పచ్చటి చేలు! కంటికి మేలు!: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం, 94410 58797.
1.
    పుడమికి ఆకు పచ్చని ,
                 జరీ చీర కట్టు!
    
   పచ్చటి అందాలు,
   జాలు వారు మన చుట్టు!   
  
  పసందైనపళ్ళతో ,
  ఆహ్వానించే మామిడి చెట్టు!

  ఎత్తుగా కట్టిన వేదిక,
 మెట్లతో అందరిని ఆకట్టు! 

 కూర్చున్న పెద్ద పిన్న పరస్పరం,
   అభిమానం పంచి పెట్టు!

2.
   కనుచూపుమేర విస్తరించిన,
   సౌందర్యం! 

  కంటికి కనపడదు,
   ఏమాత్రం కాలుష్యం! 
 
 ప్రశాంతంగా మాటా మంతి,
   వినిమయ సౌకర్యం! 
  
ఆ బృందాన అన్ని,
 వయస్సులవారు ప్రాతినిధ్యం! 

తయారవుతోంది వేడి, వేడి, 
 ఆత్మీయ ఆతిథ్యం! 

3.
    అదొక ఆనంద సందోహం,
       ఆత్మీయ సమావేశం! 

  ఆరోపణలు, ప్రత్యారోపణలు ,
    లేదు ఏ మాత్రం అవకాశం!
 
 అందివ్వడం ,అందుకోవడం,
    అనుభవాల మాధుర్యం! 

మళ్లీ కలుసుకోవాలంటూ,
    విడిపోయే సాహచర్యం! 

ఇదొక మానవత్వ పరిమళం,
    పంచుకునే పర్యటనం! 

4.
నేడు మనుషుల మధ్య,
      కనిపించని గోడలు!
 
కలిస్తే కల్తీ మాటల ,
       కరవాల దాడులు!
 
కలిసికున్నారంటే, 
వేసేవి కలహానికి పాదులు !

ఎంతసేపు వెతకడం ,
             నిందల దారులు!

 చివరికి మునిగి,
      తేలరు వాక్  శూరులు!

5.
మనుషులు మంచి, 
వాతావరణంలో కలవాలి! 

మాటలు పంచుకోవాలి ,
మంచి పెంచుకోవాలి!
 
పల్లెలు రేపల్లెలు ,
దర్శించి, పరవశించాలి!

 గ్రామాలు ప్రశాంత ఆరామాలు,
     విశ్రాంత ఆవాసాలు !

పల్లెకి వెళ్ళడం దూరమైన,
  సహజత్వానికి చేరువ కావడం! 
__________


కామెంట్‌లు