సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 275 వ రోజు
ఇంతలో అర్జునుడు తన వింటిని శిఖండి చేతిలో ఉన్న విల్లు వెనుక పెట్టి అతి క్రూర నారాచములను భీష్మునిపై ప్రయోగించాడు. తన శరీరమున నాటుకున్న నారాచములను చూసి దుశ్శాసనుని దగ్గరకు పిలిచి " దుశ్శాసనా ! చూసితివా ఇవి శిఖండి వింటి నుండి వచ్చిన బాణములు కాదు. అర్జుని గాండీవం నుండి వచ్చిన బ్రహ్మ దండము వంటి బాణములు. నా మర్మస్థానములకు సూటిగా తగులు చున్నవి. యమదూతలవంటి ఇలాంటి దృఢమైన బాణములు వేయడం శిఖండికి చేతకాదు. నిశితమై, దీప్తివంతమై లక్ష్యం తప్పక మర్మస్థానాలకు తగులుతున్న ఈ శరములు అర్జునుడు కాక మరెవరు వేయగలరు " అన్నాడు. వెంటనే తన యావచ్ఛక్తిని ఉపయోగించి అర్జునిపై శక్తి ఆయుధమును వేసాడు. అర్జునుడు దానిని మధ్యలోనే త్రుంచి వేసాడు. భీష్ముడు కత్తి డాలు తీసుకుని రథము దిగాలనుకున్నాడు. అర్జునుడు వాటిని త్తునియలు చేసి సింహనాదం చేసి " భయపడకండి భీష్మునితో పోరాడండి అతనిని చుట్టుముట్టండి చంపండి " అని సేనలను ప్రోత్సహించాడు. పాండవ యోధులు " పొడవండి, వేయండి, నరకండి , చంపండి " అంటూ భీష్ముని పైకి పోసాగారు. వారిని కౌరవ సేన అడ్డుకుంది . ఇరుపక్షాలలో పోరు ఘోరంగా సాగింది. సూర్యుడు అస్థమించ సాగాడు. అర్జునుడు భీష్ముని శరీరంలో క్రూర నారాచములను నాటి అతడిని పడగొట్టి సింహనాదం చేసి దేవదత్తం పూరించాడు. భీష్ముడు రథం పై నుండి క్రిందికి పడ్డాడు. భీష్ముని తల తూర్పుకి పెట్టి భూమిపై కూలాడు. అతని శరీరం నేలకు తగల కుండా అతని శరీరంలోని బాణాలు శయ్యలా మారాయి.
అంపశయ్యపై భీష్ముడు
నేల కూలిన భీష్మునిలో పారమార్ధిక చింత మొదలైంది. దైవీక భావం ఆవేశించింది. దివి నుండి చూస్తున్న దేవతలు " అయ్యో ఇది దక్షిణాయనము కదా ! భీష్ముడు దక్షిణాయనంలో మరణిస్తాడేమో " అని కలవర పడ్డారు. వారి మనోభావం గ్రహించిన భీష్ముడు " దేవతలారా దక్షిణాయనమున ప్రాణము విడుచుట మంచిది కాదని శాస్త్రములు చెప్పాయి కనుక నా ప్రాణములు నా మేనిలో ఉత్తరాయణము వచ్చేవరకు నిలుపుకుంటాను. నా తండ్రికి సత్యవతితో వివాహము జరిపించిన సమయంలో నా తండ్రి నాకు ఇచ్ఛా మరణం వరంగా ప్రసాదించాడు కనుక నా ప్రాణములు నా వశంలో ఉంటాయి " అన్నాడు. అది విన్న దేవతలు సంతోషించారు. భీష్ముని తల్లి గంగాదేవి హంసల రూపంలో కొంతమంది మునులను భీష్మునికి దక్షిణాయనము గురించి తెలపడానికి పంపింది. వారు భీష్మునికి ఆ విషయం ముందే తెలిసిందని తెలుసుకుని సంతోషించి తిరిగి వెళ్ళారు. భీష్ముని స్థితి తెలుసుకున్న దుర్యోధనుడు ఈ విషయం ద్రోణునికి అందించమని దుశ్శాసనుని పంపాడు. దుశ్శాసనుడు ఈ విషయం తెలుపగానే ద్రోణుడు మూర్చిల్లాడు. కొంత సమయానికి తేరుకుని భీష్ముడు కూలిపోయినందుకు విలపిస్తూ భీష్ముడు పడిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు. భీష్ముడు పడిపోయినందుకు పాండవ సేనలో ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. పాండవేయులు, మత్స్య, పాంచాల, యాదవ రాజులు సంతోషించారు. తూర్యనాదాలు మంగళ వాద్యాలు మిన్నంటాయి. నీ కుమారులు కౌరవ ప్రముఖుల ముఖాలలో విషాదం చోటు చేసుకుంది. ఆ తరువాత యుద్ధం ఆగిపోయింది. సూర్యాస్తమయం అయింది " అని సంజయుడు పదవ నాటి యుద్ధ విశేషాలు వివరించాడు. దృతరాష్ట్రుడు " సంజయా ! ఇంతటి ఘోర వార్త విని కూడా నా మనసు ఆవంతయు చలించుట లేదు నాది హృదయమా పాషాణమా ! " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు