అక్షరసౌరభాలు: - — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
అక్షరాలు అల్లుతా —
కవితాహారాలు వేస్తా॥

అక్షరాలు చల్లుతా —
కవితాసేద్యం చేస్తా॥

అక్షరాలు కురిపిస్తా —
కవితాపంటలు పండిస్తా॥

అక్షరసుమాలు పూయిస్తా —
పూపరిమళాలు చల్లుతా॥

అక్షరాలు పారిస్తా —
కవితానదులు ప్రవహింపజేస్తా॥

అక్షరదీపాలు వెలిగిస్తా —
కవితాకాంతులు వెదజల్లుతా॥

అక్షరాలను ఆడిస్తా —
అంతరంగాలను తాకుతా॥

అక్షరాలను ప్రయోగిస్తా —
అర్థాలను స్ఫురింపజేస్తా॥

అక్షరవిన్యాసాలు చేస్తా —
హృదయాలను హత్తుకుంటా॥

అక్షరామృతం అందిస్తా —
అమరలోకంలో విహరింపజేస్తా॥


కామెంట్‌లు