కటకటా మర్కట పుస్తకావిష్కరణ

 నీతి సందేశాత్మక బాల సాహిత్యం తోనే భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ మిషన్ సౌజన్యంతో వివేకానంద ప్రాంగణంలో సోమవారం ఆర్. సి. కృష్ణస్వామి రాజు రాసిన కటకటా  మర్కట పుస్తకాన్ని స్వామి సుకృతానంద  మహరాజ్ ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. వి. రవికుమార్ మాట్లాడుతూ వేదాలు ఉపనిషత్తులు ఆగమాల్లో సందేశాత్మక కథల ద్వారా జ్ఞానం అందించబడిందని పురాణ సాహిత్యంలో కూడా చిన్నపిల్లల కథలు ఎన్నో చెప్పబడిందని వివరించారు. విశిష్ట అతిథి భారతీయ విద్యాభవం డైరెక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ సమకాలీన చరిత్ర సాంస్కృతిక వైభవాలను అర్థం చేసుకోవడానికి బాల సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. పిల్లలను ఆకర్షించేలా కథనాన్ని నడపడంలో కృష్ణస్వామి రాజుది అందవేసిన చేయని ప్రశంసించారు. ఆత్మీయ అతిథి మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ విశ్వకవి  రవీంద్రనాథ్ ఠాగూర్ బాల సాహిత్యాన్ని ఆవిష్కరించిన తీరు  అసామాన్యమైనదని వివరించారు. పుస్తకాన్ని ప్రముఖ బాలసాహితీవేత్త కలవకొలను సదానందకు అంకితం ఇవ్వడం ఎంతో ముదావహమని రచయితను అభినందించారు. గరికపాటి  రమేష్ పుస్తక సమీక్ష చేశారు. కార్యక్రమంలో సంస్కార్ ఫౌండేషన్ నిర్వాహకులు రాజేష్,సతీష్, గంగిశెట్టి శివకుమార్, ఏ. మల్లేశ్వరరావు, చెన్నకేశవ నాయుడు పలువురు సాహితీవేత్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు
కామెంట్‌లు