సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 251 వ రోజు*: భీష్ముడు నరనారాయణుల గురించి సుయోధనునికి వివరించుట
సుయోధనుని సందేహం తీర్చడానికి భీష్ముడు " సుయోధనా ! పాండవులకు వాసుదేవుడు సాయంగా ఉన్నాడని కనుక వారికి అసాధ్యం అయినది ఏదీ లేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను నీవు విన లేదు. ఆ పరమేశ్వరుని మహాత్యం ఎరిగిన వారు ఎవరూ లేరు ఎరిగిన వారికి అపజయం లేదు పాండవులు శ్రీకృష్ణుని మహత్యం తెలిసిన అతడిని ఆశ్రయించారు. నీవు అతడి మాటలు పెడచెవిన పెట్టావు. ఒక సారి బ్రహ్మదేవుడు మానసరోవరం ఉత్తర పర్వత శిఖరాన దేవతలు, మునులు, గంధర్వులు, అప్సరసలు మొదలైన వారితో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు ఆకాశమార్గాన ఒక విమానం ఎగురుతూ ఉండటం చూసి ఆ విమానంలో పరమాత్ముడు తన సఖునితో ఉన్నాడని తెలుసుకుని దిగ్గున లేచి నమస్కరించి " ఈ లోకముల సృష్టి, స్థితి, లయ కారకుడవై మునిగణములతో అర్చించబడుతూ భయనిర్మూలనం గావించు నిర్గుణ మూర్తికి శుభకరుడికి ఇదే నమస్కారం " అని స్తుతించాడు. " నారాయణా ! నీవు నా తండ్రివి నేను నీ ఆనతిన సృష్టి కార్యము నెరవేర్చాను. నీ రక్షణలో వర్ధుల్లుతున్న ఈ లోకములు ఇప్పుడు తల్లడిల్లి పోతున్నాయి. అసుర ప్రవృత్తి ప్రబలుచున్నది. నీవు యదు వంశమున పుట్టవ వలసిన సమయం ఆసన్నమైంది. నీకు సఖుడైన నరుడు నీతో చేరి భూలోకమున జన్మించి నానా విధ దైత్యులను సంహరించి భూభారమును తగ్గించ వలసిన సమయమూ ఆసన్నమైంది స్వామి " అన్నాడు. నారాయణుడు బ్రహ్మదేవునికి కోరిన వరం అనుగ్రహించి వెళ్ళి పోయాడు. బ్రహ్మ కొలువులో ఉన్న వారు బ్రహ్మదేవునితో " దేవా ! నీవు వినమ్రుడవై నమస్కరించిన వీరెవరు ? " అని అడిగారు. బ్రహ్మ " వీరు ఆది పురుషులు పరమ మునులు నరనారాయణులు నాకు ఆరాధ్యులు అందుకే ధర్మసంరక్షణార్ధం వారిని భూలోకాన జన్మించమని కోరాను అందుకు వారు అంగీకరించారు. భూలోకమున జన్మించు వీరిని కేవలం మర్త్యులు అని అనుకున్న వారు చెడి పోతారు. వారి ఏడల భక్తి ప్రపత్తులు కనబరిచిన వారికి సకల శుభములు కలుగగలవు " అని చెప్పి బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళగా మిగిలిన వారు కూడా వారి వారి లోకాలకు వెళ్ళారు. సుయోధనా నేను ఈ కథను పరశురాముడు, నారదుడు, వ్యాసుడు చెప్పగా విన్నాను . ఇంతకు మునుపే నేను, మహా మునులు నారనారాయణులతో వైరం మంచిది కాదని హెచ్చరించాము. కాని నీవు మదాంధుడవై వారి మాట విన లేదు . ఇప్పటికీ మించినది లేదు శ్రీకృష్ణుని శరణు వేడి పాండవులతో స్నేహం చేసి ఈ వినాశనాన్ని ఆపు " అన్నాడు. నీ కుమారుడు పితామహుని మాట పెడచెవిన పెట్టాడు. రాజా ! నువ్వు నీ కుమారులు మంచి మాటలు వినరు కదా ! అది సరే అయిదవరోజు యుద్ధం చెప్తాను విను " అని తరువాతి యుద్ధం వర్ణించ సాగాడు.
అయిదవరోజు యుద్ధం మకర వ్యూహం డేగవ్యూహం
అయిదవ రోజు యుద్ధానికి కౌరవ సేనల భీష్ముని సారథ్యంలో మకర వ్యూహంలో నిలిచాయి. ప్రతిగా పాండవ సేనలు శ్యేన వ్యూహంలో నిలిచాయి. వ్యూహాన్మికి ముఖ భాగాన భీమసేనుడు నిలబడ్డాడు. కన్నుల భాగాన ధృష్టద్యుమ్నుడు, శిఖండి నిలబడ్డారు. తల భాగాన సాత్యకి నిలిచాడు. మెడభాగాన అర్జునుడు నిలువగా ఎడమ రెక్కగా విరాటుడు, ద్రుపదుడు ససైన్యంగా నిలిచారు. కుడి రెక్క భాగాన కేకయరాజులు ససైన్యంగా నిలిచారు. తోక భాగాన నకులసహదేవులతో యుధిష్టరుడు నిలిచాడు. భేరి, తూర్య, శంఖనాదాలతో యుద్ధం ఆరంభం అయింది. ముందు భాగాన ఉన్న భీముడు కౌరవ సేనలోకి చొచ్చుకొని పోయి సేన్యాన్ని కకావికలు చేసాడు. నేరుగా భీష్ముని ఎదుర్కోని శరవర్షం కురిపించాడు. భీష్ముడు ఆ బాణములను మధ్యలోనే తుంచి తిరిగి భీమునిపై శరవర్షం కురిపించాడు. ఇంతలో అర్జునుడు భీమునికి సాయంగా రావడమే కాక భీష్మునితో తలపడి కౌరవ సేనలను చీల్చి చెండాడాడు. భీమార్జునులు కౌరవ సేనలను తనుమాడుతున్న సమయంలో సుయోధనుడు కలత పడి " ఆచార్యా ! మీరు కౌరవ సైన్యాలను పట్టి పల్లారుస్తారని అనుకున్నాను. భీష్ముడు అలిగిన దేవతలు కూడా అతని ముందు నిలువ లేరు అనుకున్నాను. కాని మీరిరువురు భీమార్జునుల విజృంభణను ఆపలేక చూస్తూ ఉన్నారేమిటి " అని నిష్టూరంగా అన్నాడు. ద్రోణుడు " సుయోధనా ! అర్జునుడు శౌర్యధనుడు. అతడి జయించుట అసాధ్యం అని నేను ముందే చెప్పాను. అయినా మాకు చేతనయినంత యుద్ధం చేస్తాము. యుద్ధాన్ని ఒక్క రోజులో గెలవడం ఎవరి తరం " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు