తగిన సాయం: - ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
  తాళ్ళపల్లి గ్రామంలో వెంకన్న, వీరయ్య అనే ఇద్దరు యువకులు ఉండేవారు. ఇద్దరు వారం రోజుల పాటు విహారయాత్రకు వెళ్ళి, తిరిగి గ్రామానికి వస్తున్నారు. కొద్ది దూరమైతే వారు ఇంటికి చేరుతారు.
              అంతలోనే వాతావరణంలో మార్పు మొదలైంది. ఉరుములు, మెరుపులు మొదలైనాయి. వెంకన్న, వీరయ్యలు ఒక చెట్టు క్రిందకి వెళ్ళారు. కొద్ది దూరంలో ఒక వడ్ల కుప్ప వెంకన్నకు కనిపించింది గబగబా వెళ్లి, కుప్ప పక్కన ఉన్న ప్లాస్టిక్ కవర్ కప్పసాగాడు. వెనుకాలనే వీరయ్య వచ్చి, నీకేం పని లేదురా వెంకన్న ఏదో పని చేస్తూనే ఉంటావంటూ సహాయం చేస్తూ కోపగించుకున్నాడు.
         కాసేపట్లోనే వర్షం మొదలైంది. వర్షంలో ఇద్దరు దబదబా అక్కడికి వచ్చారు.  అరేయ్ వీరయ్య ఇప్పుడే వచ్చావా! మంచిగా వచ్చినావు బిడ్డా! ఈ వడ్లు మనవే పొద్దుగాలనే కోసి ఇక్కడ కుప్ప పోసినమూ, తినడానికి పోయి వచ్చేసరికి వాన అందుకుంది. నువ్వు లేకుంటే వడ్లు నానిపోయేవని తల్లిదండ్రులనేసరికి వీరయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరి వడ్లకో వెంకన్న సాయం చేస్తున్నాడని కోపగించుకున్న వీరయ్య వడ్లు తమవని తెలుసుకోగానే సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పటినుంచి తగిన సాయం అందరికీ చేయాలని నిశ్చయించుకుని, తోచిన సాయం చేయసాగాడు.
 



కామెంట్‌లు