20 లక్షలకు పైగా పుస్తకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. ఆయన ఒక మాజీ బస్ కండక్టర్. పేరు అంకే గౌడ.
సమాజ నిర్మాణానికి అపారంగా కృషి చేసినందుకు గాను ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం దక్కింది.
ఆయన ఒక సామాన్యుడు. తన జీవితకాలపు పొదుపు మొత్తాన్ని, పింఛ్ న్ని ఇతరుల కోసం ఖర్చు చేయడం సాధ్యమేనా...అసలు నమ్మదగినదేనా అని ప్రశ్నించుకుంటే ఔను, నమ్మాల్సిందే అనే దానికి ఆయన జీవితం ఒక మంచి ఉదాహరణ.
బస్సు కండక్టరుగా జీవితాంతం పని చేసిన ఈ మహనీయుడు, పదవీ విరమణ తర్వాత తనకు వచ్చిన పింఛన్ ని తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోలేదు. దానికి బదులుగా, పేద విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ఆయన సుమారు 20 లక్షల పుస్తకాలను కొన్నారు. సేకరించారు. డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ విద్య దూరం కాకూడదనే లక్ష్యంతోనే, ఆయన భారతదేశంలోనే అతిపెద్ద ఉచిత గ్రంథాలయాన్ని స్థాపించారు. నేడు, వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ఉచితంగా చదువుకుంటు న్నారు.
నేటి సమాజంలో, మనం ఎక్కడ చూసినా స్వార్థపూరిత రాజకీయాలు, తప్పుదారి పట్టిన ప్రజాస్వామ్యాన్నే చూస్తున్నాం. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేదు, ప్రభుత్వ అధికారులలో జవాబుదారీతనం లేదు. కానీ ఎలాంటి అధికారం లేని ఈ సామాన్యుడు, ప్రపంచంలోనే గొప్ప ప్రజా సేవల్లో ఒక దాన్ని చేశారు. ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలోనే నిజమైన నాయకత్వం ఉందని ఆయన నిరూపించారు.
చరిత్ర సృష్టించడానికి గొప్ప సంపద గానీ, హోదా గానీ అవసరం లేదని, మంచి మనసు, సమాజం పట్ల నిస్వార్థమైన లక్ష్యం ఉంటే చాలని ఈ బస్ కండక్టర్ జీవితం ప్రపంచానికి బోధిస్తుంది.
ఆయన పూర్తి పేరు అల్ఫోన్స్ విముల్రాజ్ అంకే గౌడ. ఆయన లోకం పుస్తకాలు. ఆయనకు చిన్నప్పటి నుంచే పుస్తకాలంటే అమితమైన ఇష్టం. ఇతరులను కూడా చదవడానికి ప్రోత్సహించాలన్నది ఆయన ఆశయం.
దక్షిణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయన ఐదు దశాబ్దాలుగా కూడబెట్టిన సంపదే ఈ పుస్తకాలయం.
అక్షరాస్యతను, పుస్తకపఠనాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన అసాధారణ కృషి విశేషం. కొద్ది రోజుల క్రితమే పద్మశ్రీని అందుకున్నప్పుడు ఆయన వయస్సు 79 ఏళ్లు.
ఊహించదగిన ప్రతి అంశంపై పుస్తకాలతో పాటు, బైబిలుకి సంబంధించిన అరుదైన ప్రతులను కూడా ఆయన పుస్తకప్రపంచంలో కనవచ్చు.
వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆయన మాట్లాడుతూ "నేను ఒక పల్లెటూరులో పెరిగాను. మాకు చదవడానికి పుస్తకాలు ఎప్పుడూ దొరకలేదు, కానీ వాటిపై నాకు ఎప్పుడూ కుతూహలం ఉండేది. నేను చదవాలి, పుస్తకాలు సేకరించి జ్ఞానం సంపాదించాలి అని అనుకుంటూ ఉండేవాడిని," అని అన్నారు.
ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న పాండవపుర అనే ఒక చిన్న పురపాలక సంఘం పరిధిలో ఉంది. సాధారణంగా గ్రంథాలయాలకు ఉండే కఠినమైన వ్యవస్థీకరణ ఇక్కడ లేదు. నిజానికి, గౌడ గ్రంథాలయానికి గ్రంథపాలకుడు లేడు. పుస్తకాలు అరలలోనూ, నేలపైనా అస్తవ్యస్తంగా పేర్చబడి ఉంటాయి.
బయట, గ్రంథాలయపు షెడ్ల కింద, సుమారు 8 లక్షల పుస్తకాలతో నిండిన సంచులు ఇంకా విప్పకుండా ఉన్నాయి. గౌడ కొనుగోళ్లు ఇతరుల విరాళాల ద్వారా ఈ సేకరణ ఇంకా పెరుగుతూనే ఉంది.
ఈ ప్రదేశానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుస్తక ప్రియులు తరచుగా వస్తుంటారు. ఇక్కడికి తరచూ వచ్చే సందర్శకులకు గ్రంథాలయంలోని దారులు బాగా తెలిసినట్లు అనిపిస్తుంది. వారు తమకు కావలసిన పుస్తకాలను సులభంగా కనుగొంటారు. ఒకవేళ వారు కనుగొనలేకపోయినా, గౌడ ఏదైనా పుస్తకాన్ని కనుక్కోగలరని అంటారు.
గౌడ, అతని భార్య, కుమారుడు గ్రంథాలయంలోని ఒక మూలలో నివసిస్తున్నారు. ఆ గ్రంథాలయం వారంలో ప్రతిరోజూ, చాలా గంటల పాటు తెరిచి ఉంటుంది. ఇక్కడ అనేక రకాల విషయాలపై పుస్తకాలు ఉన్నాయి.
గౌడ తన బాల్యాన్ని చదువుకుంటూ, తండ్రికి పొలం పనులలో సహాయం చేస్తూ గడిపారు. ఆయన పుస్తకాలు కొనడానికి తరచుగా తన తల్లిదండ్రులను, అక్కను డబ్బు అడిగేవారు.
ఆయన భారత స్వాతంత్ర్య సమరయోధులు, ఆధ్యాత్మిక నాయకుల గురించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాక, వాటికి పూర్తిగా ఆకర్షితులయ్యారు.
ఒక ఉపాధ్యాయుడి స్ఫూర్తితో, గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర విద్యార్థులు కూడా చదవగలిగేలా ఆయన చిన్న చిన్న పుస్తకాల సేకరణతో తన ఆశయానికి శ్రీకారం చుట్టారు.
ఆయన తరచుగా తన తల్లిదండ్రులు ఆహారం కోసం ఇచ్చే డబ్బును పుస్తకాలు కొనడానికి ఉపయోగిం చేవారు.
పాఠశాల విద్య పూర్తి చేసిన వెంటనే, ఆయన బస్ కండక్టరుగా పని చేయడం మొదలుపెట్టారు.
ఉద్యోగంలో చేరిన సుమారు 10 నెలల తర్వాత ఒక రోజు, ఆయన తన మాజీ ఉపాధ్యాయుడిని అనుకోకుండా కలిశారు. ఆయన చదువు మానేశాడని విని ఆ ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయారు. గౌడ ఉద్యోగానికి రాజీనామా చేసి కాలేజీకి వెళ్లాలని ఆయన పట్టుబట్టారు.
గౌడ ఆ సలహా పాటించి, కర్ణాటక అధికార భాష అయిన కన్నడలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి, పాండవపుర చక్కెర కర్మాగారంలో టైమ్కీపర్గా చేరారు.
ఆయన తన నెల జీతంలో మూడింట రెండు వంతులు పుస్తకాలకు ఖర్చు చేసి, మిగిలిన డబ్బును సరుకులు, ఇతర అవసరాలకు వాడుకునేవారు.
"అప్పట్లో జీతాలు తక్కువగా ఉండేవి, కానీ ధరలు కూడా తక్కువగానే ఉండేవి," అని ఆయన అంటారు.
ఫ్యాక్టరీలో తాను పనిచేసిన 33 ఏళ్లలో, గౌడ స్థానిక భాష, సాహిత్యం అభివృద్ధికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన కన్నడ సాహిత్య పరిషత్ నిర్వహించే డజన్ల కొద్దీ సమావేశాలకు హాజరయ్యేవారు. తరచుగా వారి నుండి రాయితీపై పుస్తకాలను కొనుగోలు చేసేవారు.
ఆయన ఆవులను పెంచి పాలు అమ్మడం ద్వారా, భీమా ఏజెంట్‌గా పనిచేయడం ద్వారా కూడా తన ఆదాయాన్ని పెంచుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రియులందరికీ తెలిసినదే ఆ తదుపరి అడ్డంకి - నిండిపోతున్న తన పుస్తకాల సేకరణను ఉంచడానికి స్థలం కనుక్కోవడం.
"నేను పుస్తకాలను పెద్ద ట్రంకుపెట్టెలలో ఉంచడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా ఇంట్లో పుస్తకాల అరలను ఏర్పాటు చేసుకున్నాను. కానీ ఒకానొక దశలో, ఇక స్థలం మిగలలేదు," అని అన్నారాయన.
ఆ సమయానికి, ఆయన దాదాపు 50,000 పుస్తకాలను సేకరించారు. ఇప్పుడు లక్షల్లో చేరాయవి.
గౌడ సేకరణలో బైబిల్ యొక్క అరుదైన ప్రతులు ఉన్నాయి.
పాండవపురంలో ఒక ఆలయాన్ని నిర్మిస్తున్న దివంగత మద్యం వ్యాపారి హరి ఖోడే, మరి కొందరు స్నేహితులు ఆయనకు సహాయం చేశారు.
ఒకే వ్యక్తి ఇన్ని పుస్తకాలను కలిగి ఉండగలడని ఖోడే నమ్మలేకపోయారని గౌడ గుర్తుచేసుకున్నారు.
"ఆయన వచ్చి స్వయంగా పుస్తకాలు చూశారు. ఆ తర్వాత నాకేం కావాలో అడిగారు. నాకు డబ్బు ఏమీ వద్దు అని చెప్పాను. ఆయన ఒక గ్రంథాలయం కట్టాలన్నదే నా ఏకైక కోరిక" అని గౌడ చెప్పారు.
ఖోడే అంగీకరించి, ఒక భారీ భవన నిర్మాణానికి నిధులు చెల్లించారు. అది ఇప్పుడు 15,800 చదరపు అడుగుల (1,467 చదరపు మీటర్ల) విస్తీర్ణంలో విస్తరించి ఉన్న గౌడ విశాలమైన గ్రంథాలయంలో ఒక భాగంగా ఉంది.
కొన్ని సంవత్సరాల తరువాత, ఒక స్థానిక శాసనసభ్యుడు అప్పటి ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిని గ్రంథాలయాన్ని చూడటానికి తీసుకువచ్చారు. ఆయన మొదటి భవనానికి అనుబంధంగా మరో రెండు నిర్మాణాల కోసం నిధులను మంజూరు చేశారు.
ఈ రోజు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాన్ని సందర్శిస్తున్నారు. వారిలో ఒకరైన, ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవి బెట్టస్వామి, తాను కూడా వేలాది పుస్తకాల సేకరణను నిర్మించడానికి ప్రేరణ పొందానని చెబుతున్నారు.
"నేను చదువుకోవడానికి గౌడ లైబ్రరీని ఉపయోగించుకున్నాను, అలాగే నా విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్లి, వారు చదువుకోవడానికి, పుస్తకాలను సర్దడంలో సహాయపడటానికి వీలు కల్పించాను," అని ఆయన అన్నారు.
ప్రభుత్వ కళాశాలలో బోధించే శిల్పాశ్రీ హరను, ఈ సేకరణను ఒక వృత్తిపరమైన గ్రంథపాలకుడు క్రమబద్ధీకరించనందున అది చిందరవందరగా కనిపించవచ్చని అంటున్నారు.
"కానీ అతనికి [గౌడకు] ప్రతి పుస్తకం ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసు. క్షణంలో చెప్పగలడు" అని ఆమె అన్నారు.
లైబ్రేరియన్‌ను ఎందుకు నియమించుకోలేదని అడగగా, తనకు ఆ సలహా ఎవరూ ఇవ్వలేదని గౌడ చెప్పారు.
గ్రంథాలయ భవిష్యత్తు విషయానికొస్తే, తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఇతరులపై ఉందని గౌడ సూచించారు.
నేను నా బాధ్యతను నెరవేర్చాను. కానీ నాలో ఇక శక్తి లేదు. బహుశా ఇప్పుడు ప్రభుత్వం, ప్రజలు ఈ బాధ్యతను స్వీకరించవచ్చేమో? నేను నా వంతు కృషి చేశాను...ఇప్పుడు అది ఇతరులపై ఆధారపడి ఉందని గౌడ అన్నారు.
స్థానికులు ఆయనను, తరచుగా "అక్షర యోగి" అని పిలుస్తుంటారు. ఆయన గ్రంథాలయంలో 20కి పైగా భాషలలో 20 లక్షలకు పైగా పుస్తకాలు ఉండటం విశేషం. ఈ గ్రంథాలయం అందరికీ ఉచితం. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఆయన సేకరణలో అరుదైన చేతివ్రాత ప్రతులు, అరుదైన విదేశీ పుస్తకాలు, 5,000కు పైగా నిఘంటువులు, 1800ల నాటి పత్రాలు ఉన్నాయి.
కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్‌గా, ఆ తర్వాత ఫ్యాక్టరీ టైమ్కీపర్గా పని చేసిన గౌడ, తన ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో సహా తన జీవితకాలపు పొదుపు మొత్తాన్ని ఈ సేకరణను నిర్మించడమనేది ఊహకందనిది.
పుస్తకప్రియుడి గ్రంథాలయం: - - యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY








addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి