విదేశీ ముష్కరుల దండయాత్రలో శిథిలమై, దోపిడీకి గురైన పుణ్యక్షేత్రాలను జీర్ణోద్ధరణ గావించిన పరమ భక్తురాలు...
సంఘ సంస్కర్త, రాజ్యాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించిన దార్శనికురాలు...
నూతన హిందూ ఆలయాలు నిర్మించి హైందవ ధర్మం వ్యాపింపజేసిన సనాతన సారధి...
పుణ్యశ్లోక్, లోకమాతలుగా పేరుగాంచిన భారతమాత ముద్దుబిడ్డ , యోధురాలు దార్శనికురాలు, విదేశీయుల దండయాత్రలో శిధిలమైన అనేక దేవాలయాలను పునరుద్ధరించి జీర్ణోద్ధరణ గావించిన మహారాణి అహల్య భాయ్ హోల్కర్ . ఈరోజు 301 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా చౌండీ గ్రామంలో మంకోజి షిండే, సుశీల షిండే పుణ్య దంపతులకు 1725 మే 31న జన్మించారు. గ్రామ పాలకునిగానున్న తండ్రి మంకోజీ షిండే కుమార్తె అహల్యాబాయికి ఇంటివద్దనే అన్ని విద్యల్లో ప్రావీణ్యం కలిగించడమే కాక దైవభక్తిని నూరిపోసారు. సౌందర్యవతి, విద్యావంతురాలు, దైవభక్తితో పాటు వినయ విధేయతలు తోడైన అహల్యాబాయి మంచి బాలికగా పేరుగాంచింది. మాల్వరాజు మల్హర్రావు హోల్కర్ కాశీ వెలుతూ సకల గుణవంతురాలైన పదమూడేళ్ల అహల్యాబాయిని చూసి ముగ్దుడై ఆమెను తన కుమారుడు యువరాజు ఖండే రావుతో వివాహం చేయాలని కోరగా , ఆమె తల్లిదండ్రులు అంగీకరించడంతో అహల్యాబాయి , ఖండే రావుల వివాహం జరిగింది.
కొంతకాలం తర్వాత ఆమె జీవితంలో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.
1754లో భర్త ఖండే రావు కుంభార్ యుద్ధంలో శత్రువులతో జరిగిన పోరులో మరణించడంతో నాటి సాంప్రదాయం ప్రకారం సతీసహగమనం చేసుకుందామని నిర్ణయించుకొని అందుకు సిద్ధమైంది .తన రాజ్యానికి భవిష్యత్తు రాణి కావాలని, ప్రజల్ని సుఖశాంతులతో పరిపాలన చేయాలని కోరుకున్న మామ మల్హరరావు ఆమెను నివారించారు. అయితే మల్హర రావు 1766లో , కుమారుడు మాలేరావు హోల్కర్ 1767లో మరణించడంతో ఆమెకు రాజ్యపాలన చేయక తప్పలేదు . అహల్యా బాయ్ పరదా విధానాన్ని వీడి రాజ్యపాలన చేశారు. తుకోజీ రావు హోల్కర్ ని సేనా నాయకునిగా నియమించి తాను ముందుండి శత్రువులను తరిమికొట్టి రాజ్యాన్ని విస్తరించి సుస్థిర పరిచారు. రాజధానిని ఇండోర్ నుండి నర్మదా నదీ తీరంలో మహేశ్వర్ కి మార్చారు. మహేశ్వర్ ని మహానగరంగా తీర్చిదిద్దారు .శివ భక్తురాలైన అహల్యబాయి విదేశీయులు దండయాత్రలో ముష్కరులు ధ్వంసం చేసిన 12 జ్యోతిర్లింగాలని, ఇతర ఆలయాల్ని జీర్ణోద్ధరణ చేశారు , అంతేకాక భారతీయ సంస్కృతి ధర్మ పరిరక్షణకు విశేష కృషి చేశారు. రైతుల కోసం బావులు చెరువులు తవ్వించి సాగునీటి సదుపాయం కల్పించి వ్యవసాయాన్ని విస్తరించారు. ప్రజల కోసం సత్రాలు, రోడ్లు నిర్మించారు . మహేశ్వర్ చీరల పేరుతో కొత్తగా చీరలను కూడా ఆమె రూపకల్పన చేయించి నేత పనివారికి పని కల్పించారు. ఈమె గొప్ప సంస్కరణ వాది.వితంతు మహిళలకు భర్త ఆస్తిలో భాగం కల్పించారు. మహిళల ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్పించి అక్కడితో ఆగకుండా మహిళా సైనిక్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకు అత్యంత విలువ ఇచ్చినటువంటి ఆమె చేతిలో ఎప్పుడూ శివలింగం ఉండడం విశేషం . సుమారు మూడు దశాబ్దాల పాటు ఏక చక్రాధిపత్యంగా పరిపాలించి భారతదేశ చరిత్రలో ధర్మ మార్గంలో పాలించిన వీర వనితగా చరిత్రకెక్కారు. రాణి అహల్యాబాయి భారతీయులందరికీ ఆదర్శ మహిళగా , వీర వనితగా, హిందూ మత పరిరక్షకురాలిగా, ఉత్తమ పాలకురాలిగా, సంఘ సంస్కర్త గా చిరస్మరణీయురాలు. ఆమె 1795 ఆగస్టు 13న తనువు చాలించారు. భారతమాత ఔన్నత్యాన్ని, హిందూమత గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహారాణి అహల్యాబాయి హోల్కర్.
=====================================================
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది,జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీకాకుళం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి