భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 260 వ రోజు
ఎనిమిదవరోజు యుద్ధం
ఎనిమిదవ రోజు యుద్ధానికి కురు సైన్యాలు కూర్మ వ్యూహంలోను పాండవ సేనలు శృంగాటక వ్యూహములో నిలిచాయి. ఇరు పక్షసైన్యాలు భేరి మృదంగనాద్యాల మధ్య యుద్ధానికి సన్నధమైయ్యాయి. హయములు, ఏనుగులు, రథములు, కాల్బముల రణరంగ విహారంతో రణభూమిలో దుమ్ము ఆకాశాన్ని కప్పింది. భీష్ముడు సింహనాదం చేస్తూ పాడవ సైన్యంలో చొచ్చుకుని వెళ్ళి వీరవిహారం చేయసాగాడు. భీష్ముని పరాక్రమానికి ఆగలేక పాండవ సేనలు పలాయనం చిత్తగించాయి. అది చూసిన భీమసేనుడు ఆగ్రహంతో భీష్ముని ఎదుర్కొని ఒకే బాణంతో భీష్ముని సారథిని చంపాడు. భీష్ముని అశ్వములు పట్టుతప్పి ఇష్టం వచ్చినట్లు పరుగెత్తాయి. అది చూసిన పాడవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. అది చూసి నీ కుమారుడు సునాభుడు అమితపరాక్రమంతో భీమసేనుని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు ఒకే బాణంతో సునాభుని తల నరికి భీకరంగా సింహనాదం చేసాడు. అది చూసి ఖిన్నులైన నీ కుమారులు ఆదిత్యకేతుడు, అపరాజితుడు, బహ్వాసి, పండితుడు, కుండధారుడు, వశాలాక్షుడు, మహోదరుడు ఒక్కుమ్మడిగా భీమసేనునిపై పడ్డారు. తమ తమ బాణములతో భీమసేనుని శరీరమును కొట్టారు. భీమసేనుడు జంకకుండా వారి మీద అతి క్రూర బాణములు ప్రయోగించి అర్ధ చంద్రాకార బాణములతో వారినందరిని యమసదనమునకు పంపాడు. ఇది చూసి నీ కుమారులు " నాడు కురు సభలో చేసిన శపధం భీమసేనుడు ఈ రోజే తీర్చుకునేలా ఉంది " అనుకుని " విదురుని ని పలుకులు సత్యము ఔతున్నాయి " అని మనసులో అనుకుని భీమసేనుని ధాటికి తాళలేక పారిపోయారు.
సుయోధనుడు కలవరపడుట
సుయోధనుడు భీష్ముని చూసి " తాతా చూచితిరా ! భీమసేనుడు నా తమ్ములను అందరిని చంపుతుంటే మీరంతా చూస్తూ ఊరకుంటారా. మీకు పౌరుషం రాలేదా మిగిలిన వారి చావు కోరి మౌనంగా చూస్తున్నారా " అని వాపోయాడు. సుయోధనుని మాటలకు భీష్ముడు చలించి పోయి " సుయోధనా నేను నీకు ముందే చెప్పాను. నీ తమ్ములలో ఎవరు భీమసేనునికి ఎదురైనా వారిని రక్షించడం నాకే కాదు ఎవరికి తరం కాదు. ఇందుకు చింతించి ప్రయోజనం లేదు. యుద్ధంలో మరణించిన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్న ఒకే ఆశతో పోరాడటమే మనకున్న ఒకే మార్గం. శక్తి కొలది పోరాడుతాము విజయం మనలను వరించ వచ్చు కదా! " అన్నాడు " అన్న సంజయుని పలుకులు విని దృతరాష్ట్రుడు " అయ్యో ! ఎంతటి దురవస్థ దాపురించింది. భీష్మ ద్రోణలు ఉండి కూడా నా కుమారులు భీముని చేత దారుణంగా చంపబడ్డారే. వగచి లాభమేమి నా మాట వినక సుయోధనుడు తమ్ముల మరణం కొని తెచ్చుకున్నాడు " అని దుఃఖించాడు. సంజయుడు తిరిగి చెప్పసాగాడు. " భీష్ముడుని కురుకుమారుల మరణం ఆగ్రహోదగ్రుని చేసింది. అతడు భీముని వైపు పోవడం చూసిన ధర్మరాజు ధృష్టద్యుమ్నుని, సాత్యకిని, శిఖండిని భీమునికి సాయంగా పిలిచాడు. సుయోధన ప్రేరేపిత రథికులు అర్జునిని ఎదుర్కొన్నారు. చేకితానుడు, ద్రౌపదీ తనయులు అర్జునినికి సాయంరాగా అర్జునుడు కురు సైన్యాలపై విరుచుకు పడ్డాడు. అభిమన్యుడు, ఘటోత్కచుడు కురు సైన్యాలపై విరుచుకు పడుతున్నారు. ద్రోణాచార్యులు చిత్రవిచిత్ర రీతుల రథాన్ని నడుపుతూ ద్రుపదుని సేనలపై శరవర్షం కురిపిస్తున్నాడు. భీమసేనుడు తన నిశిత శరములతో కౌరవ గజబలమును నేల కూలుస్తున్నాడు. నకులసహదేవులు తమకరవాలంతో కౌరవ అశ్వదళమును మట్టుపెడుతున్నారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి