“నేను కథలు పుట్టించడం లేదు “: - - యామిజాల జగదీశ్

 అది ఫ్రాన్స్ రాజధాని పారిస్. ఆ ఊళ్ళో ఓ రచయిత ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రాస్తుండే వారు. మిత్రులు ఎవరైనా తనను చూడడానికి వచ్చినప్పుడు కూడా రాయడం మానేవారు కాదు. ఒకవైపు రాస్తూనే వారి మాటలు వింటూ ఉండేవారు. చెప్పవలసిన వాటికి జవాబులు ఇచ్చే వారు.
ఓ రోజు ఆయన తన గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. బయట ఒకరు నిల్చున్నారు. ఆయనకు తోడుగా మరో వ్యక్తి. ఇంతలో రచయిత మిత్రుడొకడు కూడా వచ్చాడు. అతను వచ్చినప్పుడు రచయిత గదిలోంచి నవ్వులు వినిపించాయి.
బయట నిల్చున్న వ్యక్తి తన సహాయకుడితో “ఏంటది...గదిలో నవ్వుల చప్పుడు వినిపిస్తున్నాయి. ఆయనతో ఎవరో మాట్లాడుతున్నట్టున్నారే. కనుక మనమిప్పుడు వెళ్ళిపోదాం. మళ్ళీ వచ్చి కలుద్దాం...” అని వెళ్ళిపోబోతున్నాడు.
అయితే ఆ వ్యక్తి “అయ్యా, అలాంటిదేమీ లేదు. ఆయన ఒంటరిగానే ఉన్నారు. ఆయన తన కథలో వచ్చిన పాత్రలతోనే అలా నవ్వుతుంటారు. అది ఆయన అలవాటు...”అంటూ తన మిత్రుడిని తీసుకుని లోపలికి వెళ్లాడు.
నిజమే, లోపలికి వెళ్ళి చూస్తే రచయిత ఒక్కరే ఉన్నారు.
ఆ రచయిత తనకు తానే మాట్లాడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు.
అయితే తన మిత్రుడి వల్ల ఆ రచయిత తీరు ముందే తెలియడం వల్ల ఈ వ్యక్తి అపార్థం చేసుకోలేదు.
అదిసరే, ఇంతకూ ఆ రచయిత ఎవరుకున్నారు
ఆయనే ఆలెగ్జాండర్ డ్యుమాస్.
ఫ్రాన్స్ దేశానికి చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత ఆయన.
ఆయన త్రీ మస్కిటీర్స్ (ముగ్గురు వీరులు) తదితర సుప్రసిద్ధ నవలలు రాశారు. ఆయన ఫ్రెంచ్ భాషలో రాసిన నవలలన్నీ ఇంగ్లీషుతోపాటు అనేక భాషలలో తర్జుమా అయ్యాయి. ఆ నవలలన్నీ ఆయన గురించి ఇప్పటికీ తలచుకునేలా చేస్తున్నాయి.
క్రిస్టిన్ రాణి అనే నవల కూడా ఆయన రాసిందే.
ఆ నాటకాన్ని వేదికపై ప్రదర్శించడానికి ఓ నాటక బృందం హక్కులు కొన్నది కూడా. రిహార్సల్ వంటివన్నీ అయ్యాయి. నాటకానికి విశేష ఆదరణ లభిస్తుందని రిహార్సల్ చూసినప్పుడే అందరూ అనుకున్నారు.
అయితే సిరగ్గా ఆ సమయంలోనే ఓ విషయం జరిగింది. ఆ కథనే మరో పెద్దాయన నాటకంగా రాశారని తెలియవచ్చింది. ఆయన పేదరికంతో మగ్గుతున్నారు. తన రచనలలో ఒక్క నాటకమైనా ప్యారిస్ నగరంలో ప్రదర్శంపబడాలన్నది ఆ పెద్దాయన ఆశ. డ్యుమాస్ కు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. వేదికపై ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న తన నాటకాన్ని వెనక్కు తీసేసుకున్నారు. నాటక ప్రదర్శనకు అవసరైమన సర్వ హక్కులు ఆ పెద్దాయన రాసిన నాటకానికి విడిచిపెట్టారు.
ఇక డ్యుమాస్ రాసిన మరో నాటకం మూడో హెన్రీ. ఈ నాటకానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.
ఓరోజు ఓ మిత్రుడు ఆయనతో అవీ ఇవీ మాట్లాడుతూ నువ్వెలా కథలు రాస్తావు అని అడిగాడు.
అప్పుడు డ్యుమాస్ ఇలా జవాబిచ్చారు –
“నేను కథలను పుట్టించను. అవన్నీ తానుగానే నాలో పుట్టుకొస్తాయి” అని.
“అదెలా సాధ్యమ”న్నది ఆ మిత్రుడి మరో ప్రశ్న.
అయితే డ్యుమాస్ అదంతా తనకు తెలియదని, ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళి నువ్వెలా పండ్లను ఇస్తావు అని అడిగి చూడు నీకు జవాబు వస్తుందేమో అని అన్నారు.
డ్యుమాస్ బోలెడంత సంపాదించారు. అయితే ఆయన వాటిని  విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మిత్రుల రాకపోకలకోసం ఆయన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచారు. ఆయన ఇంట ఎప్పుడూ విందువినోదాలు జరుగుతుండేవి. ఆయన పిలిచి సన్మానం చేయడానికి వచ్చీ పోయే వారి సంఖ్య కూడా ఎక్కువే. కొందరైతే ఆయన దర్శనం కోసం వచ్చి ఓ రెండు మాటలు మాట్లాడి ఆనందంతో వెళ్ళిపోయేవారు.
ఓసారి డ్యుమాస్ ఇంట విందు జరుగుతోంది. అక్కడ ఓ వ్యక్తి ఆబగా తింటున్నాడు. ఓ మిత్రుడు ఆయనను చూసి తనకు పరిచయం చేయమని డ్యుమాస్ ను అడిగాడు.
అప్పుడు డ్యుమాస్ ఆయనెవరో తనకు తెలీదని, తననిప్పటికీ ఎవరూ ఆయనకు పరిచయం చేయలేదన్నారు.
కాలక్రమంలో ఆయన ఖర్చులతో పాటు అప్పులు పెరిగాయి.
కోర్టు సిబ్బంది ఆయన ఇంటికి వచ్చి మాట్లాడుతుండేవారు. అయితే డ్యుమాస్ కు అప్పుల వాళ్ళంటే గిట్టేది కాదు. ఓరోజు ఓ వ్యక్తి ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఓ పెద్దాయన చనిపోయారని, ఆయన  అంత్యక్రియలకు డబ్బులు కావాలని అడగడానికి వచ్చినట్టు చెప్పాడా మనిషి.
అయితే డ్యుమాస్ చనిపోయింది ఎవరు అని అడిగారు.
వచ్చినతను ఆ మరణించిన వ్యక్తి గురించి చెప్పారు. ఆయనో రుణదాత అన్నారు. విషయం తెలియడంతోనే డ్యుమాస్ వచ్చిన వ్యక్తి అడిగిన దానికికన్నా రెండింతలు ఎక్కువ ఇచ్చారు. ఇంతెందుకని అడగగా ఆ చనిపోయిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తికి  కూడా అంత్యక్రియలు చేయండి అని చెప్పారట డ్యుమాస్.

కామెంట్‌లు