పరిమళపు సొరంగాలు తవ్వి
పువ్వుల స్మశానాల్ని నిర్మించి
విషపు నవ్వుల సమాధుల్ని పగలగొట్టి
అంతర్ముఖ చిరునామాల్ని వెతికి
గంధర్వ గరలాన్ని చిందించి
సర్పాల స్వరాలని సవరించి
మసక కుబుసాల్ని విసర్జించి
చీకటి కంటిని మూసివేసి
పాతాళానికి తాళం వేసి
అందమైన ముఖాన్ని నెలవంకను చేసి
బంధాల దారాల్ని రక్తంతో నింపి
మనసు మాయకు గాలి నింపి
కనిపించని ప్రాణాన్ని శ్వాసతో పీల్చి
స్పర్శతో మమతను తాకి
ప్రేమ గోపురంలో కర్పూరం వెలిగించి
తేలిపోయిన మేఘాల్ని కలిపి
ఆకాశాలయాల్లో వెలుగు వర్షం కురిపించి
తాపంతో మదిని బంధించి
జాలీ దయను హృదయాల్లోకి దించి
నిశ్శబ్దంగా రంగుల్ని కలిపి
శూన్యం శిథిలాల్లో చిత్రాలను గీసి
మౌనం గదుల్ని చీల్చి
శిలల్ని పూజించి తనువుల్ని చిరంజీవిగా మార్చి
మట్టి ఇంటికి ఆకాశపు కప్పు తయారుచేసి
హరితపు దీపం ఇంటిలో వెలిగించి
ధరణిపై నదుల్నిపారించి
గాలికి భూమికి బంధం వేసి
విత్తనాల అక్షింతలు తలపై పోసి
అన్నపూర్ణను చేసిన కరుణ గల కర్ణుడు వాడు
ఎవడు వాడు కరుణామయుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి