తలిరాకులే తోరణాలుగా
కన్నుల నిండిన నీ వెలుగే
కుంభ హారతిగా....
కొమ్మలలో చేరిపోయి
గాలి చేయు సవ్వడులు
నిన్ను ప్రస్తుతించు
నిగమ మంత్రాలుగా....
అర్ఘ్య పాద్యములివ్వాలని
దోసిలిలో నీరు పట్టి
ఆతురతగా వేచి నిలిచిన
తాపసులే తరువులుగా...
నీ కిరణ స్పర్శకై ఎదురుచూచి
గరిక పై కదలక నిలిపిన
తుహిన బిందువులు
కరిగిన నీరే అభిషేకముగా...
మెల్లగ సాగుతూ ఆగి
మౌనముగా కేలు మోడ్చి
నీకోసమే నిరీక్షించు
చల్లని ఏటి నీరు నివేదనగా...
అర్చన చేసిన అవనిని
అనుగ్రహించిన ఆదిత్యుడు
పచ్చని లోయల కనకధారగా
ప్రసరించిన పసిడి వెలుగులకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి