మానవత్వ ప్రతిష్టాపన! అసమానత ఉద్వాసన!:- డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం.
1.
మట్టి ఏ విత్తు నాటినా,
            మొలక నిస్తోంది!

నది గట్టు  దప్పిక ఎవరిదైనా,
 దాహం తీరుస్తోంది!

గాలి వీస్తూ వివక్ష చూపక ,
బతుకు ఊపిరి పోస్తోంది! 

అగ్ని ,మనలో వైశ్వానరుడై, తిన్నది జీర్ణం చేస్తోంది!

నింగి నిజాయితీ, నేల, అణువణువు తడుపుతోంది! 

2.
ప్రకృతి ప్రేమదృష్టి ,
          మనిషే ప్రేతదృష్టి!

ఆది నుండి మనిషి ,
చేస్తున్నది బేధభావ సృష్టి! 

తరతరాలుగా పీడించే,
అసమానతే పరమ పాపిష్టి!

హఠాత్తుగా వస్తుంది, మహావిప్లవకుంభవృష్టి! 

వెళ్లిన కరోనా, ఉన్న,
 కరాల రణం, కలికాల సృష్టి! 
3.
మనిషి కానీకు ,
బతుకు వ్యాకులం! 

మనందరిలో ఉన్నది ,
ఒకే రుధిరము!

ఎగిరే పక్షుల,
 ఉన్నదెంతో ఐకమత్యము! 

మందలో పశువులు,
 పరస్పర సహజీవనము!

మనమేల ,కావలె,
ఒంటి పిల్లి రాకాసులము!
4.
ఎదుటి మనిషి అద్దం,
వాడిలో నీవే కనిపిస్తావు!

సాటి మనిషి అర్థమైతే,
 ఇద్దరం ఒకటే అంటావు! 

పుట్టినప్పుడు లేవు, పోయేటప్పుడు రావు! 

బతుకు మూన్నాళ్ళ ముచ్చట, అక్కర్లేదు ఏ అంతరాలట! 

బతుకంతా ప్రేమ పంచిపెట్టు, మానవత్వానికే పట్టంకట్టు! 
5.
కలిసి ఉంటే కలదు సుఖం ,
కలిసి చూడు! 

నేను, నువ్వు, కాదు మనం, జనం ఒకరికొకరు తోడు! 

చేయి- చేయి , మనసు-మనసు,
కలుపు అదే మన గెలుపు! 

మంచివాడిగా ముందడుగు,
 మరి వినపడదు చెడు పిలుపు! 

ఇల  ఇన్సాన్   ఈమాన్,
సారా సంసార్  మహాన్!
_________

కామెంట్‌లు