ప్రభుత్వ పాఠశాలల్లోనే ఫలితాలు మెండు

 ఔను, సర్కారు బడులే సో బెటరు!
అని తేటతెల్లం ఔతుంది. గత పాతికేళ్ళుగా పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాన్రానూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ర్యాంకుల పంట పండుతోంది. మంచి మార్కులు పొందిన విద్యార్థుల ఇళ్ళకే ఉపాధ్యాయులు వెళ్లి మిఠాయిలను పంచి, సత్కరించి రావడం ఒక గొప్ప శుభ పరిణామం. మరో అడుగు ముందుకేసి ఆ పిల్లలతోనే ర్యాలీలు చేస్తున్నారు గురువులు.
అదే విధంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తమ తమ పిల్లలను చేర్పించండి అంటూ పేరెంట్స్ కు అవగాహన పర్చే దిశగా ఉపాధ్యాయలోకం దూసుకుపోతుంది. ప్రత్యేక ఆదేశాలు లేకపోయినా స్వచ్చందంగా ఉపాధ్యాయులే ఎండనక వాననక ఇళ్ళవద్దకే వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరించుచుండుట విశేషం. ప్రజలు కూలీలు ఊరవతల చెరువుల వద్ద పనులు చేసుకుంటున్న సందర్భాలలో సైతం, అక్కడికి వెళ్లి మరీ తమ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించండి అంటూ మాస్టార్లు మేడమ్ లు కోరుచున్నారు. జి.సిగడాం మండలం పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం పెంటయ్య, జిఎంఆర్ విఎఫ్ వాలంటీర్ పిల్లల దాలమ్మలు అవిశ్రాంతంగా గ్రామంలో పర్యటిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర కిట్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఎఫ్ ఎల్ ఎన్ తర్ల్ బోధనాభ్యసనా సామగ్రి, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం,  కృత్యాధార బోధన, యోగా, సైన్స్ ఫేర్, సాంస్కృతిక కార్యక్రమాలు, మెగా పీటీఎం, జాతీయ పర్వదినాల వంటి గుణాత్మక విద్యా సామర్ధ్యాలతో తమ ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులందరూ ఎంతగానో శ్రమిస్తున్నారని ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి తెలుపుతూ అవగాహన పర్చుచున్నారు. ఆకర్షణీయమైన తరగతి గదులతో పాటు, మంచి నీటి సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్లు, వంటగది వంటి సౌకర్యాలను ఆమె ఉదహరిస్తున్నారు. ఆటపాటలు, గ్రంథాలయ పుస్తక పఠనం, తల్లికి వందనం పథకం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాలలో గల ఆవశ్యకతను ఆర్.ఎల్.కుమారి సమగ్రంగా వివరిస్తున్నారు. అంతే కాకుండా ఈ పాలఖండ్యాం ఉపాధ్యాయులంతా ఉదయం పూట 8నుండి 9వరకూ వాతావరణం చల్లగా ఉండే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. కనీస అభ్యసన స్థాయి అందించేలా మిక్కిలి కృషి చేస్తున్నారు. అలాగే అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇదే విధమైన కృషి జరుగుతోంది. వంగర మండలం, రుషింగి ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయనిగా పనిచేస్తున్న బత్తుల వినీల కుమారితో పాటు సహోపాధ్యాయులంతా గ్రామస్థులను కలిసి తమ ప్రభుత్వ బడులలో చేర్పించాలని చెబుతున్నారు. ప్రభుత్వ బడిని అనగా మన ఊరి బడిని కాపాడుకోవాలని, సర్కారుబడులను బలోపేతం చేయుట గ్రామస్తులందరి బాధ్యత అని వినీల కుమారి పిలుపునిచ్చారు. ఇదే విధంగా రాష్ట్రమంతటా గురుబ్రహ్మలంతా తమంతట తామే బాధ్యతపడి వేసవి ఎండలకు లెక్క చేయకుండా తాము పనిచేస్తున్న గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను పెద్దలను కలిసి ప్రభుత్వ బడిలో చేరు బంగరు భవితను కోరు అంటూ నినదిస్తున్నారు.
కామెంట్‌లు