నేను కలం కాగితం తీసుకొని
ఏదో వ్రాయాలని
సంసిద్ధుడనయ్యాను
కానీ
ఏఒక్కఊహతట్టదే
ఏదో వ్రాయాలి
ఎంతో వ్రాయాలి
దేశపౌరుల్లో ఉన్న అసంతృప్తినంతా
రాజకీయపు మాయికత్వానంతా
పుంఖానుపుంఖాలుగా
వ్రాయాలనుకున్నా
ఎక్కడినుండి మొదలు పెట్టాలో పాలుపోకుంది
అధర్మం ధర్మం పై
పైచేయిసాధించిన వైనాన్ని
దొంగ దొరగా చెలామణి అవుతున్న విధానాన్ని
తేటతెల్లం చేయాలని
కలం కాగితం పట్టాను
ఎంతకూ ముందుకు జగగదే
ఊహలు ఊపిరిపోసుకోవే
అభ్యుదయం
సమసమాజం
ఐకమత్యం
లౌకికత్వం
ఏక్తా గీతం
భిన్నత్వంలో ఏకత్వం
ఇలా పదాల ఎంపిక చేస్తుకున్నానో లేదో
ఎక్కడ ఏ పదం ఎలా
ఏ రీతిన ఉపయోగించాలో అనే లౌక్యం ప్రదర్శించాలని
ఒక పదం ముందు మరో పదం తర్వాత కొంత సమయం తీసుకుంటున్నానే...!?
మునుపటి పాత రాద్ధాంతాలు
వాడి వాడి చేవ చచ్చిన పదాలు
నేను నా కవితలో బహిష్కరిస్తున్నా
పదంపదంలో
విప్లవం
నిప్పుకణం
ఉవ్వెత్తున ఎగసిపడేలా
కలంతో నిప్పులు కురిపిస్తా
పీడిత తాడిత
కార్మిక కర్షక
పేద మధ్యతరగతి
జనబాహుళ్యపు గొంతుకై
పల్లవిస్తా
కలంతో మునుపెవ్వరూ
వ్రాయని
జనాభ్యుదయపు ఉపాధి ,ఉద్యోగ కల్పన
ఎజెండాను సిద్ధం చేస్తున్నా
నా కలాన్ని కత్తిలా వాడుతున్నా
పదునైన చురుకైన
ఆలోచనలు
ప్రతీ పౌరుడి లో పాదుకొల్పుతా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి