రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765


\లాప్టాప్ సంసారాలు, మొబైల్స్ స్నేహాలు, ఆన్లైన్ చదువులు, యూట్యూబ్ ఆటలు, జూమ్ మీటింగ్లు, ఇంస్టాగ్రామ్ ప్రేమలు, జొమాటోస్ స్విగ్గి భోజనాలు  అయినాక ప్రస్తుత వేగవంతమైన జీవితంలో అనుబంధాలు కుంచించుకొని పోయినాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే, వాటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొచ్చా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

అనుబంధాలు అంటే ఏంటి? 

అను+ బంధం.. దగ్గరగా కట్టే బంధం. తెంపినా తెగిపోనిది రక్తసంబంధం భార్యా,భర్త ప్రియురాలు ప్రేమ సంబంధం.
గురు, శిష్యుడు, స్నేహితుడు ధర్మానుబంధం, ఉద్యోగ వ్యాపారాలలో కర్మ సంబంధం.
ఇందులో ఏ బంధమైనా, ఇద్దరు వ్యక్తుల మధ్యన నిర్మింపబడే మనో వంతెన అది. అనుబంధాల ద్వారా, ఇద్దరికీ భద్రత, స్థిరత్వం కలిగమిడిని కలిగి ఒక  సుస్థిరత ఏర్పడుతుంది. నీకు నేను రక్షా, నాకు నువ్వు రక్ష అనే ధైర్యం, ఇద్దరిలోనూ  కలుగుతుంది.

అనుబంధాలు ఎందుకు దెబ్బ తింటున్నాయి? 

 ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులను వదిలి, మెట్రో నగరాలకు, విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది.  కుటుంబాలకు దూరమై ఉద్వేగాలు పెరుగుతున్నాయి. కలుసుకునే సమయం తక్కువైపోతుంది. కష్టసుఖాలు, పంచుకునే వ్యక్తులకు దూరమవుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడినాక, పిల్లలకు అమ్మమ్మ తాతయ్యల ద్వారా అందే కథలు కంచికి చేరిపోయినాయి. వస్తుజాల సమాజం ఏర్పడింది. ఎవరిని అడిగినా నో టైం... నో టైం... బట్ ఇంక్రీజ్డ్... స్క్రీన్ టైం. పోలికలు పెరిగి, మనుషులను అశాంతికి గురి చేస్తున్నాయి. నేను కేంద్రంగా కెరీర్ అనేది ఏర్పడి, వ్యక్తి తనకు తానే పరిమితమైపోతున్నాడు. ఈలోగా విలువలు దూరం జరిగిపోతున్నాయి. తాత్కాలిక సుఖాలు, కొంత  గందరగోళాన్ని సృష్టించి అనుబంధాల నుండి మనుషులను వేరు చేస్తున్నాయి. 

అనుబంధాలకు మూలం ప్రేమ!!

సంగత్ సంజాయతే  కామః... భగవద్గీత(2.62)లో చెప్పినట్లు సాంగత్యం వలననే ప్రేమ అనుబంధం, పుడతాయి. ఉద్యోగాలు దూరం అయినాక, పిల్లలు తల్లిదండ్రులతో ఉండే అవకాశం తగ్గిపోయి, వీడియో కాల్స్ ద్వారానే పలకరించుకోవడం జరుగుతుంది. అయితే ఇవి మనిషిని చూపించగలవు, కానీ ఒక స్పర్శను అందించలేవు. అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఇంగ్లీషులో ఈమెయిల్ రాయచ్చు కానీ అమ్మ కాళ్లకు దండం పెట్టినప్పుడు కలిగే అనుభూతిని పొందలేము. కుటుంబంలోని వారు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని, ఎవరి ఫోన్ లలో వారు మునిగిపోవడం కాదు, కలిసి మాట్లాడుకోవడం కలసి భోజనం చేయడం ముఖ్యం. (Digital detox) పండుగలకు కలవడం ద్వారా,  అనుబంధాలు పెరుగుతాయి. సంస్కృతి, పర్యాప్తి చెందుతుంది. మత గ్రంథాల పైన విశ్వాసం కలిగి మార్గదర్శనం అవుతుంది. ప్యాకేజీల వలలలో చిక్కి, ఒకే ఇంట్లో భార్యాభర్తలు వేరు వేరు లాప్టాప్ లతో కాపురం చేయాల్సి వస్తుంది. కాసేపు కూర్చొని మాట్లాడుకునే సమయం లేదు, వారి మధ్య ఎడం పెరిగిపోయింది. 
కాపురాలు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. 

అహం వదిలితేనే అనుబంధం!!

కుచేలుడు రాజు ముందు సిగ్గుపడకుండా, పాత స్నేహితుడి ని కౌగిలించుకున్నాడు. అట్లా బంధుత్వానికి, స్నేహానికి మధ్య పొరలను తీసివేసుకోవాలి. శ్రీరాముడు, అడుగడుగునా తనతో అనుబంధం పెనవేసుకున్న, వారిని కలుపుకుంటూ విజయం సాధించి, లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలబడ్డాడు. ఈర్ష్య ను వదిలివేయాలి. క్షమా గుణాలను అలవర్చుకోవాలి. వ్యక్తులతో సంబంధం కాదు హృదయంతో సంబంధం పెంచుకుంటే అనుబంధాల రెక్కలు గట్టిపడతాయి. 

సర్వేజనాః సుఖినోభవంతు!!

కుటుంబ సభ్యుల తో అనుబంధాన్ని కలిగి ఉండటంతో పాటు మనిషి మంచి గుణాలను కలిగి ఉండడమే గొప్ప. తత్వం అసి ఎదుటివారిలో నిన్ను చూసుకోవాలి. చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండాలి. త్యాగే నైకేన అమృతత్వ మానశుః...ఉపనిషత్ 
చెప్పినట్టు, త్యాగం ద్వారానే అమరత్వం. బంధం గట్టి పడడానికి నీవు ఏం ఎదుటివారి నుండి పొందుతావని కాదు,
ఏమిచ్చావు అన్నదే ముఖ్యం.
స్వార్థంతో కూడిన బంధం కలకాలం నిలువదు. ధర్మేణ సంబంధం... ధర్మంతో కూడిన సంబంధం శాశ్వతంగా ఉంటుంది. 
సర్వేజనాః సుఖినోభవంతు... అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేనుండాలి, అనేది అనుబంధాల యొక్క అంతిమ లక్ష్యం.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
బాగా చెప్పారు గురువుగారు...
సొంత ఇంటికే చుట్టాలయ్యారు పిల్లలు... చిన్నప్పుడు చదువుకోసం, పెద్దయ్యాక ఉద్యోగం కోసం...
అజ్ఞాత చెప్పారు…
చక్కటి వివరణ గురువుగారు సమాజ సంస్కరణకు తోడ్పడే కవితలు, వ్యాసాలు ఇంకా ఎన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము