అదొక చిన్న పల్లె… గూడెం అంటారు. ఆ పల్లె చుట్టూ గుట్టలు, అడవులు అలముకుని ఉన్నాయి . పచ్చని పంట పొలాలు చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటాయి.మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. పొలిమేరల్లో ఈత చెట్లు ఎత్తుగా నిలబడి గాలికి ఊగుతుంటే పగలు ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ రాత్రివేళ అవే చెట్లు దయ్యాల్లా కదులుతున్నట్లుగా కనిపించి కొత్తవాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి.
మా నాన్నగారికి ఆ పల్లెలో టీచర్‌గా ట్రాన్స్ఫర్ అయింది. ముందుగా ఆయన రోజూ సైకిల్ మీద ఇరవై మైళ్ళ దూరం వెళ్లి వస్తుండేవారు.. అలసట ఎక్కువైపోవడంతో చివరికి ఆ ఊరిలోనే ఓ పాత ఇల్లు తీసుకుని మేమంతా అక్కడికి మారాం. నాకు అది కొత్త ఊరు… కొత్త జీవితం… ఇంకా తెలియని అనుభవాలు.
ఒక రోజు సాయంత్రం నేను ఊరి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నాను. ఆడుకుంటూ ఉండగానే ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తూ, గర్జనలు వినిపిస్తూ వర్షం మొదలైంది. మొదట చినుకుల్లా వచ్చిన వాన క్షణాల్లోనే కుంభవృష్టిగా మారిపోయింది.
ఆ ఊర్లో సందులు ఎక్కువ. చుట్టూ చీకటి కమ్మేసింది.కరెంట్ లేదు.. నేను ఆ పల్లెకు కొత్తవాడిని కాబట్టి ఇంటికి దారి కూడా సరిగా తెలియలేదు. తోటి పిల్లలు ఒక్కొక్కరు తమ ఇళ్లకు పరుగెత్తారు. నేను మాత్రం ఆ బురద నీటిలో అటూ ఇటూ తిరుగుతూ, జారిపడకుండా తారట్లాడుతూ ఏ దారి పట్టాలో తెలియక అల్లాడుతున్నాను.
అలా వెతుకుతూ ఉండగా
ఓ పాత కాలం మడిగె కనిపించింది. దానికి తలుపులు లేవు. “అమ్మయ్య!” అనుకుంటూ ఊపిరి పీల్చుకుని లోపలికి దూరాను. అప్పటికే నేను పూర్తిగా తడిసిపోయాను. చలికి వణుకుతున్నాను. గుండెల్లో చెప్పలేనంత భయం. చుట్టూ చీకటి, పైకప్పు నుంచి మట్టి రాలిపోతూ… గాలి శబ్దాలు వినిపిస్తూ ఉంటే వణికిపోతున్నాను.
ఇంతలో ఒక్కసారిగా “దభ్… దభ్…” అంటూ పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో వెనుక నుంచి తరుముకుంటూ వస్తున్నట్లు రెండు జంతువులు ఆ మడిగే వైపు దూసుకువచ్చాయి.నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. మొదట అవి ఏవో భయంకరమైన జంతువులని అనుకుని నేను భయంతో వణికిపోయాను. కానీ అవి నన్ను గమనించగానే, “ఇక్కడ ఎవరో మనిషి ఉన్నాడే!” అన్నట్టుగా ఓండ్ర పెట్టాయి.అవి గాడిదలు అని తెలిసిపోయింది.అంతే… అవి ఎంత వేగంగా లోపలికి వచ్చాయో అంతే వేగంగా వెనక్కి తిరిగి పరుగెత్తాయి.
ఆ క్షణంలో నాకు ఒక ఆశ్చర్యకరమైన నిజం అర్థమైంది.
నేను వాటిని చూసి ఎంత భయపడ్డానో, అవి కూడా నన్నే చూసి అంతే భయపడ్డాయి!
కొద్దిసేపటికి వాన తగ్గింది. బయటకు వచ్చాను. కానీ ఇంకా చీకటి అలాగే ఉంది.
ఏ దారి పట్టాలో అర్థం కాక తికమక పడుతున్నాను. అప్పుడు దూరంగా ఒక తాత కనిపించాడు. దగ్గరికి వచ్చి, “ఎవరింటికి వెళ్ళాలి పిల్లోడా?” అని మృదువుగా అడిగాడు.ఆ మాటలు వినగానే నాకు ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. నా పరిస్థితి చెప్పాను. ఆయన నవ్వుతూ, “భయపడకు… నేను తీసుకెళ్తాను” అన్నారు. ఆయనతో పాటు నడుస్తూ వెళ్తుంటే, చీకటి అంతగా భయంకరంగా అనిపించలేదు. కొద్దిసేపటికి మా ఇంటి దగ్గరకు చేరుకున్నాం.
ఇంటికి చేరుకున్నాక మా అమ్మ నన్ను చూసి ఒక్కసారిగా కౌగిలించుకుని, “ఎక్కడికి పోయావురా!” అని ఆవేదనగా అడిగింది. నాన్నగారు కూడా ఆందోళనతో ఉన్నారు.
ఆ తాతగారికి వారు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన మాత్రం సాదాసీదాగా నవ్వుతూ వెళ్లిపోయారు.
ఆ రాత్రి నేను నిద్రపోయే ముందు చాలా ఆలోచించాను.
చీకటి… వాన… గాడిదలు… ఇవన్నీ కలిపి నన్ను భయపెట్టాయి. కానీ నిజానికి ఆ భయం అంతా నా మనసే సృష్టించింది. గాడిదలు కూడా నన్నే చూసి భయపడ్డాయి. తాతగారి మాటలు వినగానే నా భయం సగం తగ్గిపోయింది.
అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే భయం అనేది చాలా సార్లు నిజం కాదు…
మన ఊహలే మన భయానికి కారణం.ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే,భయం ఒక్క అడుగు వెనక్కి తగ్గుతుంది.
ఆ చిన్న పల్లె నాకు ఒక పెద్ద జీవన పాఠం నేర్పింది......
తెలియని పరిస్థితుల్లో గందరగోళపడకుండా, ధైర్యంగా ముందుకు సాగితే మార్గం తప్పకుండా దొరుకుతుంది.
=====================================================
✍️ మిత్రాజీ
(గుండవరం ప్రభాకర్ రావు పంతులు )
ఫోన్ నం. 9949267638
అత్వెల్లి గ్రామం, మేడ్చల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి