శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - - 141


 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
119. భక్తిగమ్యా (చతురాక్షరీ)
120. భక్తివశ్యా (చతురాక్షరీ)
నూట ఇరవైయవ నామ మంత్రము:
ఓం భక్తివశ్యాయై నమః
భక్తి చేత కట్టి వేయబడేది. ఆ భక్తికే స్వాధీనురాలు అయ్యేది, "భక్తివశ్యా".
సాధకుడు తన ఉపాసనా మార్గంలో, శ్రీమాత మీద భక్తి భావాన్ని పెంచుకుంటూ, తన చుట్టూ ఉన్న అన్ని జీవరాసులలో కూడా పరమేశ్వరి ప్రతిరూపాన్ని చూడగలిగే స్థాయికి, తనలో ఉన్న భక్తిని తీసుకుని వెళ్ళెలిగితే, అటువంటి భక్తి పారవశ్యానికి తాను కట్టుబడి ఉంటాను అని దర్శనం ఇస్తున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీచక్రరాజ‌సింహాసనేశ్వరిని, "భక్తివశ్యా" అని కీర్తించారు. అంతటి తల్లికి నమస్కారము.
పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పొలికలతో ఉండి, ఆత్మబంధువుగా, చెలికాడు, సన్నిహితుడుగా ఉన్న "ఉద్ధవుడు" , మహాభారత యుద్ధం ముగిశాక, తనలోని ఉత్సుకతను ఆపుకోలేక, "కృష్ణయ్యా! నీవు పాండవులకు ఆప్తుడివి. అర్జునుడికి, బావవు, ఇష్ట సఖుడవు కదా! మరి ధర్మరాజుని "జూదం"  ఆడకుండా ఆపలేదేం" అని అడిగాడు. "మిత్రమా! ఉద్ధవా! ఏ ఆటలోనైనా, తెలివిగా ప్రవర్తించిన వారివైపే విజయలక్ష్మి నిలబడుతుంది. ధర్మరాజును జూదం లో గెలవలేనని తెలిసిన దుర్యోధనుడు, శకుని చేత ఆడించాడు. ధర్మరాజు, తన యుక్తి శక్తులను నమ్ముకున్నాడు. ఆడాడు. ధర్మరాజు నన్ను పిలుస్తాడేమో,  అని గుమ్మం దగ్గర నిలబడ్డాను. ధర్మరాజు పిలవలేదు సరే, మిగిలిన పాండవులు కానీ, నా చెల్లెలు ద్రౌపది కానీ పిలవనే లేదు. ద్రౌపది వలులవలను వలుస్తున్నప్పుడు, తనకు శక్తి లేదని, తనవల్ల కాదనీ ఆర్తితో పిలిచింది. నా పని నేను చేసాను. జూదక్రీడ ప్రారంభంలో కూడా పిలిచి వుంటే, వచ్చేవాడిని, కాపాడేవాడిని." అని చెప్పారు, రుక్మిణీ పతి. పరమాత్మ తాను అమితమైన భక్తికి వశుణ్ణి అనే చెప్పకనే చెప్పారు.
ఇలాంటిదే, గంజేంద్రమోక్ష దృష్టాంతము. గజేంద్రుడు తన ప్రయత్నాలు చేసినంత సేపు, పరమాత్మ, పరమేశ్వరి తో పాచికల ఆటలో మునిగి వున్నాడు. "కావవే వరదా" అని అడగ్గానే, అప్పటికే పట్టుకుని వున్న, పరమేశ్వరి చెంగు పట్టుకుని ఉరికాడు, గజేంద్రుని ప్రాణరక్షణ కోసం, చేతిలో ఆయుధాలు లేకుండానే.
అనన్య సామాన్యమైన, నిశ్చలమైన నమ్మకం ఉంచి, ప్రాపంచికమైన తన శక్తి సామర్ధ్యాలను కాదని, అన్నిటికీ పరమైన భక్తి భావాన్ని మనసులో నింపుకుని, తననే వేడుకుంటున్న సాధకులను రక్షించి, మోక్ష మార్గములో ప్రయాణం చెయించడానికి, సిద్ధంగా ఉన్న శ్రీమాత "భక్తివశ్యా" అయ్యింది.
ఈ విధంగా, తరుగులేని, తిరుగులేని భక్తి పారవశ్యంతో తనలో కలవడం కోసం, తననే సాధన చేస్తున్న తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం భక్తివశ్యాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు