శ్రీనివాస్ కాఫీ తాగుతూ, "సౌమ్యా! నువ్వు రోజూ ఆ బ్యాంకు టైమింగ్‌లో వెళ్ళి, సాయంత్రం 7 గంటల తర్వాత వచ్చి కూడా, ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ ఉంటావు. పిల్లల చదువు కొంచెం చూడవచ్చుకదా?" అని కొంచెం కోపంగానే అన్నాడు..
సౌమ్య మొబైల్ మీంచి కళ్ళు తిప్పకుండానే "నువ్వే చెప్పు. శ్రీనివాస్ నువ్వు కూడా ఉదయం 8 కి వెళ్లి రాత్రి 8 కి వస్తావు. ఇంటికి వచ్చాక టీవీ చూస్తూ, పిల్లల్ని చదివించకుండా పడుకుంటావు. నేనే చూడాలా? " అంటూ సణిగింది.
ఇలా చిన్న చిన్న విషయాల్లో కలహాలు మొదలయ్యాయి.
హోం వర్క్ చేసుకుంటున్న రాహుల్ వాళ్ళిద్దరి వైపూ చూసి నిదానంగా తన పుస్తకాలు పట్టుకుని ఆ గదిలోంచి వరండాలోకి వెళిపోయాడు.
వాడి వెనకాలే అనన్య కూడా తన పుస్తకం పెన్సిల్ పట్టుకుని, గునగునా నడుచుకుంటూ వెళిపోయింది.
“పిల్లల ముందు మనం ఏమీ అనుకోవద్దు అన్నానా?” సౌమ్య ఈసారి కొంచెం తీవ్రంగానే అంటూ వంటింట్లోకి దారితీసింది.
వారంలో కనీసం రెండు మూడు సార్లైనా గట్టిగా మాట్లాడుకోవడం చూసి, పిల్లలు ఇద్దరికీ సాయంత్రం అవుతోంది. అంటే భయం పట్టుకుంది.
ఒకరోజు కూరలు తెచ్చుకోవాలని, ఒకరోజు టిఫిన్ ఏం చేయాలా అన్న దగ్గర నుంచి ఏదో ఒక సాకు మాటలు విసురు కోవడం చిలికి చిలికి గాలి వాన కావడం పరిపాటి అయింది.
కోరుకొండ గ్రామంలో చిన్న ఇంట్లో శ్రీనివాస్, సౌమ్య దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాస్ గ్రామంలోని ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆఫీసులో క్లర్క్ గా చేస్తున్నాడు. సౌమ్య ప్రైవేటు బ్యాంకులో అకౌంటెంట్ గా పని చేస్తోంది.
వారికి ఇద్దరు పిల్లలు – కుమారుడు రాహుల్ (10 సంవత్సరాలు), కుమార్తె అనన్య (7 సంవత్సరాలు). రోజూ ఉదయం 6 గంటలకు లేచి, పనులన్నీ సౌమ్య చేసి. పిల్లల్ని స్కూలుకు పంపి, తమ పనులకు వెళ్తారు. ఇది వారి రోజువారీ జీవితం. కానీ ఇటీవల కొన్ని నెలలుగా ఇంట్లో టెన్షన్ పెరిగిపోయింది.
ఒక రోజు సాయంత్రం,
రాహుల్ స్కూలు నుంచి వచ్చి, "నాన్న, మా స్కూల్ లో పిక్నిక్ ప్రోగ్రాం వేస్తున్నారట. అందరూ తమ ఫ్యామిలీలతో పిక్నిక్‌కు వస్తున్నారు. అమ్మా నాన్నను అడిగి పేర్లు ఎంతమంది వస్తే అందరి పేర్లూ ఇమ్మని మా మేడం చెప్పారు. మనం కూడా వెళ్దామా?" అని అడిగాడు.
“నేను వస్తా! నేను వస్తా!” అని గెంతుతోంది అనన్య
శ్రీనివాస్ సౌమ్య వైపే చూస్తూ, "అమ్మకి టైమ్ ఉంటుందా? ఆమెకు బ్యాంకు పనులు ముఖ్యం కదా!" అని ఎగతాళి చేశాడు.
“అదిగో! అదే వద్దన్నాను. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము. కనుకే సంసారం రోడ్డున పడకుండా నడుస్తోంది. ఎందుకు? నా ఉద్యోగం గురించి మాట్లాడతారు మీరు?” సౌమ్య రుసరుసలాడింది.
ఆ రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత సౌమ్య ఇలా అంది.
“శ్రీనివాస్! ఇదివరకు లేదు ఎందుకు అస్తమానం నన్ను ఏదో ఒకటి అనాలని చూస్తావు? పిల్లల ముందు అలాగ చిన్నపుచ్చడం అనేది మంచి పద్ధతి కాదు కదా! నేనంటే ఇష్టం లేదు అంటే చెప్పు పిల్లలతో నేను వేరే వెళ్ళిపోతాను. నీలాగే నేను కూడా కష్టపడి వస్తున్నాను కదా! ఏదో ఒక మాట అలా అంటూ ఉంటే మనసు చివుక్కు మంటుంది. అప్పుడు ఇంక ఏ పని చేయబుద్ధి కాదు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది మనసు" అంటూ సౌమ్య నీరు నిండిన కళ్లతో అంది.
శ్రీనివాస్ కూడా, "సరే, నీకు అదే ఇష్టమైతే నిన్నూ, పిల్లల్నీ వదులుకుంటానులే. నా జీవితం కూడా ఇలా టెన్షన్‌తో గడపక్కర్లేదు" అన్నాడు.
ఆ రాత్రి భారమైన మనసుతో నిద్రకు దూరమై గడిపారు.
ఇద్దరిలో రెండవ వారే తగ్గుతారేమో అని ఒకరి గురించి ఒకరు ఎదురు చూసారు.
వారం గడిచిపోయింది.
లాయర్‌ని కలిసి, విడాకుల పత్రాలు తయారు చేయమని చెప్పారు. పిల్లలకు విషయం చెప్పకుండా, లాయర్‌తో సమావేశాలు పెట్టుకున్నారు. ఇంట్లో వాతావరణం గంభీరమైంది. టెన్షన్ పెరిగింది.
అనన్య ఒక రోజు స్కూలు నుంచి వచ్చి, "అమ్మా, నాన్న నిన్ను తిట్టాడు? ఎందుకు? ఇదివరకు లాగా మనం…. సరదాగా ఎందుకు మాట్లాడుకోవడం లేదు?" అని అడిగింది.
సౌమ్య పాపను హత్తుకుని ఏడుస్తూ, "అమ్మా మనం నాన్నతో కలిసి ఉండలేం బేబీ" అంది.
రాహుల్ ఆ మాటలు విని, తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. అనన్య కూడా పరిగెట్టింది.
పిల్లల ఏడుపు చూస్తూంటే సౌమ్య గుండె తరుక్కుపోయింది.
“అయ్యో! భగవంతుడా! మేము ఏమి చేస్తున్నాము? పిల్లల కోసం కలిసి ఉండే ఏదైనా ఒక్క అవకాశం దొరికితే బాగుండును.” అనుకుంటూ దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంది.
అప్పుడే ఆ ఘటన జరిగింది.
ఆ రోజు పెద్ద వర్షం పడింది. కోరుకొండ పక్కనే ఉన్న శ్రీనివాస్ ఆఫీస్ మార్గంలో రోడ్డు మీద పెద్ద గొయ్యి ఏర్పడింది.
ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ నీటితో నిండిన గొయ్యి పక్క నుంచి జాగ్రత్తగా నడిపినా బండి స్కిడ్ అయి బురదలో పడిపోయాడు. ఒంటి నిండా బురద. బంకమట్టి ఒళ్ళంతా.
లేద్దామనుకున్నా మళ్ళీ మళ్ళీ జారిపోతున్నాడు. మసక చీకటి రాను రానూ దట్టం అవుతోంది.
ఫోన్ నీళ్ళలో పడిపోయింది. పని చేయడం మానేసింది.
సౌమ్య బ్యాంకు నుంచి వచ్చేసరికి పిల్లలు ఇంట్లో కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నారు. శ్రీనివాస్ ఇంకా రాలేదు. చీకటి చూస్తే ఆమెకు భయం వేసింది. ఆమె ఫోన్ చేసింది. రింగ్ అవుతోంది కానీ ఎవరూ ఎత్తడం లేదు.
బహుశా బండి మీద ఉన్నాడేమో అనుకుంది.
ఇంకో అరగంట ఆగి మళ్ళీ ఫోన్ చేసింది.
అదే సౌండ్.
సౌమ్య మొహంలో భయాన్ని పిల్లలు పసిగట్టారు. చేసుకుంటున్న వర్క్ ఆపి తల్లి దగ్గరకు చేరారు.
“ఏమైందమ్మా?” భయం భయంగా అడిగారు.
సౌమ్య వారిని హత్తుకుని,
“నాన్న ఫోన్ ఎత్తటం లేదు బండి మీద ఉన్నారేమో అనుకున్నాను” అంది.
ఇంతలో తలుపు చప్పుడైంది.
ఒంటినిండా బురదతో కాలు ఈడుస్తూ ఇద్దరు తెలియని వ్యక్తుల భుజాలపై చేయివేసి వారి ఆసరాతో వస్తున్న శ్రీనివాస్ ని చూసారు.
“నాన్నా!” అంటూ ఇద్దరు పిల్లలు పరుగున తండ్రిని చేరారు. వాళ్ళ ఒంటికి కూడా ఆ బురద అంటుకుంటున్న ధ్యాసే లేదు.
“ఏమైంది శ్రీనివాస్?” సౌమ్య హీన స్వరంతో అడిగింది.
వచ్చిన వాళ్ళు చెప్పారు.
“పెద్ద గండమే తప్పిందమ్మా! అటువైపు ఎవరూ ఎక్కువగా రారు కదా! పైగా వర్షం. బండి ఆయన కాలిపై పడిందేమో ఆ బురదలో లేవలేక ఒక్కడూ బండిని పక్కకు తోయలేక చాలా అవస్థ పడి ఉంటారు. అదృష్టం. ఆ సమయానికి పెద్ద బండ్లు అటు వేపు రాకపోవడం. మేమిద్దరం విజయనగరం వెళ్దామని బయలుదేరడం. మా బండి లైట్ వెలుతురులో దూరం నుండి అతన్ని చూసి ఆపాము. అతడిని బయటకు తీయడం మాకు కూడా కష్టమైంది. ఎందుకైనా మంచిది. రేపు డాక్టర్ కి చూపించి అవసరమైతే ఎక్స్-రే తీయించండి. వాళ్ళు తమ బట్టలకు అంటిన బురద చూసి నవ్వుకుంటూ వస్తాము.” అంటూ వెనుతిరిగారు.
పిల్లల సాయంతో అతడికి వేడినీళ్ళ స్నానం చేయించి, బట్టలు మార్చి వేడిగా కాఫీ కలిపి అతని చేతికి అందించింది సౌమ్య. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా
“కూర్చో సౌమ్యా! అన్నాడు. ఉద్వేగంతో గొంతు పెగల్లేదు అతనికి.
పిల్లలు ఇద్దరూ శ్రీనివాస్, సౌమ్యల మధ్య కూర్చుని, మనం అందరం కలిసే ఉండాలి" అని ఏడుస్తూ చెప్పారు.
“అవును. కలిసే ఉండాలి.” అనన్య ముద్దుముద్దుగా చేతులు రెండూ బిగించి చెప్పింది.
"సౌమ్యా! మనం విడిపోవాలని అనుకున్నాం కానీ, ఈ రోజు మన పిల్లల కోసం ఇద్దరం ఒక్కటై ఉందాము. మన సమస్యలు చిన్నవి. పని ఒత్తిడి, అలసట వలన ఇలా జరిగాయి. మనం మాట్లాడుకుంటూ పరిష్కరించు కుందాం."
సౌమ్య కళ్లలో ఆనందబాష్పాలు జారాయి. "అవును శ్రీనివాస్. పిల్లలు మన జీవితం. వారి కోసం కలిసి ఉండాలి. నేను కూడా ఇకపై టైమ్ మేనేజ్ చేస్తాను, నువ్వు కూడా పిల్లలతో టైమ్ గడుపు."
మర్నాడు, వారు లాయర్ కి కాల్ చేసి విడాకుల పత్రాలు రద్దు చేశారు.
ఇక ముందు వారు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు.
ఎందుకంటే ‘ఒకటి, రెండు, మూడు విడివిడిగా ఉంటే అంతే! ఒకటిగా కలిపి చూడు. నూట ఇరవై మూడు.’ ఒక పాట గుర్తు వచ్చింది ఆమెకు.
ఉదయాలు కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకునేవారు. సాయంత్రాలు పిల్లలతో పార్కుకు వెళ్ళేవారు. శ్రీనివాస్, సౌమ్య, రాహుల్, అనన్య సంతోషంగా నవ్వుల పువ్వులు రువ్వేవారు. అందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని అనుకునేవారు.
స్కూలు పిక్నిక్‌కు వారందరూ కలిసి వెళ్ళారు. అక్కడ రాహుల్ చెప్పాడు,
"నాన్నా! అమ్మా! మీరిద్దరూ కలిసి ఉంటే మన ఫ్యామిలీ సూపర్!” అని అన్న అంటే
“హాపీ ఫ్యామిలీ. చెల్లి సంతోషంగా అరిచింది."
శ్రీనివాస్, సౌమ్యలు ఒకరినొకరు చూసుకుని నవ్వారు. వారి జీవితం మళ్ళీ సంతోషకరంగా మారింది. పిల్లల ప్రేమ, ఒక్క అవకాశం – అది వారిని మళ్ళీ కలిపింది.
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి