"నేను అతను కాదు": - - యామిజాల జగదీశ్
 మన చేతుల్లో కుంచె ఉంది...రంగులు ఉన్నాయి. కానీ, చాలా సార్లు మనం వేరొకరి చిత్రాన్ని గీస్తుంటాం. లేదా, ఇతరులు మనపై పూసిన పొంతనలేని రంగులను మనం కేవలం మోస్తూ ఉంటాం.
కింద ఉన్న నా చిత్రంలో, నేను "నేను అతను కాదు" అని రాశాను. అది నిజం... దీనిలోని భావార్థం చాలా లోతైనది. "నేను అతను కాదు" (అంటే, అప్పుడు ఉన్న వ్యక్తి ఈ రోజు లేడు / పాత తప్పుల ఛాయా ఇందులో లేదు). నిన్న మనం చేసిన తప్పులకు ఈ రోజు ప్రతిరూపంగా ఉండనవసరం లేదు.
జీవితంలో సరైన సమయంలో సరైన మార్గదర్శకుడు అందరికీ లభించడు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఎవరి వేళ్ళూ పట్టుకుని ఈ దూరాన్ని దాటలేదు. నా తప్పులే నాకు గురువులు. నేను పడిపోయిన ప్రదేశాలు, నేను తడబడిన క్షణాలు, నేను చేసిన తప్పులు నాకు అన్నీ నేర్పించాయి.
తప్పులు చేయడం బలహీనత కాదు; కానీ ఆ తప్పుల నుండి మనల్ని మనం సరిదిద్దుకుని, తదుపరి అడుగు వేయడమే మనకు పునాది. "మీరుగా మారడం కష్టం, కానీ ఆ ప్రయాణంలో మీరు పొందే అనుభవం, పరిపక్వత అద్వితీయమైనవి."
ఎవరో వచ్చి మన జీవితాలను మారుస్తారని ఎదురుచూడకుండా, మన రంగులను మనమే ఎంచుకుందాం. మీకంటే బాగా మిమ్మల్ని మరెవరూ తెలుసుకోలేరు. మీ బలహీనతలను తెలుసుకుని, వాటిని మీ బలాలుగా మార్చుకోండి. మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోండి!
ఈ మాటలను నేను తమిళంలో చదివాను. నా మనసుకి నచ్చి తెలుగులో అనువదించాను. రాసినవారి పేరు తెలియలేదు. నాకొక తమిళ మిత్రుడు వాట్సప్ లో పంపాడు. అతనిని రచయిత పేరు చెప్పమని అడిగితే తెలీదన్నాడు. అయితేనేం, మూల రచయిత భావాలు నన్ను కట్టిపడేశాయి. నా విషయంలోనూ నిజమే, మార్గదర్శకులుగా ఎందరినో అనుకున్నాను. వారి భావాలను ఆస్వాదించాను తప్ప ఆచరణలో పెట్టలేకపోయాను. వారి మార్గంలో నడవాలనుకుని ఒకటి రెండు అడుగులు వేయడమే కష్టంతో కూడుకోవడంతో తిరిగీ నా దారిలోకొచ్చేవాడిని. 
నాకు సహాయం చేసిన వారెందరో...వారి సహకారంతో రోజులనైతే గడిపేశాను. నేననుకున్న పత్రికా రంగంలో మూడు దశాబ్దాలుపైనే ఉన్నాను. కానీ నేను పనికిరానని తెలుసుకునేసరికి రిటైరైపోయాను. నాకున్న బలహీనతలు నాకున్నాయి. బలం కన్నా అవే అధికం. నన్ను నేను సమీక్షించుకుంటూ ఉంటే తప్పటడుగులే ఎక్కువని మనసు చెప్తుంటుంది. అయినా ఎట్టాగో డెబ్బై రెండులోకి అడుగుపెట్టి కొన్ని నెలలైంది. నెట్టుకొస్తున్నా రోజుల్ని అనే కన్నా అవే నన్ను నడిపిస్తున్నాయనడం సబబు.


కామెంట్‌లు