విశ్వసాహితీ కవితల పోటీల్లో తిరుమలరావు విజేత

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కళలకు సారథి మీరు మీ కలలకు వారథి మేము అనే సందేశంతో మిక్కిలి ఘనమైన సేవలను అందిస్తున్న విశ్వసాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో తిరుమలరావు ఉత్తమ విజేతగా నిలిచారు. అంతర్జాలం ద్వారా దృశ్యకావ్యం పేరిట దృశ్యం ఇచ్చి తగిన కవితలను ఆహ్వానించగా తిరుమలరావు స్పందించి, బాలలు భావితరాలు అనే శీర్షికతో పంపిన కవిత విజేత స్థానం పొంది, ఉత్తమ కవిత ప్రశంసాపత్రం సాధించింది. విశ్వసాహితి కళావేదిక జాతీయ ఛైర్ పర్సన్ కొల్లి రమావతి నేతృత్వంలో జరిగిన ఈ పోటీల్లో తిరుమలరావు బాలలకు గల హక్కులను వివరిస్తూ, వాటిని పరిరక్షించే బాధ్యత మనందరిదీ అంటూ రచించారు. గాంధీకి బాలల తాతా, జవహర్ లాల్ కి చాచా నెహ్రూ అంటూ భరతజాతి కొలుచుట ద్వారా బాలల వ్యవస్థకు ఇచ్చే విలువ ప్రతి పౌరులూ గుర్తెరగాలని తన కవితలో చాటిచెప్పారు. రేపటి స్వర్ణయుగానికి వారసులైన బాలబాలికలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తన కవితలో ఈసందర్భంగా తిరుమలరావు పిలుపునిచ్చారు. 
పాల్గొన్న దాదాపు మూడువందల కవితల్లో విజేతగా నిలిచిన తిరుమలరావును అభినందిస్తూ విశ్వసాహితి కళా వేదిక జాతీయ చైర్ పర్సన్ కొల్లి రమావతి, మహిళా అధ్యక్షురాలు జి.భవాని(అంజు), కన్వీనర్ మహమ్మద్ రఫీ, యువజన అధ్యక్షులు పెద్దింటి ముకుందరావు, జంధ్యాల శరత్ బాబు, శ్రీపాద సీతామహాలక్ష్మి, మిత్తింటి సుబ్రహ్మణ్యం, సమన్వయ కమిటీ బృంద సభ్యులు సత్తివాడ శ్రీకాంత్, మండల గణస్వామిలు, న్యాయనిర్ణేతల బృంద సభ్యులు తిరుమలరావును అభినందిస్తూ విజేత ప్రశంసాపత్రాన్ని పంపారు. సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలో తిరుమలరావు ఉత్తమ విజేతగా నిలిచి ప్రశంసా పత్రాన్ని సాధించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు