రాచకార్యం: - ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
  సీతాపురం గ్రామంలో కనకయ్య అనే వ్యక్తి ఉండేవారు. తాను ఎప్పుడు, ఎక్కడో ఒకచోట ఉంటూ, సమస్యల పరిష్కారం, సమావేశాలలో ఉండేవాడు. ఇంట్లో క్షణం ఉండాలన్నా గగనమే. ఎప్పుడు తీరిక లేకుండా, ఎవరు పిలిచినా ఊరంతా తిరుగుతూ, తన మాటలతో అందరి మెప్పు పొందేవాడు.
               ఊరంతా కనకయ్యకు క్షణం తీరిక లేదని, మంచి మాటలు చెబుతాడనేవారు. వీరయ్య అనే వ్యక్తికి కనకయ్యను ఊరంతా మెచ్చుకోవడం నచ్చలేదు. ఒకరోజు వీరయ్య కోపంగా సరాసరి కనకయ్య ఇంటికి వెళ్ళి, కనకయ్య ఇలా ఊరంతా తిరిగి, ఉద్దరిస్తే సరిపోతుందా,  ఇంట్లో ఉండి, భార్యా పిల్లలతో కుటుంబం  సక్కదిద్దుకోవాలని తెల్వదా! అంటూ కనకయ్య భార్య జయతో అన్నారు.
               అన్నయ్య ఏం చేసినా ఆయన ఇంట్లో ఉండడం లేదూ, కాస్త ఆయన చేసే రాచకార్యాలను కాస్త మీరు చేయారాదని జయ అన్నది. ఓ దాందేముంది. ఎవరు వచ్చినా నా దగ్గరికి పంపుమని, వీరయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. అంతలోనే ఒకవ్యక్తి వచ్చి, మా ఇంట్లో జర గొడవ అవుతుంది. కనకయ్యను పంపమని అడుగగా, కనకయ్యకు బాగా జ్వరం వచ్చింది. జర కాస్త వీరయ్యను తీసుకవెళ్ళుమంది. ఇలా జయ అందరిని వీరయ్య దగ్గరకు పంపసాగింది. అందరు వీరయ్య దగ్గరకు వెళ్లి, తీసుకెళ్ళసాగారు. మెదట్లో సంతోషంగా వెళ్ళిన వీరయ్య, రెండు రోజులకే డీలా పడిపోయాడు. 
           వీరయ్య ఆగమాగంగా కనకయ్య ఇంటికి వెళ్ళి, ఇక నుంచి తన ఇంటికి ఎవరిని పంపవద్దని జయకు నమస్కరించి, రాచకార్యాలు పాడుగాను అంటూ ఇంటికి వెళ్ళి, దర్వాజా వేసుకున్నాడు. కనకయ్య, జయలు నవ్వుకుని, వచ్చే ప్రజల సమస్యలు తీర్చసాగారు.
           

కామెంట్‌లు