పొద్దున్నే లేచి నాలుగు మెతుకుల కోసం పరిగెత్తే నాన్న వీపు మీద చెమట చుక్క. అది బాధ.
సాయంత్రం అదే నాన్న తెచ్చిన మిఠాయికి పిల్లల కళ్ళల్లో మెరిసే వెలుగు. అది సుఖం.
అమ్మ చేతి గోరుముద్ద తినిపించే ప్రేమ ఒక వైపు. అదే అమ్మ ఆసుపత్రి మంచం మీద నిస్సహాయంగా పడుకుంటే గుండె బరువెక్కడం మరోవైపు. అది వ్యాధి, అది విషాదం.
అన్నదమ్ముల మధ్య అంగుళం భూమి కోసం పంచాయితీ. మాటలు తెగే వరకు వెళ్లిన విరోధం. మర్నాడే అదే అన్న వాకిట్లో కూలిపోతే, పరుగెత్తుకొచ్చి భుజం మీద చెయ్యేసే ఆత్మీయత. అది ఓదార్పు.
భార్యాభర్తల మధ్య చిన్న మాటకే మొదలయ్యే కలహం. అలకలు, మౌనాలు, అపార్థాలు. అదే రాత్రి జ్వరంతో మూలుగుతుంటే, నుదుటి మీద చల్లని చెయ్యేసి కలవరపడే ప్రేమ. తెలిసొచ్చిన నిజం ఏంటంటే - గొడవ పడినా, గుండెలోతుల్లో ఉన్నది అనురాగమేనని. కలిసి ఉంటే కష్టం సగమై, సుఖం రెట్టింపు అవుతుందన్నది కాపురం నేర్పే సత్యం. అనుమానం పెనుభూతం. అది చేరితే అద్దాల మేడలాంటి సంసారం క్షణంలో కూలిపోతుంది. నమ్మకమే ఆ గూటికి పునాది.
ఇంటి పక్కామెతో కుళాయి నీళ్ల కోసం కయ్యం. పొలం గట్టు మీద పొరుగాయనతో వాగ్వివాదం. అదే పక్కింటామె పండక్కి పంపిన పిండివంట. అదే పొరుగాయన వానొస్తే మన చేను గట్టు కట్టిన మమకారం. ఇరుగుపొరుగుతో సఖ్యతే మనిషికి మొదటి నేస్తం. ఇదే సఖ్యత గ్రామాల మధ్య, దేశాల మధ్య ఉంటే లోకమంతా ఒక కుటుంబమవుతుంది.
పెద్దల మాట పిల్లలు వినాలి. ఎందుకంటే అది అనుభవాల సారం. అలాగే పిల్లలు చెప్పే మాటల్లో నిజం పెద్దలు వినాలి. ఎందుకంటే అది మారే కాలపు గొంతు. రెండూ కలిస్తేనే ఇంటికి మంచి భవిష్యత్తు. అనవసరంగా ఎవరిపైనా నింద మోపకూడదు. నిప్పులేనిదే పొగరాదు అనుకుంటాం కానీ, ఒక్కోసారి పొగ రాజేసేవాళ్లు కూడా ఉంటారు. నిజం తెలియకుండా నోరు జారితే బంధాలు తెగిపోతాయి.
ఈ ఏడుపులు, నవ్వులు, అలకలు, కలయికలు లేని జీవితం ఉప్పు లేని కూర లాంటిది. కన్నీరు కార్చిన క్షణమే, ఆ కన్నీటిని తుడిచే చెయ్యి కూడా ఇచ్చేది జీవితమే. రాలిపోయిన ఆకును చూసి బాధపడతాం. అదే చెట్టుకు చిగురించిన లేలేత చిగురును చూసి సంబరపడతాం. రెండూ ఒకే కొమ్మకు. అదే జీవితం.
కష్టం లేకపోతే సుఖం విలువ తెలీదు. విరోధం లేకపోతే స్నేహం లోతు తెలీదు. విషాదం లేకపోతే సంతోషం రుచి తెలీదు. ఓర్పు, నమ్మకం, క్షమాగుణం లేకపోతే బంధం నిలవదు. మనిషిని మనిషి అర్థం చేసుకుని, తప్పును మన్నించి, ఒప్పును మెచ్చుకుని కలిసి నడిస్తే అదే స్వర్గం. అన్నీ కలిస్తేనే మనిషి బతుకు. అదే అసలైన బతుకు.
జీవితం అంటేనే ఒక కలగూరగంప : - మిత్రాజి -(గుండవరం ప్రభాకర్ రావు పంతులు )-అత్వెల్లి గ్రామం, మేడ్చల్ జిల్లా
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి