సాహితీసభల సందోహం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అనేక సాహితీ సమావేశాలకు …
అభిమానిగా హాజరయ్యా —
అక్షరాల ఆహ్లాదాలను ఆస్వాదించా,
కవుల కంఠాల్లోని కమ్మని కవిత్వాన్ని క్రోలుకున్నా॥

బహు సాహితీ సమావేశాల్లో …
కవిగా పాల్గొన్నా —
పదాలకు పరిమళాలు అద్దా,
భావాలకు భాష్యమై హృదయాలను హత్తుకున్నా॥

చాలా సాహితీ సమావేశాలకు …
సంధానకర్తగా సమన్వయపరచా —
మనసులను మల్లెల దండలా కూర్చా,
మాటలను మమతల మకరందాలుగా మేళవించా॥

పలు సాహితీ సమావేశాల్లో…
అతిథిగా వేదికలపై ఆసీనుడనయ్యా —
సభాస్థలాన్ని సాహితీ మందిరంగా తీర్చిదిద్దా,
సాహిత్య సుగంధాలను సభలో వెదజల్లా॥

పెక్కు సాహితీ సమావేశాలను…
కార్యకర్తగా ఏర్పాట్లు చేశా —
శాలువాలు మరియు మెమెంటోలు చేకూర్చా,
సాహితీ సేవకు సమయాన్నే సమర్పించా॥

స్వయంగా సాహితీ సమావేశాలను …
నిర్వాహకుడిగా జరిపించా —
సభలను సాఫల్యపథంలో నడిపించా,
కవుల కీర్తిని కలకాలం నిలిపించా॥

ఎన్నో సాహితీ సమావేశాలకు …
సాహితీ పోషకుడిగా సాయం అందించా —
అక్షరాలకు అండగా నిలిచా,
అభ్యుదయ భావాలకు ఆశ్రయమై నిలిచా॥

సాహితీ సమావేశాల సమీక్షలను …
ప్రచారకుడిగా పత్రికలకు పంపా —
కవిత్వ కాంతులను ప్రపంచానికందించా,
తెలుగు తల్లి తేజాన్ని దిక్కులన్నిటా చాటించా॥

వివిధ సాహితీ సమావేశాలకు …
విభిన్న రూపాల్లో పాటుపడ్డా —
అక్షరయజ్ఞంలో అహర్నిశలు శ్రమించా,
తెలుగు సాహిత్యతోటలో పరిమళపుష్పాలను పూయించా॥

.

కామెంట్‌లు