సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -233: -ఆకాశానికి వెంట్రుక ముడివే‌సినట్లు
***
"అవ్వా!అవ్వా!మా శీను గాడి తాతంట శానా శానా గొప్పోడంట. గాయనకి ఎన్కట ఏడు గుర్రాలు ఉండేయంట.గవీటన్నిటికి తాళ్ళుగట్టి రతం లెక్క ఎక్కి పొయ్యేటోడంటవ్వా!" గుడ్లు గుండ్రంగ తిప్పుకుంట ఆచ్చిరం వొల్కబోత్తు బుడ్డోడు శెప్తున్న మాటల్కి మస్తు నవ్వొచ్చింది అవ్వకి".
"ఇంకేం శెప్పిండురా నీ దోత్తు?వాళ్ళ తాత గుర్రాలు ఆకాశంల పచ్చులోలె ఎగుర్తయి యని సుత శెప్పిండా? గవ్వెక్కి పెపంచకం సూసొచ్చేటోడని శెప్పిండా?"
"అవ్వోవ్! నీకు సుత మాయలు మంత్రాలు తెల్సా ఏంది? గా శీనుగాడు గివ్వే మన బుడ్డోడికి శెప్తుంటే నేను సుత శెవులు రిక్కిచ్చి మరీ యిన్నవ్వా!"
"గిస్మంటియి ఇంటుంటె ఇంక ఇంక యినబుద్ది అయితయి గదరా బుడ్డోడా?అవునానే లచ్మీ"
"అవునవ్వా! మనం నిత్తెం పూజ్జేత్తం సూడు,గా అనుమంతుడు మొగులు మీదున్న సూరియున్ని పండనుకొని  మింగడానికి పైకెగిరండా లేడా? గట్లనే శీను గాడి తాత ఎందుకు బోడు శెప్పవ్వా ?
"నువ్వైతే గిప్పటి దనుక బోలెడు ముచ్చెట్లు శెప్పేదాన్వి. గా ముచ్చెటి అనంగనే ఎక్కిరిచ్చినట్టు నవ్ తున్నవెందుకవ్వా? మన తాత సుత గస్మంటియి ఏమన్న జేశిండో యాజ్జేసుకొని శెప్పవ్వా! గాని తాత కంటే మన తాతే గొప్పని శెప్తం. లేకపోతే గాడు గంత గరువంగ శెప్తాడు. గాడైతే అవ్వా! మూతి మీద మీసాలు ఉన్నట్టు ఉత్తుత్తగ తిప్పుతుండు తెల్సా! గాడట్ల శేత్తుంటే శెంపమీంచి ఒక్కటియ్య బుద్ది అయ్యింది. గట్ల జెయ్యొచ్చా నువ్వే శెప్పవ్వా!"
 "ఒరేయ్ బుడ్డోడా! బంగారు లచ్మీ! గా శీను గాడు అన్ని అవద్దాలే శెప్తుండు. గయ్యేమో నిజమన్కొని, గాని కంటే ఎక్వ అందరికి మీరే శెప్తుండ్రు. దేవుళ్ళకంటే మయిమలుంటయని మన నమ్మకం. గంతే గని మనిషిగ పుట్టినోడెవడైనా గట్లాంటివి శేయలేవర్రా! గాడో గనీ, తాతో గని "ఆకాశానికి ఎంటిక ముడేశినట్టు"  ఎచ్చులు శెప్తుంటే పిచ్చి మొగాల్లెక్క ఇనుకుంట ఉన్నారారా. గాన్ని మనింటికి తోల్కరాండ్రి గాడితోనే అవద్దమో, నిజవోఁ శెప్పిత్త."
అగ్గో మల్లేదో శెప్పడాన్కి వొచ్చిండట్టుంది. రారా మా అవ్వ పిలుత్తుంది." 
"ఏంట్రా శీనూ మీ తాత ముచ్చెట్లు శానా శానా శెప్తన్నవంట గద. గయ్యన్ని నిజ్జంగ జర్గినయా? సుబూది శెయ్యమను."
 "అవ్వా! మా తాతతో నన్ను గుర్రాల మీద తీస్కోని మొగులు మీదకి తీస్కపొమ్మని అడ్గిన.. గప్పుడు తాత ఒక్కతీర్గ నవ్వి కతొతికె శెప్పినగని గట్ల నిజ్జంగ మడుషులు శెయ్యలేత్తరని శెప్పిన్నారా! పిచ్చోడా అన్నడవ్వా!" మాయా లోకం కతలు గట్లనే ఉంంటయంట. గయన్ని మనం ఊయిచ్చుకోడమేనంట.
అగ్గో గిప్పుడు తెల్శిందా ? ఎవ్వలూ ఆకాశానికి ఎంటికను ముడెయ్యలేరు గట్లనే నిజం గుర్రాలేస్కొని పైకి ఎగర్లేరు బాగా యాది బెట్టుకోండి. కత కతే నిజం నిజవేఁ"
 అట్లనే అవ్వా! బుద్ధిగ ముగ్గురు తలకాయలు ఊపిండ్రు."
గదండీ సంగతీ! "ఆకాశానికి ఎంటికను ముడేసినట్లు" అంటే గిదే మరి


కామెంట్‌లు