గౌరవ కుటుంబికులారా!: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

కుటుంబం అంటే—
కేవలం నాలుగు గోడల మధ్య జీవనం కాదని తెలుసుకోండి,
నాలుగు హృదయాలు
ఒకే స్పందనగా కొట్టుకునే స్నేహసౌధంగా భావించండి॥

ఒకటిగా ఉండండి— వాన గాలులెన్ని విరుచుకుపడ్డా
వేర్లు విడనాడని వృక్షంలా నిలబడండి,
విపత్తులు ఎన్ని ఎదురైనా 
విడిపోని వెలుగులా నిలవండి॥

ఒకేతాటిపై నడవండి— అడుగులు వేరైనా
ఆశయాలు ఒక్కటై సాగండి,
మాటలు భిన్నమైనా 
మనసులు కలిసే మార్గమై ఉండండి॥

ఒకేమాటపై నిలబడండి—
నమ్మకం అనే నిటారుదీపాన్ని ఎప్పటికీ ఆరనీయకండి, 
అపార్థాల మబ్బులొచ్చినా 
ఆప్యాయతను సూర్యునిలా వెలిగించండి॥

“మేము అంతా ఒకటే” అని చాటండి—
అన్నదమ్ముల అనుబంధంలో,
అక్కచెల్లెళ్ల ఆప్యాయతలో,
తల్లిదండ్రుల త్యాగాల్లో ప్రేమ పరిమళం పంచండి॥

ఒకరికొకరమని నిరూపించండి—
కష్టాల్లో చేయూతగా నిలబడి,
కన్నీళ్లలో ఓదార్పుగా మారి,
సంతోషాల్లో నవ్వుల హారతిగా సహచరులై సాగండి॥

ఒకటే ఆశయం పెట్టుకోండి—
“మన కుటుంబ సంతోషమే మా సంపద”
అనే మహామంత్రం జపించండి,
అనురాగాల అమృతవర్షం కురిపించండి॥

కుటుంబం కలిసుంటే—
చిన్న ఇల్లు కూడా స్వర్గమవుతుందని చెప్పండి,
మనసులు కలిసుంటే—
చిన్న జీవితం కూడా మహాకావ్యమవుతుందని తెలపండి॥

కుటుంబాన్ని—
గౌరవంగా గుండెల్లో నిలుపుకోండి,
అనురాగంగా ఆత్మీయత పంచుకోండి,
ఆనందనిలయంగా వెలిగే అమృతబంధమని గుర్తించండి॥


కామెంట్‌లు