ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రతిభావంతులు: - --శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్

  ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులే అత్యంత ప్రతిభావంతులని మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని హై స్కూల్ భవనంలో ఉషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆయన రాత (నోట్ బుక్కులు) పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అనుభవం, అంకిత భావం, అత్యధిక విద్యార్హతలు కలిగిన ప్రతిభావంతులైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల చేత విద్యా బోధన చేయిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల పట్ల మోజును విడనాడి, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించడంతోపాటు నిత్యం ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షిస్తూ పిల్లల్లో అత్యధిక విద్యా ప్రమాణాలను పెంచుటకు అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి సంపాదించిన వేలాది రూపాయలను వృధా చేసుకోకుండా, వాటిని పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారని అందుకు ఎస్ఎస్సి ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకే భవిష్యత్తులో అనేక విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహేష్, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఇతర ఉపాధ్యాయులతో పాటు  సిఆర్పిలు చందర్, ఉయ్యాల వీరయ్య, కుంట కుమారస్వామి, చంద్రకళ,  రమేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు