గాజుల వ్యాపారిగా కృష్ణుడు: - - యామిజాల జగదీశ్
 ఈ గాజు కేవలం గాజు కాదు. అది ఒక ప్రియమైన గాజు. అది గొప్ప గాజు. సాటి లేని గాజు...ఏ రంగు కావాలంటే ఆ రంగు గాజులు...రండమ్మా రండి...కొనండి గాజులు...ధరించి మురిసిపొండి...అంటూ గాజులమ్మే వాడిగా వచ్చాడు మాయ కృష్ణుడు.
అతను తనను తాను మణిహారినని పరిచయం చేసుకున్నాడు.
ఈరోజు మాయ కృష్ణుడు కాబోయే నాటకమేంటో...
అతని నుదుటిపై అందంగా దిద్దిన ఒక తిలకం.
అతని పెదవులపై ఒక మధురమైన చిరునవ్వు.
కృష్ణుడు వీధుల్లో తిరుగుతున్నాడు గాజులమ్మా గాజులు అని అరుస్తూ.
చేతుల్లో రంగు రంగుల గాజులు. 
కానీ అతని కళ్ళలోకి చూసిన వారెవరైనా, తమను తాము మరిచిపోతారు.
ఒకరు అడిగారు "ఓ మణిహారీ, ఈ గాజు ఎంత?” అని.
కృష్ణుడు మృదువైన చిరునవ్వుతో అన్నాడు "ఇది వెల కట్ట లేనిది…” 
“ఇది ప్రేమతో చేసిన గాజు...దీనిని ధరిస్తే, మీ మనస్సు ‘రాధా రాధా’ అనే నాదంతో వికసిస్తుంది. చేతికి వేసుకోవడంతోనే ఓ సన్నని నాదం ధ్వనిస్తుంది. అప్పుడా హృదయంలో బృందావనం కొలువుదీరుతుంది…” 
మణిహారి మాటలకు గోపికలు నివ్వెరపోయి నిల్చున్నారు. ఆశ్చర్య పోయారు. రెప్పార్పక అతనినే చూస్తున్నారు.
అబ్బో, ఇతను ఎలాంటి వర్తకుడో కదూ? అని అనుకున్నారు. వారి వాలకానికి అతను తన చిరునవ్వును బహుమతిగా ఇచ్చాడు…
అతను ఎవరి చేతిని తాకాడో, అతని గుండె వేగంగా కొట్టుకుంది. అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి. 
ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్న రాధ మనసులో మెల్లగా నవ్వింది.
చూసిన వెంటనే ఆమెకు తెలిసి పోయింది, అతను మామూలు గాజుల వ్యాపారి కాదని. అతను తన వెన్న దొంగ అని, తన ప్రేమను పొందడానికి వచ్చిన అపార కృష్ణుడే అని ఇట్టే గ్రహించింది.
కృష్ణుడు రాధ వైపు చూసిన క్షణం,
కాలం ఆగిపోయినట్లు అనిపించింది…
గాజుల గలగల శబ్దంలో, మనసంతా కరిగిపోయింది… 
కృష్ణుడు మెల్లగా అడిగాడు, “రాధా… నువ్వు గాజు కొంటావా?”
రాధ చిరునవ్వుతో అంది, "నేను నిన్ను నా హృదయంతో పెనవేసుకున్నాక ఈ గాజుతో నాకేం పని?”
ఆ రోజు, బృందావన వీధుల్లో,
ఒక విచిత్రమైన ఆనందోత్సవం వ్యాపించింది.
కృష్ణుడు, మణిహారి వేషంలో,
స్వయంగా ప్రేమను ఇచ్చుకోవడానికి వచ్చాడు.
ఈనాటికీ ఏ గుడిలో అయినా గాజుల శబ్దం విన్నప్పుడు…"రాధ” నామం వినగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. దరిదాపుల్లోనే కృష్ణుడు చిరునవ్వు చిందిస్తున్నట్లు అనిపిస్తుంది.
అతని దగ్గర కేవలం గాజులు మాత్రమే లేవు, అతను తన పేరును తన హృదయంపై ధరిస్తాడు. అతను ఒక సాధారణ గాజుల వ్యాపారి కాదు. స్వయంగా ప్రేమ గాజులను మోసుకొచ్చాడు.
అతని స్వరం విన్నవారు ఆగిపోయారు.
అతని కళ్ళల్లోకి చూసినవారు తమను తామే మరచిపోయారు.
ఆ గాజులు గాజుతో చేసినవి కావు,
అవి “రాధ” నామంతో తయారు చేసినవి. కృష్ణుడు ఇంకా ప్రేమను పంచుతూనే ఉన్నాడు. అది తెలుసుకోవడానికి అతనికి ఒక్క చూపు చాలు. 
“మణిహారి", వేషంలో, గాజులు అమ్మడానికి వచ్చిన కృష్ణుడు అసామాన్యుడేగా.

కామెంట్‌లు