సామెతల ఊట - సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం

 సామెత -215: ఆత్రపు పెండ్లి కొడుకు పేరంటాళ్ళ ఎంట బడ్డడంట
****
"అవ్వా! గియ్యాల నీకు శానా శానా గమ్మత్తయిన ముచ్చెటి శెప్పాల్నే!
" ఏంది శెల్లే? గంత కుశాల్గ  వున్నవ్ ? పెండ్లికి  పోతివి గద ఎప్పొడొచ్చినవ్? గా ముచ్చెటి  ఏందో జెర జెప్పు. నేను సుత కుషాలైత."
" అవునవ్వా! నువ్వు గనక గీ ముచ్చెటింటే మస్తు కుశాలైతవు. మన్సు బాగుండనప్పుడు గిది గన్క తల్సుకున్నవన్కో  గా బాదంత హుష్ కాకైతది"
 మా శిన్నత్త మన్వడు జగ్గు గాని పెండ్లికి బొయిన గద.అంగరంగ వైబోగంగ లగ్గం జరిపిచ్చిండ్రు గని..
"  జెల్ది శెప్పు శెల్లే! ఒకటే ఊరిత్తున్నవ్!"
 పెండ్లి మంచిగనే సేశిండ్రుగని గాళ్ళంత జాగు మనుషులను యాడ సూల్లేదవ్వా!"
 పొద్దుగాల మొదలు పెడ్తె  సుక్కలు బొడిశే దనుక శేత్తనే వుండ్రు శేత్తనే వుండ్రు పో.
" ఇంగ మల్ల తెల్లారి, మర్నాడు గట్ల పదారొద్దుల పండుగ  దనుక అటు పిల్లింటికి, ఈల్లింటికి తిరుగుడే అయ్యింది. ఏనాడు యాళ్ళ పొద్దుగాల ఒక్కటి సుత గాలేదన్కో.  అమ్మోర్ల పూజలనీ, వంతన అని ఏ రోజున పెండ్లి కొడుక్కి, పెండ్లివిల్లకి సయిమానికి గింత ముద్ద వెట్టుడు లేదు. మా వోనికి ఓపిక బొయ్యింది. లోపల లోపల తుక్క తుక్క వుడ్కబట్టిండని గాని మాటల్లనే అర్థమైంది.
  "ఇంగ  పెండ్లి విలగాన్నీ, పెండ్లి విల్లని ఏకం జేసుడుంది. గా సయిమంలో గాళ్ళని పీటల మీద కూసుండ వెట్టడాన్కి ఏమేమో శేత్తుండ్రు.. వొచ్చిన అమ్మలక్కలల్ల ఒకామెకు పెండ్లిళ్ళు సేశిన అనుబవం ఉందంట.శానా శానా యిష్యాలు శెప్తావుంది. పెండ్లివిల్ల దోత్తులు పెండ్లివిల్ల గా ఆల్లనే దోత్తులతో కూసుంది.దోత్తులంత అన్కొని ఒక్క తీరు శీరలు గట్టిండ్రు.బారెడు బారెడు పూలదండలు జెడ పొడుగూత పెట్టుకుండ్రు.  మన జెగ్గూ గాడికి గాళ్ళింట్ల అంత కొత్తనాయె. తెల్శిన పెండ్లివిల్ల దోత్తులతో ఉండె.
 ఈ అమ్మలక్కలు తొరగా కానీయ్యరు పెండ్లివిల్లను ఓ పక్కకి బిల్శి కూసోని ముచ్చెటి బెడ్దాం అనుకుండంట
 కుర్శీల కూసున్నోడల్ల ఒక్కపాలిగ. గా ఆడ పొల్లగాండ్లు కూసున్న కాడికి బొయ్యి  "ఓ తాన కూసోని ముచ్చెటి బెట్టుకుందా రా"  అన్కుంట  శెయ్యి బట్కొండు.
 ఇంగేముంది పేరంటాళ్ళంత ఒక్క తీర్గ  నవ్వుకుంట "ఓ పిలగ గీ తతంగం అయ్యేదనక ముత్తెమంత ఓపిగ పట్టలేవా!పేరంటాళ్ళ ఎనకబడ్డవని అంటుంటే ఆడోళ్ళంత వక్కడ వక్కడ నవ్వబట్టిండ్రు. గీడిక  ఎవ్వలికేలి సూడకుండ సిగ్గుతో తల్కాయ వొంచుకొని కూసుండు. ఇంగ ముసలోల్లైతే ఒకటే పరాష్కాలాడుడు. గక్కడున్నంత సేపు ఆడి ముచ్చెటినే అవ్వా"
 గందుకే అంటరు శెల్లే! "ఆత్రపు పెండ్లి కొడుకు పేరంటాళ్ళ ఎంట బడ్డడంట" అని అవ్వ సుత నవ్వబట్టింది.
గదండీ! సంగతి. "ఆత్రపు పెండ్లి కొడుకు పేరంటాళ్ళ ఎంట బడ్డడంట" అంటే గిదే మరి. ఆత్రానికి ఏం జేత్తరో తెల్వకుండ అయోమయంలో బడేటోళ్ళను గిట్ల గీ సామెతతో పోలుత్తరన్న మాట.
కామెంట్‌లు