పిల్లల చదువుల గురించి ఒకనాటి తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు. తాము చేసే వృత్తినే పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పి, సంపాదించుకునేలా తయారు చేసేవారు. మనిషి జీవితంలో చదువు ప్రవేశించిన తర్వాత దాని ఉపయోగాలు తెలుసుకుని, ప్రభుత్వం విద్యను తప్పనిసరి చేసింది. విద్య నేర్చుకోవటం వలన వచ్చే ఉద్యోగాలు, డబ్బులు, సౌకర్యాలు అన్నింటినీ చూసి, చదువుకోవటాన్ని ప్రోత్సహించారు. సమాజాన్ని, తల్లిదండ్రులను విపరీతంగా ప్రోత్సహించి, చదువు వైపు దృష్టి మరల్చారు. ఆ ప్రోత్సాహం ఎక్కడి దాకా వెళ్ళిందంటే పిల్లలు ఎలా బాధపడినా పరవాలేదు కానీ, బాగా చదువుకుని బాగా డబ్బులు వచ్చే ఉద్యోగాలు చేయాలి. విదేశాలు వెళ్ళడం కూడా ఒక క్రేజ్‌గా తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లలు ఆనందంగా ఉన్నారా లేదా పిల్లల్ని చూసి మనం ఆనందంగా ఉన్నామా అని ఎవరూ ఆలోచించుకోలేక పోతున్నారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మా అమ్మాయి లండన్‌లో ఉన్నది అని గొప్పలు చెప్పుకోవటానికే తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు.తల్లిదండ్రుల అనారోగ్యంలో పిల్లలు దగ్గర ఉన్నారా లేదా మానవ సంతానాన్ని, వాళ్ళ ఆటపాటల్ని చూసి సంతోషపడుతున్నామా లేదా అని ఆలోచించే వారు లేరు. చదువు మీద, అది తెచ్చె డబ్బు మీద ప్రతీవారికి ఆశ, దురాశ ఎక్కువైంది.
పరీక్షలు, ర్యాంకుల మధ్య పిల్లల చదువులు కూరుకుపోయాయి. పిల్లలకు మానసిక సమస్యలు, జబ్బులు వచ్చినా పట్టించుకునేవారు లేరు. ఉన్నఊర్లో, ప్రక్క వీధిలో చదువులు పోయి హాస్టళ్ళలో, దూరాన ఉన్నపట్టణాల్లో చదివించటం ఫ్యాషన్ అయిపోయింది. పసి తనంలోనే తల్లిదండ్రుల్నివదిలి, హాస్టల్లో ఉండాల్సి రావటం పిల్లల పాలిట శాపమనే చెప్పాలి. మా అమ్మాయి హాస్టల్‌లో చక్కగా ఉంటుంది, మా అబ్బాయి మమ్మల్ని గుర్తు చేయడు అని గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ విద్యా వ్యవస్థ మారదు.
పెన్సిళ్ళు పట్టుకునేంత పటుత్వం లేని, రాని మూడేళ్ళ పిల్లల్నేస్కూళ్ళకు పంపేస్తున్నారు. ఏడు, ఎనిమిది తరగతుల నుంచే ఎంసెట్‌ల కోచింగ్‌లు ఇప్పిస్తున్నారు. మాటలు వస్తూ అప్పుడప్పుడే చిలక పలుకులు నేర్చుకుంటున్న సమయంలోనే ఐఏయస్‌లు చదివించాలని తాపత్రయపడుతున్నారు. సరిగ్గా ఈ ఆశల్ని పాఠశాలల యాజమాన్యాలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే దాకా పిల్లల్ని ఏ పని చేయనివ్వటం లేదు. ఎటు పోనివ్వడం లేదు. బయటి ప్రపంచం తెలియనివ్వడం లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి పుస్తకాలు, చదువు, మార్కులు అంటూ పిల్లల్ని భయపెడుతున్నారు.ఒక్క అర మార్కు తక్కువ వచ్చినా,
ప్రపంచం తలక్రిందులు అయిపోతుందనే భావం, భయం కలుగజేస్తున్నారు. ఫలితంగా మానసిక జబ్బులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.ఈ సమస్యల్ని ప్రతిబింబిస్తూనే నేనుతొలి పుస్తకం “పూలతోట” రాశాను. అరకొర జ్ఞానంతో చదువు చెప్పే టీచర్ల మధ్య నలిగిపోతున్న బాల్యం గురించి అందులో రాశాను. ఆ తర్వాత హరివిల్లు, నెలవంక పుస్తకాలు రాశాను. పిల్లలు పడుతున్న బాధుల గురించి నేను మా పిల్లల ఆసుపత్రిలో చూస్తూనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే ఉన్నాను. వీధికి ఒక స్కూల్ వెలుస్తూనే ఉన్నది. చిన్న ఊళ్ళలో సైతం ప్రైవేటు స్కూళ్ళు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉన్నాయి.
ఈ పుస్తకంలోని వ్యాసాలు మొదట ఈ రూపంలో లేవు. మా వారు పిల్లల డాక్టరు కావడం మూలాన, మా ఊరిలోని స్కూళ్ళ యాజమాన్యాలు పాఠశాల వార్షికోత్సవాలకు పిలిచేవారు. విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తూ, ప్రసంగించటానికి కావాల్సిన ఉపన్యాసాన్ని నేను తయారుచేసి పెట్టేదాన్ని. ఎందుకంటే డాక్టర్లు బిజీగా ఉంటారు కాబట్టి, వారి సమయం వృథా కాకుండా నేను రాసి పెట్టే దాన్ని.ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. విద్యా స్కూళ్ళలో ప్రస్తుత విద్యా విధానంలో ఉన్న లోపాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాల గురించి ఉపన్యాసించారు.
చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉపన్యాసాలు కేవలం మా ఊరికే పరిమితమయ్యాయి.వీటిని వ్యాసాలుగా మార్చి పత్రికలకు పంపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే అమలులో పెట్టాను. పత్రికలో అచ్చయ్యింది. చాలా మంది దగ్గర్నుంచి ప్రశంసలు లభించాయి. నాకు ఉత్సాహము లభించింది. ఇప్పుడు మా వారితో పాటు, నన్ను వార్షికోత్సవాలకు, పిల్లలకు బొమ్మలు, ఆర్ట్ నేర్పడానికి పిలిచేవారు. మా పిల్లల్ని స్కూళ్లో చేర్చడం వలన వచ్చిన అనుభవంతో పాటుగా, ఇలా స్కూళ్లకు వెళ్ళి పిల్లలు, టీచర్ల మధ్యన గడపడం వలన చాలా అనుభవం వచ్చింది. పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలనే విషయంలో టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడంలోనూ, రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడే నన్ను వారితో పాటు, సభ్యులుగా కమిటీలో ఉంచడం వలన నాకు అనుభవం వచ్చిందనుకుంటాను. మరికొన్ని పాత ఉపన్యాసాలను వ్యాసాలుగా మార్చి పత్రికలకు పంపటం జరిగింది. చాలా ఉపన్యాసాలు వ్యాసాలుగా మారి పత్రికలకెక్కాయి. కానీ అనేక ఉపన్యాసాలు బుట్ట దాఖలయ్యాయి. అంటే చాలా ఉపన్యాసాలను రాసి పెట్టుకోలేదు.రాసిన వాటిని దాచుకోలేదు. కొన్ని మాత్రం వ్యాసాలుగా రూపొందాయి.ఇలా వ్యాసాలుగా అచ్చు అయినవి అనేక మంది ప్రశంసలు పొందటంతో, పుస్తకంగా వేయాలనుకున్నాను.
మా పిల్లల ఆసుపత్రి ద్వారా అనేక పిల్లల సమస్యలను చూసి, పరిష్కారాలు చూపాలనుకన్నాను. చాలా వాటికి తోచిన పరిష్కారాలందించాను. తల్లి సంపాదించే డబ్బు కన్నా, పిల్లవాడికి తల్లి ఒడియే ముఖ్యమని
బలంగానే చెప్పాను. కళలంటే సమయాన్ని ఖర్చు చేసేవి కాదు. మనస్సును ఆహ్లాదపర్చేవి, తెలివితేటల్ని పెంచేవి అని వ్యాసంలో రాశాను. అందుబాటులో ఉన్న టీచింగ్ ఎయిడ్స్ ద్వారానే పిల్లల్ని చక్కగా విద్యావంతుల్ని చేయవచ్చునని నిరూపించాను. ఉపన్యాసాల నుంచి, వ్యాసాలుగా పత్రికల్లో ప్రచురింపబడి, అందరి నోళ్ళల్లో నాని ప్రస్తుతం పుస్తక రూపం దాల్చుతున్నాయి.
పిల్లలు ఏ పనీ నేర్చుకోకుండా లోక జ్ఞానం లేకుండా, కేవలం పుస్తకాలు, మార్కులు అంటూ చదువుకే పరిమితం చేస్తే, భవిష్యత్తులో ఎక్కువ చదువుకోవటం తప్పు అని చెప్పవలసి వస్తుంది. నిర్భంద విద్య వలన డిగ్రీలు వస్తాయి గానీ, జ్ఞానం పెరగదు. జ్ఞానం లేని చదువు వ్యర్థం. ఇలాంటి చదువుల వల్ల సమస్యలే కాదు, శారీరక సమస్యలు సైతం వస్తాయి. ఇప్పటికే ఆధునిక నాగరికత మూలంగా వ్యాయామం లేకుండా పోతున్నది. 24 గంటలు పిల్లలు చదువుకే పరిమితమైతే ఊబకాయం వస్తుంది. కళ్ళ జోడులు ఇప్పటికే పెరుగుతున్నాయి. మా చిన్నతనంలో విద్యార్థులకు కళ్ళజోళ్ళు రావటం మేము చూడలేదు. ప్రస్తుతం అనేక మంది విద్యార్థులకు చిన్నతనంలోనే దూర దృష్టి, దగ్గర దృష్టి లోపాలు వస్తున్నాయి.
పూర్వం సూళ్ళల్లో ఉపన్యాసించిన ఉపన్యాసాలన్నీంటిని నేను దాచుకుని ఉంటే బాగుండునన్న ఆలోచన ఉన్నది. కానీ లేవుకదా!, ఈ వ్యాసాలు చదివి తల్లిదండ్రులు మారాలని, తమ పిల్లలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. పిల్లల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరుగా, బాలల రచయిత్రిగా పిల్లల ఆనందాన్ని కాంక్షించే అమ్మగా పిల్లలకు బంగారు బాల్యం అందాలని కోరుకుంటున్నాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి