63 ఏళ్ల వయసులో, ఆమె ఈజిప్టులోని అతిపెద్ద చెత్తకుండీలోకి అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల పాటు ఆమె అక్కడే ఉండిపోయారు
ప్రాంతం : కైరో. 1971వ సంవత్సరం. భరించలేని దుర్వాసన మైలు దూరం నుంచే వచ్చేది.
మొత్తం మురికివాడ. ఈజిప్టు రాజధాని జనం చెత్తనంతా అక్కడ పడేసేది. అక్కడ 40,000 మంది నివసించేవారు. పైగా వారిని 'జబలీన్' అని పిలిచేవారు. అంటే "చెత్త ప్రజలు." అని అర్థం.
వారు కైరో చెత్తను చేతులతో వేరు చేసేవారు. ఏడు మిలియన్ల ప్రజల వ్యర్థాలు. ప్రతీరోజూ. ప్లాస్టిక్. గాజు. ఎముకలు. లోహం. పందుల కోసం ఆహార వ్యర్థాలు.
పాఠశాలలు లేవు. ఆసుపత్రులు లేవు. పంపునీరు లేదు. విద్యుత్ లేదు. అదీ ఆ ప్రాంతం తీరుతెన్నులు. అయితే ఈ స్థితిగతులు 63 ఏళ్ళ సిస్టర్ ఇమ్మాన్యుయెల్ ను కలచివేసింది. ఆందోళనపరిచింది. బూడిద రంగు సన్యాసిని వస్త్రాలు ధరించిన ఆమె ఒక ఫ్రెంచ్ జాతీయురాలు. ఆమె 40 ఏళ్లుగా దౌత్యవేత్తల కుమార్తెలకు సాహిత్యం బోధిస్తూ గడిపింది.
సురక్షితమైన పాఠశాలలు. గౌరవప్రదమైన ఉద్యోగం. హాయిగా విశ్రాంతి తీసుకునే పదవీ విరమణ ఆమె కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమె వాటన్నిటినీ వదిలి వచ్చేసింది.
ఆమె ఒకే ఒక ప్రశ్న అడిగింది: "ఈజిప్టులో అత్యంత పేద ప్రజలు ఎక్కడ ఉన్నారు?"
ఎవర్ని అడిగినా వారు ఠకుమని ఆ చెత్తకుప్ప వైపు చూపించే వారు.
ఆమె అక్కడికి వెళ్ళారు. తాను కూడా అక్కడే ఉండిపోవచ్చా అని అడిగారు.
ఆ "జబలీన్" లు ఆమె వైపు తదేకంగా చూశారు. ఇంతకుముందు అక్కడ నివసించడానికి ఎవరూ అడగలేదు.
వారు ఆమె కోసం ఒక కాంక్రీట్ గదిని నిర్మించారు. ఒక మంచం. ఒక శిలువ. ఒక బైబిల్. ఆమె అక్కడికి వెళ్లిపోయారు. ఆమె చూసినవి ఇవి...
అమ్మాయిలు పన్నెండేళ్లకే పిల్లలను కంటున్నారు. మళ్ళీ పదమూడేళ్ళకు. మళ్ళీ పద్నాలుగేళ్ళకు. ఇరవై ఐదేళ్లకే చనిపోతున్నారు.
చికిత్స చేయడానికి చిల్లర ఖర్చయ్యే ఇన్‌ఫెక్షన్లతో పిల్లలు చనిపోతున్నారు.
గాయాలను శుభ్రం చేసుకునే మార్గం లేక, పురుషులు రోజూ పగిలిన గాజు ముక్కలతో చేతులు కోసుకుంటు న్నారు.
అక్షరాస్యత శూన్యం. ఎవరూ తమ పేరు మీద సంతకం చేయలేరు.
ఆమె బోధించడానికి రాలేదు. వారిలో చాలా మంది అప్పటికే క్రైస్తవులు. ఆమె మతమార్పిడి చేయడానికి రాలేదు. ఆమె అక్కడే ఉండిపోవడానికి వచ్చారు.
ఆమె పిల్లలకు చదవడం నేర్పించడం మొదలుపెట్టారు. తల్లుల కోసం ఉత్తరాలు రాయడం. గాయాలకు కట్టు కట్టడం.
ఆ తర్వాత ఆమె మరింత పెద్ద పని చేసారు.
ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రజలు సోమరుల వల్ల పేదవారు కాలేదు. వారు చిక్కుకుపోయారు. వ్యవస్థ వారికి ఏమీ చెల్లించలేదు. సమాజం వారిని పట్టించుకోని వారిగా చూసింది. అందుకే ఆమె డబ్బు అడగడం మొదలుపెట్టారు.
ఫ్రాన్స్‌కు, యూరప్‌కు, ధనవంతులైన ఈజిప్షియన్లకు ఉత్తరాలు రాసారు.
ఆమె పట్టు వదలలేదు. 1980 నాటికి, ఆమె కట్టడాలు చేయడానికి సరిపడా డబ్బు పోగు చేసారు.
మొదట : ఒక ప్రాథమిక పాఠశాల. ఉచితం, ఏ జబలీన్ బిడ్డకైనా.
తర్వాత : ఒక క్లినిక్. నర్సులు. టీకాలు. ప్రాథమిక వైద్యం.
ఆ తర్వాత : ఒక మహిళా కేంద్రం. అక్షరాస్యత. నైపుణ్య శిక్షణ. ఆశ.
ఆ తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన : ఆమె ఒక ఇంజనీర్‌ను కనుగొన్నారు. ఒక కంపోస్టింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. కొండలంత పంది పేడను ఎరువుగా మార్చారు. దాన్ని పొలాలకు అమ్మారు.
"జబలీన్"లకు ఆదాయం వచ్చింది.
ఆమె గర్భనిరోధక మాత్రలు కూడా పంచారు. పన్నెండేళ్ల చిన్న అమ్మాయిలకు కూడా.
ఇదంతా వాటికన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
అయినా ఆమె కనురెప్ప కూడా వాల్చలేదు. తన పని తాను చేపట్టారు.
"నేను పేదలతో ఉన్నాను," అన్నారు ఆమె. పేదలకు ఏది అవసరమో అది చేస్తానన్నారు.
ఆమె ఆ మురికివాడలో ఇరవై సంవత్సరాలు జీవించారు, ఈజిప్షియన్ వేసవి కాలాలను, వ్యాధుల వ్యాప్తిని, రాజకీయ గందరగోళాన్ని తట్టుకుంటూ!!
సరైన మంచి నీళ్లు లేవు. కరెంటు లేదు. మరుగుదొడ్డికి బదులుగా ఒక బకెట్.
ఆమె అక్కడే వృద్ధురాలు తయారు. జుట్టు తెల్లబడింది. ముఖం ముడతలు పడింది.
ఆ "జబలీన్" ప్రజలు ఆమెను "ఓం ఇమ్మాన్యుయెల్" అని పిలిచేవారు. అంటే "తల్లి ఇమ్మాన్యుయెల్" అని.
ఆమె వారి గురించి పుస్తకాలు రాసారు. ఆ పుస్తకాలు ఫ్రాన్స్‌లో అమ్ముడయ్యాయి. ఆమె అనుకోకుండా ప్రసిద్ధి చెందారు.
1980ల చివర నాటికి, ఆమె పేరు ఇంటింటా తెలిసిపోయింది. జాతీయ టీవీలో కనిపించింది. అధ్యక్షులను కలుస్తూ ఉండేవారు.
ఆమె కీర్తిని ప్రతి క్షణం డబ్బు సేకరించడానికి ఉపయోగించుకున్నారు.
1993లో, 84 ఏళ్ల వయసులో, ఆమె మత సంస్థ ఆమెను ఇంటికి తిరిగి వెళ్ళమని బలవంతం చేసింది.
ఆమె 22 ఏళ్లుగా ఈజిప్టులో ఉన్నారు. అందులో ఇరవై ఏళ్లు మురికివాడలోనే ఉన్నారు.
ఆమె అలసిపోయారు. కానీ ఆమె ఆగలేదు. ఆమె తన చివరి పదిహేను సంవత్సరాలు నిధుల సేకరణకే కేటాయించారు. టీవీ. రేడియో. ఉపన్యాసాలు. పుస్తకాలు...
లక్షలాది రూపాయలు సేకరించారు. ఎనిమిది దేశాలకు విస్తరించారు. లెబనాన్. సూడాన్. బుర్కినా ఫాసో. ఫిలిప్పీన్స్....
ఫ్రెంచ్‌లోని ఒక వృద్ధాశ్రమంలో నిరాడంబరంగా జీవించారు. ఆమెకంటూ సొంతంగా ఏమీ లేదు. సంపాదించిన ప్రతి యూరోను సహాయక ప్రాజెక్టులకే పంపారు.
ఆమె 2008, అక్టోబర్ 20న నిద్రలోనే మరణించారు. ఆమె 100వ పుట్టినరోజుకు ఇరవై ఏడు రోజుల ముందు తుది శ్వాస విడిచారు. ఈ వార్త ఫ్రాన్స్ కంటే ఈజిప్టు వారిని ఎక్కువగా దుఃఖించేలా చేసింది.
జబలీన్ (స్థానిక కార్మికులు) ఒక స్మారక సభను నిర్వహించారు. వందలాది మంది వచ్చారు. ఒకప్పుడు చెత్త ఏరుకునేవారు, ఇప్పుడు డాక్టర్లు, ఉపాధ్యాయులు, నర్సులుగా మారారు. వారి పిల్లలు పూర్తిగా భిన్నమైన జీవితాలను గడుపుతున్నారు. అదంతా ఆమె చలువ వల్లే. ఆ పాఠశాలలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. క్లినిక్‌లు. మహిళా కేంద్రం. కంపోస్టింగ్ ప్లాంట్.
ఆమె 63 ఏళ్ల వయసులో ప్రారంభించారు. చాలా మంది 63 ఏళ్లకే పదవీ విరమణ చేస్తారు. ఆమె నలభై ఏళ్లు ధనిక పిల్లలకు బోధించారు. ఆ తర్వాత ఒక చెత్తకుండీలోకి అడుగుపెట్టి, తర్వాతి ఇరవై ఏళ్లు సమాజం విస్మరించిన వారికి బోధించారు. ఆ తర్వాత మరో పదిహేను ఏళ్లు వారి కోసం డబ్బు సేకరించారు. ఆమెకు సాంఘిక సేవలో శిక్షణ లేదు. ఆమె డాక్టర్ కాదు. ఆమె యువతి కాదు. ఆమె 63 ఏళ్ల ఉపాధ్యాయురాలు, తన జీవితపు మొదటి భాగం కంటే రెండవ భాగానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆమె కైరోలో ఎవరూ పట్టించుకోని వారిని కనుగొని, వారిని చూడకుండా ఉండలేక పోయారు.
వారితో కలిసి తిన్నారు. వారి మధ్యే నిద్రపోయారు. వారి గాయాలను కడిగారు. వారి పేర్లు తెలుసుకున్నారు.
వారిని మతమార్పిడి చేయడానికి ప్రయత్నించలేదు. తన పని ప్రేమించడం, నిర్లక్ష్యానికి గురైన వారి పక్షాన నిలవడం అని చెప్పారు
ఆమె 99 సంవత్సరాలు జీవించారు.
చివరి 37 సంవత్సరాలు ఎవరూ పట్టించుకోని వారికి సేవ చేస్తూ గడిపారు. సిస్టర్ ఇమ్మాన్యుయెల్. ఫ్రెంచ్ సన్యాసిని. 84 ఏళ్ల వయసు వరకు ఒక చెత్తకుప్పలో నివసించారు. 99 ఏళ్ల వయసులో మరణించారు.
ఆమె చేసిన నేరం? అందరూ పట్టించుకోని వారిని గమనించడం.
ఆమె వారసత్వం? వేలాది మంది పిల్లలు చదవడం, పని చేయడం, కలలు కనడం వంటివి నేర్చుకుంటూ పెరిగారు. ఇదంతా కేవలం ఒక మహిళ 63 ఏళ్ల వయసులో ఒక చెత్తకుప్పలోకి అడుగుపెట్టడం వల్ల జరిగింది. అక్కడి నుండి వెళ్ళడానికి నిరాకరించడం వల్ల జరిగింది. ఇదంతా నమ్మ లేని నిజమేనా!!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి