సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

సామెత -244: ఆకాశరామన్న చదివేది ఆకాశ పంచాంగం
***
"ఇగ్గో అవ్వా! ఊరు ఊరంతా కోడై కూత్తోంది తెల్సా! గాయనెవలో బురిడీ బాబానో, బురిడీ సాములోరో తెల్వదు గని గాయన ఏం జెప్తె గది అయితుందట.అస్లే గీ కాలం గడ్డు కాలం.రేప్రేపు ఎట్ల బత్కుతమో ఏమో ఎప్పుడే కట్టాలు నట్టాలు సుట్టుముడ్తయో తెల్వదు.గందుకే ఊళ్ళె జనాలంత గాయిన సిశ్యుని శేతిల పైసలు ఎంత మొత్తం ఎక్వ పెడ్తె అంత బాగ సద్వి సూత్తడంట."
"అవునా శెల్లే! గా బాబానో, సాములోరో గంత గొప్పాయినా? గప్పుడెప్పుడో ఎన్కట నీళ్ళ సామి అన్నరు సూడు. గస్మంటి ఆయినేనా ఏంది శెల్లె?"
గదేందవ్వా!గట్లంటవ్? తప్పు తప్పు గా నీళ్ళ సామి మోసగాడని తెల్వనే తెల్శే. గాయిన్ని గప్పట్ల పట్టుకొని తోల్కబొయ్యి   జైల్ల బెట్టిండ్రని ఇననే యింటిమి.గాయినకి గీయనకి మస్తు తేడుంది తెల్సా అవ్వా! గీ బురిడీ సామి ఆకాశ పంచాంగం సూశి, దాన్ని బాగ సద్వి బవిశెత్తులో ఎవలికేం జరుగుద్దో శెప్తడంట."
అవునా శెల్లే! సరే తీ నా మాట తప్పేగని గింతకీ ఎన్ని పైసలు తీస్కుంటుడు గాయిన సిశ్యుడు ఐదా పదా?"
 "ఏందవ్వా! నీకెందుకో గని గా సామి ముచ్చెటి నవుతాల్కి వుంది. ఐదు, పది కోపెడు శాయి సుత రాట్లే. గాయిన సిశ్యుడు ఏమన్నడంటే "శేస్కున్న వాళ్ళకి శేస్కున్నంత మా దేవా" అన్నట్టు "మీరు ఇచ్చే పైసలబట్టే మీకు మంచి జరుగుద్ది. ఆటెంక "అయ్యో సామి ముందుగాల్నే  శెప్పరైతిరి అని రంది జేత్తే నాకైతే తెల్వదు"అన్నడవ్వా!"
గట్లనా శెల్లె గింతకి ఊళ్ళోళ్ళు ఎంతెంత ఇచ్చిండ్రు.గాల్ల ముచ్చెటి ఏమో గని నువ్వెంతిచ్చినవ్?"
అగ్గో గట్లడిగినవ్ మంచిగుంది. మీ మర్ది సుత నీ లెక్కనే ఒక్క తీర్గ వొకీలొతికె అడిగడిగి సావగొట్టి శెవులు మూశిండనుకో. గీసులాడంగ శివరాకరికి ఓ ఎయ్యి ఇచ్చిండు.అప్పుడో ఇప్పుడో పాలు,నెయ్యి అమ్మి జమ జేస్కున్న ఎయ్యి కల్పి రొండేలు తీస్కబొయ్యి గా సామి సిశ్యుని శేతిల బెట్టినవ్వా! గింతకీ నువ్వెంత ఇత్తున్నవ్. మళ్ళోపాలి గా సామి సిశ్యున్ని సూట్టానికి నీ ఎంట నేను సుత వత్తవ్వా!"
 ఏంది శెల్లె నేనిచ్చుడేంది! అస్లాయన ఎవలో? గాయిన సిశ్యుడు ఎవలో? తేల్సుకుందాం పా! ఉత్త పున్నేనికి గియ్యాల మనూల్లె లచ్చలకి లచ్చలే వొసూలై ఉంటయి. పా పోదాం "
 ***
 "అగ్గో అవ్వా! గాడ ఆడా మగ గుంపైండ్రు సూడు.గాడ్నే సామి సిశ్యుడు ఉంటడు.మనోళ్ళంత ఏమేం కోరుకుంటుండ్రో ఏమో సూద్దాం జల్ది రా అవ్వా!"
"నువ్వు ముందుగాల పో శెల్లె వొత్తున్న గద."
ఓ అవ్వో! గా సామి సిశ్యుడు ఆకాశ పంచాంగం సద్వే గా గురు సామి పేరు బురిడీ సామి, బురిడీ బాబా కాదంట ఆకాశ రామన్న అంట. గాయన్ని తీసుకొత్త మీ వూళ్ళోళ్ళు అంత గీడనే కదల కుండ కూసోండి అని పాతిక లచ్చల కార్ల రయ్యిమని బొయ్యిండంట.పదకొండు గొట్టంగ బొయ్యినోడు గిప్పటి దనుక రాలేదంట అవ్వా?"
 " ఆకాశ రామన్న సదివేది ఆకాశపంచాంగం" అని బాగనే ఊళ్ళె అందర్కీ టోపీ బెట్టి పోయిండు. గాడెవడో ఆకాశ రామన్న అనంగనే మీ తెల్వి ఏమైంది. ఆకాశ రామన్న అనేటోడు ఎవడో గింత వరకు ఎవలికీ తెల్వదు. పైంగ గాడు సద్వేది ఆకాశ పంచాంగం ఉంటదా? ఉండదు గద! అంటే అంత అవద్దం అన్న మాట. గాని మాటలు బట్కొని లచ్చలు లచ్చలు ఉచ్చితార్తంగ గాని శేతుల బెడ్తారు. పొద్దుగాల లేశిన కానించి పడుకునే దనుక టీవీలల్ల పేపర్లల్ల గిస్మంటియి సూత్తనే ఉంటరు.సద్వుతనే ఉంటరు.శివరాకరికి గిట్ల మోస పోతరు. ఎట్ల శెప్పు. గాడ్ని ఇప్పుడు దొర్కబడదామన్న దొర్కడు గని పోలీసు టేషన్ల పిర్యాది శేద్దాం పదుండ్రి"
అవ్వ మాటల్కి ఏడ్సుకుంట తూడ్సుకుంట నెత్తి నోరు గొట్టుకుంట పోలీసు టేషన్కి ఎల్లి పిర్యాది సేశిండ్రు."
 గీ నడ్మల గిస్మంటియి శానా ఎక్కువైనవి అని పోలీసులు సుత శెప్పి కేసు రాసుకుండ్రు.
 గదండీ సంగతి " "ఆకాశ రామన్న సదివేది ఆకాశపంచాంగం" అంటే గిదే మరి. జెర ఎవలెవలు ఎస్మంటోళ్ళో సోంచాయించుండ్రి.గట్ల మోసబోకుండ్రి మరి.
కామెంట్‌లు