప్రాధాన్యం ఉందని..ఇందాక శీను చెప్పిన దాన్నిబట్టి మనకి తెలిసింది కదా! అలాగే మనకి అత్యంత ప్రీతిపాత్రుడైన మన పోషకుడు అందంగా, ఆహ్లాదంగా ఉంటాడు అనే ఊహతో..అసలు రూపమే లేని ఆయనని.. మనకి నచ్చిన రూపంతో చిత్రించుకున్నామన్నమాట.”


“అంత సుందరమైన, సుకుమారమైన, కరుణా సముద్రుడైన  పరమాత్మ కూడా దుష్ట శిక్షణ చేసేటప్పుడు అత్యంత బలవంతుడిగా వీర్యవంతుడిగా, కఠినంగా ఉంటాడు. ఏ విషయంలో అయినా ఆయనతో సమానమైన వాడు మరొకడు లేడు. అందుకే ఆయనని ‘వీరహా విషమ శ్శూన్యో’ అంటారు. అంతేకాదు ఆయన పరిపూర్ణుడు కాబట్టి, ఆయనకి ఇంకా పొందవలసిన కోరికలు, తీరవలసిన ఆశలు అనేవి ఉండవు. భౌతిక విషయాలు అంటనివాడు కాబట్టి తన స్వరూపం నించి, సామర్థ్యం నించి చలనం లేక నిశ్చలంగా ఉంటాడు. చలనం లేని ఆయన మానవ దేహాల్లో మనసు రూపంగాను, బయట..లోపల కూడా వాయు రూపంగాను  ఎప్పుడు చలిస్తూ ఉంటాడు. తెలిసిందా” అని పాఠం ముగించింది. 



కామెంట్‌లు