సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 
సామెత -229: ఆవగింజంత అబద్ధం ముందు ఏనుగంత నిజం కూడా నిలబడలేదు
****
అవ్వా! ఏం జేత్తున్నవ్?"గీ నడ్మల  ఓ పెద్దాయన అన్న మాటే త్యేప త్యేపకూ యాదికొత్తుంది. గిప్పుడు జర్గేయన్ని  ఆయిన చెప్పినట్టు గట్లనే ఉన్నయి. గా ముచ్చెట్లే శెప్పే దన్క మన్సాగక వొచ్చినవ్వా!."
 "అవునా శెల్లే! నువ్వు జేబట్టే శానా యిష్యాలు తెలుత్తున్నయ్.ఇంతకీ ఎవలా పెద్దాయన శెల్లే! గా మాట నా శెవుల సుత ఎయ్యి. నేను యిన్ననో , యాది మర్శిన్నో తెలుత్తది."
" గాయిన పేరేందో యాదికొత్తలే గని మాట ఎవలెవలో అనంగ యిన్న." గదే నవ్వా! అడ్వికి రాజైన సిమ్మం అంట తన తడాకేందో,కతేందో శెప్పకుంటే,ఏటగాడు శెప్పినయే నిజవని అన్కుంటం" అన్నడవ్వా!"
"అవును శెల్లే! గా పెద్ద మడిశి ఊకెనే అన్లే.గీ పెపంచకంల గిస్మంటియి శానా శానా జర్గుతున్నయి మరి. "ఆవగింజంత అవద్దం ముంగల ఏనిగంత నిజం సుత నిలవలేక పోతుందంటే... సూస్కో మరి అవద్దం అనెకొండై నిజాన్ని ఎట్ల మింగేత్తుందో.."
"అవునవ్వా! కొంచెం తెప్పరిల్లి శేతుల పైసలు టికటికలాడంగనే ఎన్కట సాయం జేసినోళ్ళని మర్వడమే గాదు ఎవలేం జేసిండ్రని అనడాన్కి సుత ఎన్కాడని మడుసులు గీ దినాల్లో తయారైండ్రు.గాల్ల నోట్లె నోరు బెట్టి గట్ల అవద్దాలాడితెట్లని నిల్దీశి అడ్గలేత్తమా? సూబూది శెయ్యలేత్తమా శెప్పవ్వా!" గా అవద్దానిదే పై శేయి అయితాంది.
 " అవును శెల్లే! ఎన్కట నువ్వన్నట్టే ఓ పెద్దాయన సుత ఎస్మంటి ఎస్మంటి సయిమాల్లో అవద్దం ఆడితే తప్పులేదో పద్దెంలాగ రాశిండు గని శెల్లే !గిప్పుడైతే కొంతమందిరి నోరు దెరిత్తె అవద్దాలె.శిన్నా పెద్దన్న అంత్రం లేదు.గయ్యి యినీ యినీ ఏనిగంతేంది శెల్లే కొండంత నిజాలు సుత ఎలఎలబోతున్నయి.అవద్దాలే రాజ్జమేల్తున్నయ్" .
ఇంగ టీవీల వొచ్చే పెకటనలు,ఈరోల ముచ్చెటి శెప్పనలవి గాదు.గవి జూసి " నిజవేఁ మేం సుత గట్లనే  జెయ్యాలని  జెయ్యబొయ్యి పానాల మీద్కి  ఎంతెంత మంద్రి దెచ్చుకుంటుడ్రో సూత్తనే ఉన్నం గద. గయన్ని జూసే మన పెద్దోళ్ళు గిస్మంటి సామెత పుట్టించి ఉంటరు శెల్లే!"
"అవునవ్వా! గాల్ల ఆవగింజంత అవద్దం ముంగల ఏనుగంత నిజం సుత నిలబడలేదు అంటే నిజవేఁగ అన్క తప్పదు. నిజం శెప్పులేస్కోనే లోపల్నే అవద్ధం పెపంచకమంత తిరిగొత్తదట. నల్గురు నోళ్ళల్ల అవద్దం నిజమని నానిన ఆటెంక అసలు నిజం నమ్మతర ఎవలైనా? గట్ల అవద్దందే పై శేయి అయితాంది.
గదండీ సంగతీ" ఆవగింజంత అవద్దం ముందు ఏనుగంత నిజం కూడా నిలబడలేదు"  అంటే గిదే గా మరి. మన నియతి 'నిజం,నిజాతి అవద్దాలోల్లను తెల్ల మొగం ఏస్కొని సూత్తనే ఉంటది.

కామెంట్‌లు