సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -237: ఆవగింజ అట్టే దాశి-గుమ్మడికాయ కుప్పమీదేసుడు
***
"ఏంతెల్వి పాడైందో ఏమో అవ్వా! గాడిని సూత్తుంటే ఎట్ల బత్కుతడో ఏమో అని శిన్నప్పన్నించి గాని అమ్మనాయిన మస్తు రంది పడేటోళ్ళు. పెద్దబెరుగుతుంటే గానికే అన్ని తెలుత్తయి గని అసలే మొగ పొల్లగాడు అందట్ల అనబాకే శెల్లే! రేప్రేపు లగ్గం జేద్దమంటె పిల్ల దొరుకుడు కట్టమైతదని మా అమ్మ నాయినలు అంటుంటే యిన్నవ్వా!"
 "గింతకీ ఎవడే ఆడు? గీ నడ్మల పొల్లగాండ్లల్ల ఎవలే తెల్వి తక్కువోళ్ళు. సూశి రమ్మంటే గా అనుమయ్య లెక్క కాల్శొచ్చే రకాలే గని. గంత తెల్విమాలినోళ్ళు ఎవలున్నరు శెల్లే!"
 "ఎవలో కాదవ్వా! మా శిన్న కక్కయ్య కొడ్కు లచ్చినారి. గాడు శిన్నప్పన్నించి కాత్తంత మెతకోడు. గాడే యియ్యాల గింత పని సేశిండు. అయిన గని గా పొల్లకైన దమాక్ ఉండొద్దు. గీడుట్టి అమాయికుడు, తెల్విలేనోడని తెల్సి గట్లెందుకు బోవాలే. గిప్పుడు లబ్బదిబ్బ మొత్తుకుంటే ఏం ఫాయిదా. ముందే జాగర్త పడాలె. గీని మీద వొదిలేసి పోద్దా? "
 " అస్లేమయిందో శెప్పు శెల్లే? బంగారు వొత్తువులేమన్న పొయినయా ఏంది? గీ నడ్మల బంగారం పిరమైన కానుండి మాయ మాటలు జెప్పి మోసం జేసుడు,మెళ్ళ గొల్సులు గుంజకపోవుడు, దొంగతనాలు జేసుడు ఎక్వైనవి. బంగారు వొత్తువులు ఇంట్లే గాని ఒంటి మీద గాని వున్నయంటే అదుర్క సచ్చుడే పో. ఎప్పుడేం జర్గుద్దో తెల్వడంలే. ఎవల్ని సుత నమ్మేటట్టు లే."
 " అవునవ్వా! గిప్పుడు గదే జర్గింది. తమ్ముని పెళ్ళాం మొన్న గీ నడ్మల గాళ్ళ దగ్గరోళ్ళ పెండ్లుందని బేంకుల బెట్టిన నగలు దెచ్చుకుందట. ఉత్తుత్తప్పుడు పెట్టుకోనీకి గిల్టు నగలు ఇంట్లే ఉన్నయంట.అయితే ఏమైంది శెల్లే? గింతకీ గా నగలైతే బద్రంగున్నయి గద! "
" గవ్వే వుంటె గింత ముచ్చెటి ఎందుకుండేదవ్వా? మొన్న గా పొల్ల నాయినవ్వ గీ ఎండల్కి బెహోష్ అయ్యిందంటే గివి గిల్టువి ఏడున్నా ఏంగాదు గని గా బంగార్పివి బద్రం జెయ్యి జాగర్త బెట్టు. వొచ్చినంక బేంకుల బెట్టొత్త అన్జెప్పి పొయ్యిందంట. గీడేమొ గిల్టు నగల్ని  అతి జాగర్తగ దాశి బంగారం నగల్ని పిలాస్టిక్ డబ్బల బెట్టి శీర గట్టుకొని బొట్టు పెట్కొనే అద్దం వుంటది సూడు. గదేనవ్వా! డిరసింగు టేబిలు మీద బెట్టిండంట.  దూపైతుంది,నాల్కెండ్క బోతుంది కాశిన్ని మంచిళ్ళు గావాలనీ ఎవలో ఇద్దరొత్తే "అస్లే ఎండకాలమాయె. పాపం అన్కుంట సల్లని మంచిళ్ళు తెచ్చేతందుకు ఇంటెన్కకు కుండ కాడికి బోంగనే గాళ్ళు గా డబ్బని లుంగిల మడ్సుకుని ఇచ్చిన సల్ల నీళ్ళు దాగి పోయిండ్రంట.
"అయ్యో శెల్లే! గట్ల ఎవల్ని బడితే గాళ్ళని నమ్ముడేంది. గా బంగార్పివి బయట బెట్టుడేంది. "ఆవగింజ అట్టే దాశి గుమ్మడి కాయ కుప్పమీదేసుడు అన్నట్టుంది" గిదంత యింటుంటే. గింతకీ గయి బోయిన సోయి ఎప్పుడొచ్చింది."
 
"గియ్యాల పొద్దుగాల వాని పెళ్ళాం గా పొల్ల వొచ్చిందంట. రాంగనే సూస్కొని ఊరాడ ఏకమయ్యేటట్టు లబ్బ లబ్బ మొత్త్కుందంట.ఊల్లె అందరు గా పొల్లనే తలోమాటని ఎల్లిండ్రంట. గాడు అమాయికుడని లగ్గమైన కానించి సూత్తనే ఉంటివి.గట్లెట్ల వొదిలేసి పోయినవు" అన్నరంట. గిదంత మా శిన్న కక్కయ్య శెప్పిండు. టేషన్ల బొయ్యి పిర్యాదు రాశొచ్చిండ్రంట. శెయ్యి దాటినంక గవ్వొత్తయని ఎవలన్న శెప్పలేత్తమా అవ్వా! "
" అయ్యో శెల్లే! గిప్పుడసలే బంగారం మా పిరమాయే. లచ్చ రొండు లచ్చలు బెట్టిన గింతంత రాట్లే. గన్నన్ని లచ్చల బంగారం బాయె."
 అయిన శాన మందిరి యిలువ కల్లయేమో యాడబడ్తె ఆడ బడేత్తరు. యిల్వ లేనియేమో అతి జాగర్త శేత్తరు.గట్ల జేబట్టే గిట్ల జర్గె పాపం ఎప్పుడు శేయించుకుందో గయ్యి. "
" అవునవ్వా! పెండ్లికి  గా పొల్ల అమ్మ నాయినలు,మా శిన్న కక్కయ్యోళ్ళు బెట్టిన నగలయ్యి."
" అయ్యో శెల్లే! ఎట్లనన్న గా దొంగలు దొర్కితే బాగు."
 " గదండీ సంగతీ! "ఆవగింజ అట్టే దాశి గుమ్మడి కాయ కుప్పమీన ఏశినట్టుంది" అంటే గిదే మరి. ఆవ గింజంత ఇల్వ తక్వయి దాశి గుమ్మడి కాయంత యిల్వున్నయి గిట్ల పోగొట్టుకోడమంటే గిదే.ఇల్వను బట్టి జాగర్త పడాలె."
 "మొన్నటికి మొన్న సూడరాదుండ్రి ఊల్లకి కొందరొచ్చి మంచోళ్ళొతికె నమ్మకం కలిగిచ్చి బంగారం తక్వ దరకిత్తమన్కుంట యాభై లచ్చలు తీస్కొని పోయిండ్రంట. ఎంత నమ్మబల్కితే మాత్తరం గట్ల లచ్చలు లచ్చలు ఎవలన్న గాళ్ళ శేతుల బెడ్తరా! గిస్మంటియి సూశే గిట్ల సామెతల్తో పెద్దోళ్ళు శానా జాగర్తలు శెప్పిండ్రు. గయ్యి ఎప్పుడు మతికి బెట్టుకోవాలె."

కామెంట్‌లు