శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూర్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం: వెంకట్ , మొలక ప్రతినిధి

 పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 15 రోజుల వేసవి శిక్షణ శిబిరం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.
​జ్ఞానార్జనతో పాటు వ్యక్తిత్వ వికాసం:
ఈ శిబిరంలో విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా.. స్వామి వివేకానంద సాహిత్యం, యోగా, ధ్యానం, ఏకాగ్రతను పెంచే ఆటలు, శ్లోకాలు, చిత్రలేఖనం మరియు మెమరీ టెక్నిక్స్‌పై నిపుణులచే శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల అంతర్గత శక్తులను వెలికితీసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
​ఆదర్శవంతమైన జీవితానికి వివేకానందుడే స్ఫూర్తి:
కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రామకృష్ణ సేవా సమితి (తాండూర్) ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వేసవి సెలవులను వినోదానికే పరిమితం చేయకుండా విజ్ఞాన సముపార్జనకు వేదికగా మార్చుకోవాలన్నారు. సమయపాలన పాటిస్తూ, వివేకానందుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
​బలమే జీవనం - బలహీనతే మరణం:
శ్రీ రామకృష్ణ సేవా సమితి తాండూర్ కన్వీనర్ KVM వెంకట్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకోవాలంటే మానసిక బలం, సంస్కారం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. "బలమే జీవనం - బలహీనతే మరణం" అన్న వివేకానందుడి సూక్తిని ప్రతి విద్యార్థి తమ జీవితంలో అన్వయించుకోవాలని, సంస్కారవంతమైన విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.
​హాజరైన ప్రముఖులు:ఈ ప్రారంభోత్సవ వేడుకలో శ్రీ శారద విద్యా మందిర్ ప్రిన్సిపల్ సంతోష, ఉపాధ్యాయులు పద్మ, వైశాలి తో పాటు విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 15 రోజుల శిక్షణా తరగతులు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు.
కామెంట్‌లు