నాపాట: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
పల్లవి

నాపాట నోర్లలో నానాలి —
తేనెల తీయదనాలు పంచాలి॥
సుధలై హృదయాల్లో జారాలి —
శ్రావ్యమై వీనులకు విందునివ్వాలి॥

నాపాట గాలిలో తేలాలి —
గుండెల గూళ్ళలో నిలవాలి॥
కీర్తి కిరీటమై వెలగాలి —
మదుల్లో మధురమై మిగలాలి॥ ॥నాపాట॥

చరణం – 1

మల్లెల పరిమళమై విరియాలి,
మందార మాధుర్యమై మెరవాలి॥
కోయిల కుహూకుహులై పలకాలి,
కోట్లాది మనసులను అలరించాలి॥

పల్లెల పొలిమేర చేరాలి,
పట్టణ వీధుల్లో పరవశించాలి॥
పసివాడి నవ్వులా పులకించాలి,
పెద్దల మెప్పులూ పొందాలి॥ ॥నాపాట॥

చరణం – 2

వెన్నెల వాకిట్లో వెలగాలి,
వీణల స్వరాల్లో విహరించాలి॥
కన్నీటి చుక్కలను తుడవాలి,
కష్టాల చీకట్లను తరిమేయాలి॥

ప్రేమకు ప్రతిరూపమై నిలవాలి,
ప్రపంచానికే ప్రాణమై మారాలి॥
అక్షరాల హారమై అలరాలి,
ఆనంద గీతమై మార్మోగాలి॥ ॥నాపాట॥

చరణం - 3

గాయకుల గలగలా పాడించాలి,
శిశువులా పకపకా నవ్వించాలి॥
పశువులా తలలనూ ఊపించాలి, 
పామూలా పడగలూ ఎత్తించాలి॥

నవరాగమై నాట్యమాడించాలి,
చిరుగీతమై చిందులేయించాలి॥
వేణుగానమై మదులనూ మురిపించాలి,
సప్తస్వరాలై తన్మయత్వపరచాలి॥  ॥నాపాట॥  

చరణం – 4

పదమే పూవై పరిమళించాలి,
భావమే భానుడై ప్రకాశించాలి॥
రాగమై గంగలా పరవళ్ళుతొక్కాలి
రంజకమై జనహృదయాల్లో నిండాలి॥

తెలుగు తల్లికి తిలకమవ్వాలి,
తేటగీతమై తరతరాలుండాలి॥
హృదయాల్లో స్ఫూర్తిని నింపాలి,
గుండెల్లో చిరస్థాయిగా నిలవాలి॥ ॥నాపాట॥


కామెంట్‌లు