సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

సామెత -241: ఆ కోడి కూత వేస్తే అడుగంటడమే ఇల్లు
****
"ఇగ్గో అవ్వా! గిదిన్నవా! గా మైసమ్మత్త కోడలు ఇంగ శాన్నాళ్ళు బత్కదు అని గా యింటికి ఎవలో బూత వైజ్జుడు వొచ్చి శెప్పిండంట. శెప్పి వారం తిర్గక ముందే గాల్ల కోడలు నిజ్జంగనే కొడ్కును కనుకుంట రకతం ఆగక సచ్చిపోయింది తెల్సా!"
అయ్యో మర్దలా ఎంత గోరం జరిగింది అసలేమైందంట.దవాఖాన వొద్దు ఏం వొద్దు. మా యింట్ల ఎన్కటి నుంచి ఇంట్లనే నీళ్ళాడిండ్రు.ఊల్లె మంత్రసాని లేకున్నా మందులిచ్చే నర్సులమ్మ ఉంది కద.గామెతో కాన్పు చేయిత్తం అన్నదట.
 అనడమేంది అన్నంత పని చేసింది.గా నర్సులమ్మ ఇచ్చే మాత్రలేసుకుంట ఏదో ఇంట్లో అందరూ వొండింది తినంగ అడుగున మిగిలింది తినడం.మొదటి కాన్పు అమ్మోళ్ళు చేసిండ్రు. పండంటి బిడ్డను కన్నది.
తొలి కాన్పు అమ్మోళ్ళింట్ల మలికాన్పు అత్తోరింట్ల అంటరు గద. గీ కాన్పుకు ఈడనే ఉండేతల్కి గింత గోరం జరిగింది. అమ్మోళ్ళింటికి పోతే బతికేది పొల్ల. నిండు పానం బొయ్యిందవ్వా! ఏడ్సుకుంట శెప్తున్న  దనమ్మ మాటల్కి అవ్వకి సుత ఏడుపొచ్చింది.
 "గంత మూర్ఖత్తం ఏంది మర్దలా! మనమే కాలం ఉన్నం? గీ దినాలల్ల ఇంట్లె కాన్పులు జర్గినయి అన్న మాటలు ఏడ్నన్న యిన్నమా? గా పసోళ్ళకు తల్లి లేని లోటు ఎవలు తీరుత్తరు. అందరూ 'థూ!' ఏం మడిషి అంటల్లే!"
 వో అవ్వోవ్! అసలు గా పొల్ల సావుకి కార్నం వైజ్గం అందకపోవుడు,ఇంట్లె కాన్పు కాదట. ఊరంత కోడై కూత్తుండ్రు తెల్సునా? అన్నట్టు యాది మర్శిన. గీ నడ్మల గాల్లింట్ల కోడి పెట్ట కోడి పుంజు లెక్క కూసిందట. గది గట్ల కుయ్యడం శేతనే గా పొల్ల వచ్చిందంట. ఎవలి నోట్లె మాట యిన్నా గిదే ముచ్చటి.కోడిపెట్ట గట్ల కూసుడేందో... గది జెప్తే బూత వైజ్జుడు గా పొల్ల సత్తదని శెప్పుండేందో 'నిజంగా గాయన జెప్పినట్టే జరుగుడేందో నాకైతే అర్థమైతనే లేదవ్వా!"
 "అవును మర్థలా!గీ కాలంల సుత గిట్ల మూర్ఖంగా యిశారిచ్చుడు ఏంది! ఒకోపాలి కోడిలో సుత మన్సుల్లో లెక్క ఆడోళ్ళకి మొగలచ్చణాలు వొచ్చినట్లు కోడికి పుంజు లచ్చనాలు వచ్చి వుంటయి.గంతే గని గా బూతవైజ్గుడ శెప్పంగ,కోడి కూత వెయ్యంగ మాత్తరం గాదు మర్దలా?"
" ఆ కోడి కూత వేత్తే అడుగంటడమే ఇల్లు" - అనటం శానా పొరపాటు మర్థలా! సరైన సయిమానికి వైజ్గం అందక గా పొల్లకి రకతం గడ్డ కట్టే  'కె' అనే  యిటమిను లోపిచ్చి గట్ల అయ్యింది.గదే దవాఖానాల అయితే ఎంటనే వైజ్గం అందేది పొల్ల బతికేది. గీ కాలంల సుత గిట్ల కొందరు మూఢ నమ్మకాలతో పానాలు పోగొట్టుకుంటుండ్రు. గా బూత వైజ్జుడు గా పొల్ల సూట్టానికి బలీనంగ వుందని ఏదో వాగిండు. గీల్లు నమ్మిండ్రు.
 " ఎన్కట మా అమ్మమ్మోళ్ళ ఇంట్లె సుత కోడి పెట్ట కూయడం. మా అమ్మమ్మ బాలెంతగ ఉన్నప్పుడే సచ్చిపోవడం వల్ల ,గా కోడిపెట్ట కూయడం వల్లనే జర్గిందని గిప్పటికీ మా యమ్మ శెప్తది.అసలేందంటె బాలెంత జెరం వొస్తే ఏం గాదని పట్టిచ్చు కోలే గందుకే మా అమ్మమ్మ సచ్చిపోయింది. గది ఎన్కటి కాలం డెబ్బై ఎన్బై ఏండ్ల కింద ముచ్చెటి గది. వైజ్గం సరింగ  లేని దినాలవి. మూఢ నమ్మకాలు ఎక్కువున్న కాలాలవి. గిప్పుడు ఎన్నో మార్పులు వొచ్చినయి.గుండెకాయ తీసి గుండెకాయ పెడ్తున్నరు. ఇంకా ఎన్కటివి పట్టుకొని ఏలాడ్తే ఎట్ల మర్దలా?"
 "అవునవ్వా! గిప్పుడు శానా రోగాలకి మందులు కనిపెట్టిండ్రు. నేను గీ యిష్యాలు నీ లెక్కనే నల్గురికి శెప్త.ఇంకో పాలి గిస్మంటి గోరం ఎక్కడా జరక్కుండ సూత్తవ్వ"అన్కుంట బోయింది దనమ్మ.
గదండీ సంగతీ! " ఆ కోడి కూస్తే అడుగంటడమే ఇల్లు" అన్న సామెత మూరకత్వం,మూఢ నమ్మకం. గస్మంటి వాటిని అస్సలు నమ్మకుండ్రి.

కామెంట్‌లు