మదనపల్లె తో రవీంద్రనాథ్ ఠాగూర్ అనుబంధం..: - చౌధరి రాధాకృష్ణ, .



 ( రవీంద్రుని జయంతి  సందర్భంగా )
విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత, బంగ్లాదేశ్ దేశాల జాతీయ గీతాల రచయిత బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతాన్ని తొలిసారి ఆలపించిన స్వాతంత్ర్య సమరయోధులు రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఆంధ్రప్రదేశ్ తో అవినాభావ సంబంధం ఉంది.
కళాశాల విద్యార్థులతో సింగ్ ఏ సాంగ్ - ఫన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జనగణమన గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించ వలసి వచ్చింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికైంది.
భారత స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగళూరు నుండి విశ్రాంతి తీసుకోవాలని ప్రకృతి అందాలతో శోభిల్లే విద్యా, సాంస్కృతిక పట్టణం మదనపల్లె వచ్చి వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఐర్లాండ్ నుండి భారతదేశానికి వచ్చి దివ్య జ్ఞాన సమాజం స్థాపించి, భారత స్వాతంత్ర్య సమయంలో హోం రూల్ ఉద్యమం ప్రారంభించిన అనీబ్ సెంట్ 1915 లో మదనపల్లె లో స్థాపించిన డిసెంట్ థియొసాఫికల్ కళాశాల ( బి టి కళాశాల) లో ప్రత్యేకంగా నిర్మించిన కుటీరంలో 1919 ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు రవీంద్రనాథ్ ఠాగూర్ బసచేసారు. 
బి టి కళాశాలలో ప్రతీ బుధవారం విద్యార్థులకు జరిగే సింగేసాంగ్- ఫన్ సంగీత పోటీలను చూసి ఆకర్షితుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ తాను రాసిన జనగణమన గీతాన్ని మూడు సార్లు పాడారు. అయితే, బెంగాలీ భాషలోని జనగణమన అర్థం కాకపోవడంతో దానిని ఆంగ్లం లోకి అనువదించమని విద్యార్థులు కోరడంతో ఆయన బెంగాలీ భాషలోని జనగణమన గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. కళాశాల ప్రిన్సిపాల్ మార్గరెట్ కజిన్స్ పియానొపై సంగీత సహకారం అందించారు. ఈ రకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించి సంగీత భరితంగా మొదటిగా ఆంధ్రుల సుందర పట్టణం మదనపల్లె లో గానం చేసి విద్యార్థులచే బృంద గానం చేయించారు. ఆయన జీవితంలో ఇదో మధుర స్మృతి కాగా ఆంధ్రులకు గర్వకారణంగా నిలచింది. 1947 ఆగష్ట్ 24 న ఈ జనగణమన మన జాతీయ గీతంగా గుర్తించబడింది.
===========================
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
కామెంట్‌లు