(టీవీ లాంటి కిటికి నా ఠీవి)
వృద్ధాప్యంలో నాకు అన్ని యదార్ధంగా చూపించే నీవే రియల్ టీవీ కిటికీవి..
చల్లని గాలి, మంచి వెలుతురును అందించే మా బుజ్జి కిటికీవి..
అవసానంలో ఉన్న నాకు అశేషమైన విశేషాలు అందించే టీవీవి..
పిల్లలతో పోటీ పడనక్కర్లేదు..
పెద్దలతో పోరాడి ఓడే పనిలేదు..
ఆడవారిని అడిగే అవసరమే లేదు..
పైకం చెల్లించి చూడాల్సిన పనేలేదు..
నాకు, ఏవైనా ఇక్కడ అన్నీ ఫ్రీ ఛానల్సే..
మీట తిప్పే అవసరం లేదు.
రిమోట్ నొక్కక్కర్లేదు.
ముఖం తిప్పితే చాలు మరెన్నో ముందొచ్చి వాలుతాయి ..
ముభావంగా లేకుండా ముచ్చటిస్తాయి..
మనసుకు హాయినిస్తాయి..
అన్ని దర్శించే అద్భుత వస్తు సాధనం..
టీవీ కార్యక్రమాలు మాదిరిగా నిరంతరం మారుతూనే ఉంటాయి,
ప్రసారాలు ప్రతి నిత్యమూ..
ప్రచారాలు, ఆచారాలు,వ్యాపారాలు కనిపించే గోపురాలు, జంతువుల మూపురాలు.
అమ్మలక్కల మాటలు, దేవుని పాటలు..
పక్కింటి వారి ఊసులు, కాల్చే టపాసులు..
ప్రకటనలు, ప్రదర్శనలు
రంగు రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంటాయి..
ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తుంటాయి.
వెళ్ళేవి, వచ్చేవి, స్థిరంగా ఉన్నవి..
తారసపడుతూనే ఉంటాయి..
కిటికీ లోంచే వీక్షిస్తూ ఆస్వాదిస్తూ, ఆనందిస్తుంటాను..
టీవి లాంటి కిటికీ నా ఆప్త మిత్రుడు..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి