ఫిర్ ఆకుల ప్రియ : - డా.. కందేపి రాణీ ప్రసాద్
 

హలో పిల్లలూ! పొట్ట బాగా ముందుకొచ్చిన ఈ అమ్మాయిని చూశారా! ఈనాటి యువ తరానికి ప్రతీకగా ఉంది కదూ! పిల్లలు ఏది పడితే అది తినడం వల్ల బాగా లావుగా తయారవుతున్నారు. దీనితో “ఒబేసిటీ” అనే సమస్య వస్తోంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు రావడం వలన పెరిగే సరికి అనేక అనారోగ్యాలు ఉత్పన్నమవుతాయి. పొట్టను లావుగా చూపించాలని వుర్ల గడ్డను ఎంచుకున్నాను. వుర్ల గడ్డలు తింటే కొవ్వు ఎక్కువై లావు అవుతారని అంటారు కదా! ఇంతకీ ఈ అమ్మాయి వేసుకున్న పావడాను గమనించారా! ఇది ‘ఫిర్’ చెట్ల ఆకులు. ఈ ‘ఫిర్’ చెట్లు ఉద్యాన వనాల్లో అందం కోసం పెంచుతారు. ఈ ఆకులు సూది వలె ఉంటాయి కానీ గుచ్చుకోవు. మృదువుగా ఉంటాయి. ఈ చెట్లు సాధారణంగా పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి కూడా ఫైన్ చెట్లకు దగ్గర సంభంధం కలిగినవి. “పినాసే” కుటుంబానికి చెందిన చెట్లు. శంఖారపు చెట్లు. ఇవి పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. వీటిని క్రిస్మస్ చెట్లుగా అలంకరించుకుంటారు అందువలన వీటిని క్రిస్మస్ చెట్లని అంటారు. వీటిలో 40 నుంచి 50 దాకా జాతులు ఉన్నాయి. “బాల్సమ్ ఫిర్, కొరియన్ ఫిర్, సిల్వర్ ఫిర్, డగ్లస్ ఫిర్” అనే రకాలను కాశ్మీరు లోయలో చూశాము. ఈ ఆకులు కొమ్మలకే అతకబడి ఉంటాయి. వీటి శాస్త్రీయ నామం ‘ఏబీస్ ఆల్బా’ ( Abis alba).
తల కోసం క్యారెట్ ముక్కను పెట్టాను. రెండు నలుపు రంగు బొట్టు బిళ్ళల్ని కళ్ళుగా అమర్చాను. ఎండు మిరపకాయను నోరుగా పెట్టాను. కొత్తిమీరను జుట్టుగా అమర్చాను. పెద్ద పొట్ట కోసం వుర్ల గడ్డను పెట్టాను. చేతుల కోసం చిక్కుడు కాయల్ని పెట్టాను. పావడా గా ఫిర్ ఆకుల్ని పెట్టాను. బెంగుళూర్ నుండి తెచ్చాను ఈ ఆకులు. ఇవి కదులుతూ భలే అందంగా ఉంటాయి.
కామెంట్‌లు