ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము- 278 వ రోజు
కర్ణుడు భీష్ముడిని కలుసుకొనుట
తరువాత కర్ణుడు రథమును అధిరోహించి భీష్ముని వద్దకు వెళ్ళి కన్నీటితో పాదములకు నమస్కరించి " పితామహా ! రాధేయుడు తమ దర్శనార్ధం వచ్చాడు. కళ్ళు తెరవండి తమరు ఇలా అంపశయ్య మీద ఉండటం విధి విలాసం కాక మరేమిటి. నేను ఈ రోజు నుండి పాండవుల మీద యుద్ధానికి పోతున్నాను. పరమ పావనమైన మీ పలుకులతో నన్ను ఆశీర్వదించండి " అని పలికాడు. భీష్ముడు కళ్ళు తెరవగానే కర్ణుడు నమస్కరించి " అనఘా ! అర్జునుని అహంకారం నేను ఒక్కడినే అణుస్తాను. పాండవులను గడ్డిగరిపిస్తాను నన్ను ఆశీర్వదించండి " అన్నాడు. భీష్ముడు " కర్ణా ! సుయోధనుడు నీ అండ చూసుకునే ఉన్నాడు. కౌరవులకు సుయోధనుడు నువ్వూ అంతే జన్మతః వచ్చిన బంధుత్వం కంటే స్నేహమే గొప్పది కదా ! కౌరవ సేన భారం వహించి సుయోధనునికి మేలు చెయ్యి. అంబష్ట, పౌండ్రాది దేశములు జయించి సుయోధనుని ఆధీనము కావించిన నీకు చెప్పవలసిన పని ఏమి ? కౌరవ సేనను నడిపించి అతడికి విజయం చేకూర్చు. నాకు సుయోధనుడు ఎంతో నువ్వూ అంతే " అన్నాడు. కర్ణుడు మరొక్క సారి భీష్ముని పాదములకు నమస్కరించి అక్కడి నుండి యుద్ధరంగముకు వెళ్ళాడు. రథ, గజ, తురంగ, పదాతి దళాలను సమీకరించి వారికి ఉత్సాహం కలిగించాడు. అంతలో సుయోధనుడు అక్కడకు వచ్చి " కర్ణా ! నీ రాకతో కౌరవ సేనలు ఉత్సాహాన్ని పుంజుకున్నాయి. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్థుత కర్తవ్యం ఏమిటి " అన్నాడు. కర్ణుడు " సుయోధనా ! రారాజువైన నీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. నీవే కర్తవ్యాన్ని నిర్ణయించు " అన్నాడు. సుయోధనుడు " కర్ణా ! భీష్ముని నాయకత్వంలో ఈ పది రోజులు మన సేనలు నడిచాయి. ప్రస్థుతం మనకు ఒక సేనా నాయకుడు కావాలి. కౌరవ సేనలకు నాయకత్వం వహించుటకు ఎవరు అర్హులో నీవే నిర్ణయించాలి " అన్నాడు . కర్ణుడు " సుయోధనా ! మన యోధులందరూ నాయత్వ అర్హత ఉన్న వారే ఒకరిని నియమించిన వేరొకరికి మత్సరం కలుగుతుంది. కనుక ద్రోణుని సైన్యాధ్యక్షుని చేసిన అందరికీ అమోద యోగ్యముగా ఉంటుంది. ఆచార్యుడు, వివిధ రణతంత్ర కోవిదుడు, పూజ్యుడు , శూరుడు, వయోవృద్ధుడైనా వీరుడు అతడిని సైన్యాద్యక్షునిగా అభిషేకించండి " అన్నాడు.
ద్రోణుని సైన్యాధ్యక్షుని చేయుట
కర్ణుని మాటలు విన్న సుయోధనుడు తన తమ్ములను, మిత్రరాజులను వెంట పెట్టుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఆయనతో సవినయంగా " ఆచార్యా ! కురుసైన్యంలో అస్త్రవిద్యా ప్రావీణ్యంలోను, శౌర్య ప్రతాపాలలోను మీరు అగ్రగణ్యులు. ఇప్పటివరకు పితామహుని నాయకత్వంలో నడిచిన కురుసైన్యాలకు నేటి నుండి మీరు నాయత్వం చేసి నడిపించండి. మేమంతా మీ ఆజ్ఞానువర్తులమై ప్రవర్తిస్తాము. దేవ సేనను నడిపించిన కుమారస్వామి వలె మన సైనాలను మీరు నడిపించండి " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ద్రోణుడు " సుయోధనా ! నేను బ్రాహ్మణుడను వేద వేదాంగములను అభ్యసించిన వాడిని. నాలో క్షత్రియోచిత లక్షణములైన ధైర్యము పరాక్రమము లేవు. అయినను నన్ను మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నారు కనుక మీ కోరిక మన్నించి స్వర్వసైన్యాధిపత్యం వహిస్తాను. చెదిరి పోయిన మన సైన్యాలను సమీకరించి పాండవులతో పోరాడి మనకు విజయం చేకూర్చెదను " అన్నాడు. ద్రోణాచార్యుని మాటలకు సంతసించిన సుయోధనుడు వెంటనే సువర్ణ కలశంతో గంగాజలాలను తెప్పించి పుణ్యాహవాచన కార్యక్రమములు కావించి, పుణ్యాంగనల ఆశీర్వాదములతో వంధి మాగదుల స్త్రోత్రపాఠముల మధ్య ద్రోణునికి సైన్యాధ్యక్షునిగా అభిషేకం చేసాడు. కౌరవ ప్రముఖుల శంఖారావములు, భేరిమృదంగ నాదములు మిన్నంటగా ద్రోణుడు సైన్యాధ్యక్షుడుగా ముందు నిలువగా కౌరవ సేనలు యుద్ధ సన్నద్ధమై ముందుకు నడిచాయి. ద్రోణా చార్యుడు అయిదు రోజులు పాండవ సైన్యముతో హోరా హోరి పోరాడి ఒక అక్షౌహిని పాండవ సైన్యాలను సంహరించాడు. ఆ మహావీరుని ధాటికి ఎందరో వీరులు వీరస్వర్గం అధిరోహించారు. ఆ మహా యోధుడు అయిదు దినములు నిరంతర వీర విహారం చేసి వీర స్వర్గం అలంకరించాడు " అని సంజయుడు పలికాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి