సరస్వతి: - యామిజాల జగదీశ్

 ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ , పద్మపురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నాది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. శరదృతువులో ఈమెను పూజిస్తారు కనుక శారద అయింది.  
ఓ రెండు సరస్వతి ఆలయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...


ముందుగా, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం విషయానికి వద్దాం. దీనినే శారదాపీఠం అంటారు. ఈ నీలం నదిని కిషన్‌గంగ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ ఆలయ శిథిలాలు తప్ప మరేవీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు మాట్లాడే వారే ఎక్కువ. ఈ ఆలయం కారణంగానే కాశ్మీరుని శారదా దేశంగా కూడా పిలవడం కద్దు. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లింది. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించారు. ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు.
దక్షయజ్ఞం తరువాత సతీదేవి శరీర భాగాలు భారతదేశమంతటా పడ్డాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తారు. వాటిలో అమ్మవారి కుడిచేయి కశ్మీరంలో పడింది. అక్కడ వెలసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుస్తుంటారు. కశ్మీరులో వెలసిన ఈ అమ్మవారిని దర్శించేందుకు దేశవిదేశాల నుంచి వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని, చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ వరకూ ఇక్కడి ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రపుటలు చెబుతున్నాయి. అలాగే కల్హణుడు వంటి పండితులు రాసిన వందల ఏళ్లనాటి గ్రంథాలలో ఈ కశ్మీర సరస్వతి ప్రస్తావన కనిపిస్తుంది. శంకరాచార్యుల వారి స్తోత్రాలలోనూ అమ్మవారి స్తుతి వినిపిస్తుంది. బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నదీ తీరాన, నీలం లోయలో ఉన్న ఈ సరస్వతికి ఆలయం శారదా, నారది అనే రెండు పర్వత శిఖరాలు తలవంచుతున్నట్లుగా కనిపిస్తాయి. శారదా దేవి జ్ఞానానికి అధిపతి. అలా ఇక్కడ వేదాధ్యయనం చేసేందుకు ఏకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉండేది. ఆ విశ్వవిద్యాలయం పేరు మీదుగానే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి శారదా పీఠం అన్న పేరు స్థిరపడిపోయింది. కేవలం జ్ఞానార్థులే కాదు గ్రంథ రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం శారదా పీఠానికి వస్తుంటారు. ఇక్కడి అమ్మవారి విగ్రహం ముందు తమ గ్రంథాలను రాత్రివేళల్లో ఉంచేవారు. ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం ముందర ఉన్న తాళపత్రాలు కనుక కదలకుండా ఉంటే, వాటి మీద అమ్మవారి అనుగ్రహం ఉందనీ, అలా కాకుండా తాళపత్రాలన్నీ చెల్లాచెదురైపోయి ఉంటే అమ్మవారికి అందులోని సారం తృప్తి కలిగించలేదనీ భావిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం వద్ద శిథిలాలు తప్ప మరేవీ లేవు. వందల ఏళ్లుగా శత్రు రాజుల దాడిలో ఇక్కడి ఆలయం దాదాపుగా ధ్వంసమైపోయింది. ఇక్కడ నివాసం ఉన్న కశ్మీరీ పండితులను తరిమేశారు.  కొందరినేమో మతం మార్పించేశారు.  అమ్మవారి విగ్రహం అయితే ఎప్పుడో అదృశ్యమయిపోయింది. శివలింగానికి సంబంధించి ఓ ఆరడగుల రాయి మాత్రం మిగిలి ఉంది. 
ఇక తెలంగాణా రాష్ట్రంలోని సిద్దిపేట డివిజన్ కు చెందిన చిన్నకోడూరు సమీపంలోని అనంతసాగర్ వద్ద గల ఆలయంలో ప్రధాన దైవం సరస్వతి.  ఈ ఆలయ ప్రతిష్ఠ 1980 మే 2వ తేదీన రౌద్రినామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రముఖ అష్టావధాని అయిన అష్టకాల నరసింహరామశర్మ నిర్మించారు. ఈ దేవాలయం సిద్దిపేట నుండి కరీంనగర్ మధ్యలో కొలువై ఉంది. ఇది హైదరాబాదు నుండి 125 కిలోమీర్ల దూరంలోనూ, మెదక్ నుండి 63 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మన దేశంలో సరస్వతి ఆలయాలు చాలా అరుదు. మొదటి సరస్వతి దేవాలయం భారత దేశంలోని వైష్ణవి దేవాలయం. ఇది జమ్మూ, కాశ్మీరు రాష్ట్రంలో ఉంది. రెండవ ఆలయం బాసరలో ఉంది. ఇక అనంతసాగరం గ్రామంలోని సరస్వతీ దేవాలయం మూడవదిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయంలో సరస్వతి సరస్వతి దేవి విగ్రహం నిలుచున్న భంగిమలో దర్శనమిస్తుంది. ఇక్కడ  వైదిక కాలెండరు ప్రకారం మాఘమాసంలో ఐదవ రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ రోజును వసంత పంచమి అని కూడా అంటారు. ఇక్కడ రాగిదోనెలు అను పేరున 8 గుహలు అష్ట తీర్ధాలుగా ఉన్నాయి. కొన్నిప్రకృతి వైపరీత్యాలతో కూలిపోగా రాగిదోన, పాలడోనా, చీకటిదొన పేరుతో ౩ గుహలు మాత్రం అక్షయ జలంతో ఉన్నాయి. ఇక్కడ మాటలు రాని చిన్నపిల్లలకు మాటలు వస్తాయని కొందరి నమ్మిక.  ఆలయ ఆవరణ విశాలమైన పచ్చటి వాతావరణం కలిగి ఉంటుంది.  ఇక్కడి అమ్మవారి విశిష్టత చాల అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఒక్కసారి దర్శిస్తే చాలు సకలసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 



కామెంట్‌లు