తెల్లంగతెల్లారిది
ఇగ తయారు గావాలే
ఇల్లిల్లూ గాలింపు చర్యలు చేపట్టాలే
కార్పోరేట్ చదువుల వర్తకులు వండివార్చిన
మోసపు మాటల ప్రకటనలకరపత్రాలను కంఠోపాఠం చేసుకోవాలె
శిశుతరగతి నుండి పదో తరగతి వరకు
ఏ అడ్మీషనైతే ఏంది!?
మన దోపిడీ బుట్టలో మాత్రం పడితీరాలి
మే నెల ఎండగొడతాంది, వడదెబ్బ తగులుతది అంటే కుదరదు
ఈయేడు
అడ్మీషన్లు ఎక్కువ తీసుకొస్తే
పాఠశాల యాజమాన్యంఇన్సెంటివ్ ఇస్తరంటా!?
జీతభత్యాలు పెంచుతరంటా!?
తెల్లారెవరకే
గడప గడప ప్రచారం మొదలు పెట్టాలె
పొద్దెక్కితే పేరెంట్స్ పనిపాటలకు పోతరు
ఏ ఒక్క అడ్మిన్ ఫామైనా నింపకుండా
ఫీజు కట్టించుకోకుండా పోతే
ప్రతీ రోజుమధ్యాహ్నం జరిగే రివ్యూ
మీటింగ్ లో
కరస్పాండెంట్ చీవాట్లు, కస్సుబుస్సులు
ఇట్లైతే మీరు ఇక ఇంటికే అని అంటారు
ఇక్కడ సీనియర్ టీచర్ ,
సబ్జెక్టు ఎక్స్పర్ట్ అనే భేషజాలేమి ఉండవు
నిర్ధాక్షిణ్యంగా తీసేసుడే
ఎద్దు పుండు కాకికి ముద్దు కాదుగదా!
సరుకే (పిల్లలు) లేకుండా దుకాణం ఎలా నడుపుతావు అని
బాహాటంగానే ప్రశ్నిస్తారు
ఏందిది దేవుడా!
పూర్వం మేమేదో పాపమే చేసుంటాము
మనసు చంపుకొని ప్రైవేటు టీచర్ కొలువు చేస్తున్నాము
మాకు మరో పనిపాటరాదు
ఆత్మగౌరవాన్ని చంపుకొని
ఈ అప్ అండ్ డౌన్ జీవితాలను
గడపడం నేర్చుకున్నాము
పుట్టెడు దుఃఖాన్ని గుండెలో దాచుకొని
కళ్ళలో ఆశల పూలు పూయిస్తున్నాము
నిత్యం బాధల బంగాళాఖాతాన్ని
ఒక గడ్డిపోచనాసరాగా చేసుకొని ఈదుతూ
ఆవలి తీరం చేరే ప్రయత్నం చేస్తున్నాం
ఈ అగాధంలో జలనిధులు ఏమీలేవు
దుఃఖజలంతప్పా
చావలేక బ్రతుకుతున్నాం
ఆకలి తీర్చలేని అక్షరమడ్డొచ్చి
ఆత్మ చైతన్యాన్ని పాదుగొల్పుకుంటున్నాం
చివరాఖరికి ఊపిరితో ఉంటామో
ఊపిరాగి దీర్ఘ నిద్రలోకి జారుకుంటమో!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి