సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -223: ఆడ పెత్తనం -తంబళ్ళ దొరతనం
*****
"ఇగ్గో అవ్వా! గిస్మంటి కూతలు కూస్తే ఇంకోపాలి ఊకునేది లేదని జెప్పు. గింత కాలం ఇంటిని గాడిదై బూడిదై ఇంటిని గట్టెక్కించింది నేను.గీ సంసారం నా వొల్లగాదని శేతులెత్తేత్తే పొల్లగాండ్లు నేను ఆగమైతమని కాళ్ళేళ్ళ బడి  దైర్నం జెప్పి కొంపని సక్కదిద్దింది నేను. గయన్ని యాది మర్శి గిప్పుడు నానా మాటలంటె యెట్ల బడ్త నువ్వే శెప్పవ్వా?
" ఏంది మర్దలా? ఏమైంది? నువ్వు తమ్ముడు ఏమన్న అనుకుండ్రా ఏంది?గంత గుస్సైతున్నవ్?గీడ నా పక్కన కూసో.జెర నిమ్మలించు. తమ్ముడేడి?"
గిదంత మీ తమ్ముడి నిర్వాకమే అవ్వా! కట్టుమొచ్చినపుడు నా అవుసరం బడింది. గిప్పుడు అన్ని అమిర్నయి గద ఇంగ నేనెందుకు? నా మాటెందుకు? ఓడెక్కక ముందు ఓడ మల్లయ్య ఓడ దిగినంక బోడ మల్లయ్య లెక్కుంది నా పరిత్తితి.ఏది బడితే అది నోటికొచ్చినట్టు అనుడే. నేనెందుకు పడాలె నువ్వే శెప్పవ్వా!"
 " నిజమే మర్దలా నువ్వెందుకు బడాలె. నేను నీ పట్టే . ఏడి మా తమ్మి. గాన్ని పిల్వు.గట్టిగ నిలదీత్త. నాలుగు దుల్పుత."
 " వొత్తడు వొత్తడు నా జాడ బట్కొని వొత్తడు ఎందుకు రాడు.అగ్గో వొత్తనే వుండు.నన్ను గంతమాట అంటడా అవ్వా? గా మాట తల్సుకుంటే మస్తు బాధైతున్నది. రెక్కలు ముక్కలు జేస్కొని ఇల్లు నిలబెట్టిన. గట్లెట్ల యాది మరుత్తడవ్వా? గిప్పుడు సుత శేత్తనే వున్న.మీ తమ్మి కండ్లకి కనబడట్లే? మాటనే ముందు యిశారించాల్నా వొద్దా?"
 "గిన్ని అంటున్నవ్ గని అస్లేమన్నడో శెప్పు మర్దలా. నేను దెల్సుకుంట అన్నగద."
 " నాది....నాది "ఆడ పెత్తనం-తంబళ్ళ దొర్తనం"  అంట. నేనేం పెత్తనం జేశిన్నో గియ్యాల తేలాలె.గది తేలినంకనే గిక్కన్నించి కదిలేది."
 " ఏంది తమ్మీ? గా లొల్లి ఏంది?  గా మాట ఎందుకనాల్సి వొచ్చింది? గా పొల్ల ఎంత కట్టపడ్డదో నీకు తెల్సు. నిన్నో మడిషిని జేసి గియ్యాల దర్జాగ కూసోని తిని బత్కేట్టు జేసింది. గయ్యన్ని మర్శి గంత లావు మాటంటావు. గది నీకు లాయికేనా శెప్పు?"
 " నువ్వు దాని పట్టేనా? గీ నడ్మల నోరు కొంచెం బెరిగింది.గిదిట్ల జెయ్యాలె గదట్ల జెయ్యమాకు.అని పెత్తనం జేస్కుంట నెత్తినెక్కి కూసుంది గందుకే గా మాటన్న."
" నీ పెత్తనం ఎల్గబెట్టి ఉన్నదంతా ఆగం జేసింది యాది మర్శినవా తమ్మీ. నీ యసనాలకి తాకట్టు బెట్టిన పొలాన్ని యిడిపించడానికి గదెన్ని అవత్తలు బడింది. ఊల్లె గిప్పుడు తనలెక్క ఏ రైతు సుత ఎగసాయం జెయ్యడని పేరుదెచ్చుకుంది.ఊల్లె నువ్వు తలెత్తుకుని తిర్గుతున్నవంటే నీ పెళ్ళాం వల్లనే అన్నది మరిత్తే ఎట్లరా తమ్మీ!"
" ఎన్కట ఎకరాలకి ఎకరాలు ఆత్తులుండి మొగోల్లు ఎగసాయం,బైట పన్లు సూస్కుంట ఇంట్లె ఆడోల్లని నోరు మెదపనిచ్చేటోళ్ళు గాదు. గాళ్ళకి బైటి పెపంచకం తెల్వదని ఆడ పెత్తనం పన్కిరాదని మంచి శెడు ఏది జెప్పనిచ్చేటోళ్ళు గాదు.గిప్పుడు గాల్ల యిలువ తెలుత్తనే ఉండె.గంత మాటనబడ్తివి."
" గట్ల బుద్ది  జెప్పవ్వా! గింతకీ తంబళ్ల దొర్తనం అంటేందవ్వా? గా దొర్తనానికి ఆడ పెత్తనానికి ముడి బెట్టుడేందో సమజవ్వలే దవ్వా?"
ఓ గదా మర్దలా! ఎన్కట తంబలోల్లని శివయ్యని పూజిచ్చేటోళ్ళు ఉండేటోళ్ళంట. గుల్లె కొచ్చిన బకుతులు పదో పర్కో ఏసిన కానికల మీద గాల్ల బత్కులు ఆదార పడేయట.గంతే ఏన్నుండి ఆమ్దాని వొచ్చేది గాదట. గస్మంటోళ్ళు దొరల్లా బతికే దార్లే లెవ్వని రాజులు సుత గాళ్ళని కాననే కానలేదని... గా తంబలోళ్ళంటే పడీ పడనోళ్ళు" ఆడోళ్ళకి పెత్తనం - తంబలోళ్ళకి దొర్తనం అనేవే ఉండవు, ఉండబోవు,ఉన్నా గాళ్ళు దానికి తగరని" అనేటోళ్ళు.. గట్ల గా సామెత పుట్టుకొచ్చింది.గని గియ్యాల కాలం మారింది. ఆడోళ్ళు ఇల్లు ఆకిలి ఎంత బాగ సక్కదిద్దుకుంటుండ్రో సూత్తనే ఉన్నం. గిప్పుడు నువ్వే సాచ్చం."
 "అవ్వా! తప్పయింది.గీ మాట అననైతే అన్నగని గింత కతుందని తెల్వదు. మీ మర్దలు కట్టలు యాది జేపిచ్చి కండ్లు తెరిపిచ్చినవ్.
మన ఆడోళ్ళని మనవేఁ తక్వ జేస్కుంటె ఎట్ల తమ్మీ!ఇంగ గయ్యన్ని మర్శి ఇగ్గో శిక్కని పాలతో శాయ బెట్టిన శెరింత తాగుండ్రి. తల్కాయలదంత బొయ్యి మంచిగైతరు."
గదండీ సంగతి! ఆడ పెత్తి - తంబళ్ల దొరతనం అంటే..దానెనెకాల ఉన్న కతేంటో తెల్శింది గద!"
కామెంట్‌లు