సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -297: ఇరుగు ఇంగలం - పొరుగు మంగలం
***
"ఓ అవ్వోవ్! కొందరికి మస్తు తెల్వితేటలుంటయి. గాళ్ళు పుట్టక నేర్సుకుంటరో పుట్టి నేర్సుకుంటరో గని బలే ఆచ్చిరంగుంటది. ఏమో గట్ల నేనైతే అడగలేనవ్వా! మస్తు నాదాను అనిపిస్తది. లేకుంటే కడ్పు మాడ్సుకొని ఉండనైన ఉంటగని గట్ల సొరవగ పొయ్యి అడగనూ లేను. ఏదన్న అత్తెవసరమున్నా సొచ్చుకొని బొయ్యి గట్ల జెయ్యనూ లేను."
 "ఏంది శెల్లే! ఇంతకు ఎవలేం అడిగిర్రు? గాల్లను ఎందుకు తప్పు పడుతున్నవ్?"
"గదే అవ్వా! ఒక్కపాలి అడిగితే పోనీలే అని యియ్యబుద్ధయితదీ. గట్ల గాకుండ నిత్తెం వొచ్చుడు అప్పులోల్ల లెక్క అడుగుడు- గాల్లకే శెల్లుద్ది. మొకం సూత్తూ సూత్తూ గట్లడుగుడేందని అన్లేం. ఒక్కోపాలి అన్పిత్తది 'గియ్యన్ని మన్సుల బెట్కొని ఇత్తుంటే నడ్మల యాదికొచ్చి బయిటికేడ కక్కేత్తమేమోనని గుండె పింజాం పింజాం అంటది. గిట్ల నాకేనా ఎవ్వలికైన గిట్లనే అన్పిత్తదా అవ్వా!"
" త్యేప త్యేపకు గట్లడుగుతుంటే ఎవ్వలికైన గిట్లనే వుంటది శెల్లె!" గింతకీ ఎవలి ముచ్చెటినో శెప్పకనే పోతివి?
" గదే నవ్వా! ఎన్క బజార్ల ఏశమ్మొదినుంది సూడు.గా వొదిన ముచ్చెటి ఇరుగోళ్ళు పొరుగోళ్ళు శెప్తుంటె జెర ఇచ్ఛింత్రంగ అన్పించింది."
" గంత ఇచ్ఛింత్రం పని ఏశమ్మొదినేం జేసింది శెల్లే!"
" ఇగ్గో అవ్వా! ఏనాడన్న ఇంట్లె నిప్పు రాజేసి ఎరుగదంట. గట్లనే పేలాలు ఏయించడాన్కి ఇంట్ల మంగలం సుత లేదట. పొద్దాక గది గావాలే, గిది గావాలె అన్కుంట ఇరుగు పొరుగు ఇండ్లల్లకి పొద్దత్తమానం అడగేతందుకి పోతనే వుంటదంట. "
" గంత కర్మేం బట్టిందంట శెల్లే! లేక సత్తున్నరా ?మంచి ఎగసాయమే ఉండే.పంటల మీద ఆమ్దాని మాగనే వత్తుండే. ఎవ్వేవి గావాల్నో ఒక్క పాలే  శెప్పి తెప్పించి తెచ్చుకుంటే పాయే!"
 *
" గిట్ల జేత్తే ఏశమ్మొదినెట్లయితది. ఇరిగింటికి బొయ్యి పొయ్యి రాజేయనీకి నిప్పు తెచ్చుకోవల్శిందే. బాజాప్త తన అక్కులెక్క గాళ్ళ తాన తెల్వితేటలు సూపాల్శిందే..."
గిదేం ఇజ్జత్ తక్కువ యవ్వారం శెల్లే! ఎన్కట ఒకామె గిట్లనే ఇరుగు తాన ఇంగలం - పొరుగు తాన మంగలం తెచ్చుకొనేదంట. ఇంగ గామెను సూడంగనే" ఇరుగు ఇంగలం- పొరుగు మంగలం"వొత్తుందనేటోళ్ళంట. ఇంకొంత మందిరైతే మంగలం యాన్నో దాశి, నిప్పు ఆర్పేసి మా యింట్ల యాడుందని తిప్పి పంపేటోళ్ళంట శెల్లే"
" అయినగని అవ్వా అయిందానికి కాందానికి గట్లెవలన్న పోతరా! గట్ల పోతే గిట్లనే సులకనై ఐతరు."
"అవును శెల్లే!ఎందుగ్గారు.గస్మంటి బుద్ధి వున్న ఆళ్ళని మల్లోపాలి రానీత్తరా దూరం పెడ్తరు గని."
గదండీ సంగతీ" ఇరుగు ఇంగలం-పొరుగు మంగలం అంటే గిదే మరి.ఇంగలం అంటే నిప్పు.మంగలంఅంటే పేలాలు ఏగిచ్చుకునే కుండ పెంకు.
కామెంట్‌లు
Popular posts