వంకర కన్నయ్య: - - యామిజాల జగదీశ్


 శ్రీకృష్ణుని లీలా విశేషాన్ని, ఆయన కరుణను ఎంతో అద్భుతంగా వివరించే భక్తి కథ ఇది. శ్రీకృష్ణుడు ఎందుకు "వంకరో" చాటి చెప్పే అద్భుత భక్తి కథ ఇది.
మనల్ని ఈ భవసాగరం దాటించగల సమర్థుడు ఆ శ్రీకృష్ణుడు మాత్రమే. ఈ సత్యాన్ని చాటిచెప్పే ఒక చక్కని భక్తి కథ ఇది...
ఒకరోజు, బృందావనానికి చెందిన ఒక సాధువు అయోధ్య వీధుల్లో నడుస్తూ "రాధే కృష్ణా... రాధే కృష్ణా..." అని భగవన్నామ స్మరణ చేస్తున్నారు.
అప్పుడు అయోధ్యకు చెందిన మరొక సాధువు ఆయన దగ్గరకు వచ్చి, "జపించండి 'సీతా రామ్' అని జపించండి. అంతేతప్ప 'వంకర కన్నయ్య' పేరును ఎందుకు జపిస్తున్నారు?" అని అడిగారు.
ఆ మాట వినగానే బృందావన సాధువుకు కోపం వచ్చి, "నా ఇష్టదైవాన్ని 'వంకర' అని ఎందుకు అంటున్నావు?" అని ప్రశ్నించారు.
అందుకు అయోధ్య సాధువు నవ్వుతూ ఇలా అన్నారు:
“ఆయన పేరే కృష్ణుడు... ఆయన ధామం బృందావనం... ఆయన చేసే పనులు కూడా వింతగానే ఉంటాయి.
వెన్న దొంగిలించడం, గోపికల వస్త్రాలు దాచడం, రాసలీలలు చేయడం... ఇవన్నీ సన్మార్గంలో నడిచేవారి పనులేనా? పైగా, ఆయన ఎప్పుడైనా నిటారుగా, తిన్నగా నిలబడటం ఎవరైనా చూశారా?"
ఈ మాటలు బృందావన సాధువు మనసును ఎంతో గాయపరిచాయి.
వెంటనే ఆయన బాంకే బిహారీ స్వామి సన్నిధికి వెళ్లారు. తన చేతికర్రను, కప్పుకునే దుప్పటిని అక్కడ పెట్టేసి,
"ఇన్నేళ్లు నన్ను మోసం చేశావు! ఇకపై నేను శ్రీరాముడి శరణు వేడుకుం టాను!" అని చెబుతూ అక్కడి నుండి బయలుదేరారు.
అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆయన వెంటే నడుస్తూ,
"నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు. కానీ, శ్రీరాముడు తిన్ననివాడు, నేను వంకరవాణ్ణి అని ఎందుకు అంటున్నావు?" అని నెమ్మదిగా అడిగారు.
ఆ తర్వాత ఇద్దరూ ఒక బావి దగ్గరకు వెళ్లారు. అక్కడ నీళ్లు తోడుతుండగా, పొరపాటున బకెట్ బావిలో పడిపోయింది.
కృష్ణుడు ఆ సాధువుతో,
"ఒక ఇనుప తీగను తీసుకురా. బావిలో పడ్డ బకెట్ బయటకు తీయాలి," అన్నారు.
సాధువు ఇనుప తీగను తెచ్చి ఇచ్చారు. కృష్ణుడు తిన్నగా ఉన్న ఆ తీగతో బకెట్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు.
అప్పుడు సాధువు నవ్వుతూ,
"ఇలా తిన్నగా ఉన్న తీగతో బకెట్ బయటకు వస్తుందా? దాన్ని కొంచెం వంకరగా వంచితేనే బకెట్ అందుకొని బయటకు వస్తుంది!" అన్నారు.
ఆ మాట వినగానే కృష్ణుడు మందహాసం చేస్తూ ఇలా అన్నారు: "ఒక చిన్న బావి నుండి చిన్న బకెట్ బయటకు తీయడానికే తిన్నని తీగ పనికిరాలేదు. మరి, పాపపు మహాసముద్రంలో మునిగిపోయిన మనుషులను ఒడ్డుకు చేర్చడానికి... కొంచెం 'వంకర' కరుణ, 'వంకర లీలలు' అవసరం కదా?"
అందుకే కృష్ణుడి ప్రతి లీల లోక నియమాలకు అతీతమైన దైవిక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆయన పైకి "వంకరగా" కనిపించాడు, ఆయన చూపించే అనంతమైన కరుణ మాత్రమే మనల్ని ఈ సంసార సాగరం నుండి గట్టెక్కిస్తుంది.
కామెంట్‌లు